ఆత్మ విశ్వాసం, అహంకారం రెండూ పరస్పరం విరుద్దమైనవి. రెండింటికి ఎంత తేడా ఉందో ఓసారి గమనిద్దాం. ఆత్మ విశ్వాసం అంటుంది… నేను చాలా మంచివాడినని. అహంకారం అంటుంది… నేను ఇంకా మంచి వాడిని, నా అంత మంచి వారు లోకంలో లేరని. ఆత్మ విశ్వాసం అంటుంది నేనెప్పుడూ ఓడిపోనని. అహంకారం అంటుంది నన్నెవరూ ఓడించలేరని. ఆత్మ విశ్వాసం అంటుంది నేను ఏ పోటీకైనా సిద్ధం అని. కానీ అహంకారం అంటుంది నాకు ఎవరూ పోటీ కాదు అని. ఈ రెండింటిలో చివరికి ఆత్మ విశ్వాసపు ఫలితం ‘విజయం’ వైపు పయనిస్తే, అహంకారం ఫలితం వినాశనానికి దారి తీస్తుంది.
ఈ రెండింటికి ఉదాహరణగా విజయం పరాజయం పొందిన పాండవులు – కౌరవులు లేదా రాముడు రావణుడు ఇలా ఇతిహాసాలలో ఇంకా ఎందరినో తీసుకోండి. మీకు ఓ సాదశ్యం తట్టుతుంది. రామాయణంలో కొన్ని పాత్రలు తీసుకుంటే రావణాసురుడు తనకన్నా గొప్ప యోధుడు లేడనే అహంకారమే (వినాశానకాలే విఫరిత బుద్ధి) అతని పతనానికి దారి తీసింది. ఆత్మ విశ్వాసానికి ఉదాహరణ అంజనాసుతుడు హనుమంతుడు. ఎన్నో యోజనాలు వున్న సముద్రాన్ని ఒక్క ఉదుటన లంఘించి మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా సీతాన్వేషణలో సఫలీకతుడై శ్రీరాముడికి సీత సమాచారం ఇచ్చి తన సమర్ధతను చాటుకుంటాడు. శ్రీరాముడిని కూడా ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా చెప్పవచ్చు. అలాగే భారతంలో దుర్యోధనుడు అహంకారానికి పరాకాష్ఠ, అతడి అహంకారమే కురువంశము నాశనం కావటానికి కారణం ఐనదని చెప్పవచ్చును. మేనమామ శకుని, కర్ణుడు, ద్రోణుడు తాత భీష్ముడి లాంటి వారు తోడు వుండగా తనను ఎవరూ ఏం చేయలేరనే అహంకారంతో తన పతనాన్ని తానే లిఖించుకుంటాడు. మరి ఆత్మ విశ్వాసానికి ఉదాహరణగా పాండవులను చెప్పవచ్చును. ఇందులో పాండవులు ధర్మపక్షం నిలబడినా వీరి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి 18 రోజుల కురుక్షేత్రంలో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నా వీరికి సమన్వయకర్తగా గొప్ప పాత్రను పోషించినవాడు శ్రీకష్ణుడు. శ్రీకష్ణుడు వీరితో ఎప్పటికప్పుడు వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు వేసి వారిలో ఆత్మ విశ్వాసం సడలకుండా చేయడం గొప్ప విషయం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలిసినదే. ఇక్కడ శ్రీ కష్ణుడి దీరోదాత్తమైన వ్యక్తిత్వం కూడా ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు.
