మహిళలకు ఉపయోగం లేని కేంద్ర బడ్జెట్‌

– ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ ఎన్నికల ముందు ప్రచార ఆర్భాటం తప్ప మహిళలకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేదని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి విమర్శించారు. బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వల్ల పేదలకు మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బడ్జెట్‌ లో ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచకుండా గతేడాది సవరించిన బడ్జెట్‌ కంటే తక్కువ కేటాయింపులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు మహిళల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయనీ, పెరుగుతున్న ఆకలి, ఆర్ధిక దుస్థితిపై బడ్జెట్లో దృష్టి సారించి తగిన విధంగా కేటాయింపులు చేయలేదని తెలిపారు. 2014-2021 మధ్య మహిళా కార్మికుల ఆత్మ హత్యలు 137 శాతం పెరిగాయనీ, ఇది మన ఆర్ధిక దుస్థితిని తెలియచేస్తోందని ఆమె వివరించారు. అయినా మహిళాభివద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచకపోవడం మోడీ సర్కారు నైజాన్ని బయటపెడుతున్నదని పేర్కొన్నారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన బాలికల పొదుపు మొత్తాల పధకం ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదనీ, జన్‌ ధన్‌ పధకంలో అనేక మోసాలు ఉన్నట్టు కాగ్‌ బట్టబయలు చేసినా మహిళా సాధికారత గురించి పాటు పడుతున్నట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సరికాదని విమర్శించారు.

Spread the love