ఇక ఈ కాలం విషయానికి వస్తే ఒకరి పేరు అని ఎలా చెప్పగలం. నేడు మనం చూస్తున్న ఆవిష్కరణలకు కారకులైన శాస్త్రవేత్తలందరిలో ఆత్మవిశ్వాసం తొనికసలాడటం వల్లే ఇన్ని ఆవిష్కరణలు జరిగాయని చెప్పవచ్చును. అది న్యూటన్ కావొచ్చు, ఐన్స్టీన్ కావొచ్చు, స్టీఫెన్ హాకింగ్, ఇలా చెప్పుకుంటూపోతే జాబితా చాలా పెద్దదవుతుంది. అంతెందుకు ఇప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న కత్రిమ మెదను సష్టించిన శాస్త్రవేత్తలది కూడా ఆత్మవిశ్వాసమే. ఇటీవలే అంతరిక్షం నుండి తొమ్మిది నెలల అనంతరం సురక్షితంగా భూమికి వచ్చిన సునీత విలియమ్స్, బాబ్ విల్మోర్ లది కూడా ఆత్మ విశ్వాసమే. బలమైన ఆత్మవిశ్వాసమే వారిని తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో ఆరోగ్యంగా, సురక్షితంగా వుంచగల్గింది. ఇక ఈ కాలంలో అహంకారం వున్న వ్యక్తుల జాబితా చెప్పాలంటే కొంచెం కష్టమైన విషయమే. ఎందుకంటే ఎవరు, ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో అంచనా వేయడం కష్టం. అహంకారం వల్ల వ్యక్తి పతనం వ్యక్తే వ్యవస్థగా ఎదిగినప్పుడు ఆ వ్యక్తి చేసే ఏ చిన్న పొరపాటైనా మొత్తం వ్యవస్థపై పడుతుంది. ఫలితంగా సమాజంపై కూడా దాని ప్రభావం కచ్చితంగా వుంటుంది. ఉదా: జర్మనీ నియంత హిట్లర్ అహంకారపూరిత చర్యల వల్ల జర్మనీ చాలా నష్టపోయింది. మొత్తం జర్మనీ సమాజంపై, ప్రపంచంపై కూడా దాని ప్రభావం పడింది. ఒక్కడి తప్పుడు విధానాల వల్ల జర్మనీ కోలుకోవడానికి దశాబ్దాల కాలం పట్టింది.
అహంకారం, ఆత్మ విశ్వాసం రెండూ ఒక మనిషిలో వుండే భిన్న కోణాలు. సమయం సందర్భాన్ని, బట్టి పరిస్థితులను బట్టి మనిషి అప్పుడప్పుడు తలొగ్గాల్సి వుంటుంది. అలా ఉండటం ఓటమి కాదు అన్న వాస్తవికమైన సత్యాన్ని గ్రహించాలి.
ఇనుప సంకెళ్ళతో ఖైదీని బందిస్తారు, ఇత్తడితో ధ్వజ స్తంభం అలంకరింపబడుతుంది. బంగారు ఆభరణాలు ధరించి మనిషి హుందాతనాన్ని ప్రదర్శిస్తాడు. బయటికి ఎలా కనిపిస్తున్నామనేది మనం స్పందించే విధానాన్ని (అహంకారంతోనా, ఆత్మ విశ్వాసంతోనా) బట్టి వుంటుంది. ”నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది” అన్న సామెత ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. చచ్చిన చేప నీటి ప్రవాహానికి కొట్టుకొనిపోతుంది. అదే బ్రతికి వున్నప్పుడు నీటి ప్రవాహానికి ఎదురీదుతుంది. కాబట్టి మీరు ఎలా ఉంటారనేది మీరే నిర్ణయించుకోవాలి. అది మీ వ్యక్తిత్వాన్ని ప్రతిభింబించేలా వుండాలి. ‘ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడు గొప్పోడు’ అన్న సినిమా డైలాగ్ సందర్భోచితమైన స్థితిని తెలియజేస్తుంది. అందుకే మీరు ‘అహంకారంగా’ వుంటే మీ పతనాన్ని మీరు కొని తెచ్చుకున్నట్లే. ‘ఆత్మ విశ్వాసం’తో వుంటే మీ విజయానికి మీరు బాటలు వేసుకున్నట్లే. మీరు ఎలా ఉండాలనేది మీ చేతిలోనే ఉంది.
– డా||మహ్మద్ హసన్, 9908059234