– కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి
– ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా..
– సీఎంగా మోడీ మాటలు.. పీఎంగా ఆచరించట్లే
– స్వామినాథన్ సిఫారసుల అమలుతోనే భారతరత్నకు సార్ధకత
– సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సదస్సులో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించాలని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న అన్నదాతలపై మోడీ ప్రభుత్వం కాల్పులు జరపడం అమానుషమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఎంఎస్‌పీపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీ చైర్మెన్‌గా వ్యవహరించిన నాడు గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ నేడు ప్రధానమంత్రిగా ఆ కమిటీ సూచనలను ఆచరణలో పెట్టడం లేదని విమర్శించారు. స్వామినాథన్ సిఫారసుల అమలుతోనే ఆయనకిచ్చిన భారతరత్నకు సార్ధకత చేకూరుతుందని.. స్వయంగా ఆయన కుమార్తె మధుర వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన స్థానిక మంచికంటి మీటింగ్ హాలులో ఆదివారం నిర్వహించిన సదస్సులో పోతినేని మాట్లాడారు.
ధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, వాణిజ్య తదితర 23 రకాల పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. నీతి ఆయోగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న స్వామినాథన్ సిఫారసులను అమలు చేయకుండా.. ఆయన మరణానంతరం భారతరత్న ఇవ్వడం అవార్డుకు సార్ధకత చేకూరినట్టు కాదని తెలిపారు. వాస్తవ ధరకు కౌలు, పెట్టుబడి, శ్రమ, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు.. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మొత్తం ఖర్చుపై 50 శాతం అదనంగా ఎంఎస్పీ నిర్ధారించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలనే ఆరు డిమాండ్ల సాధన కోసం రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నట్టు చెప్పారు. భూసేకరణ చట్టం- 2013ను సైతం మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ విలువైన పంట భూములను కార్పొరేట్లకు కట్టబెడుతుందని ఆరోపించారు. పెసా, 1/70 చట్టాలను కూడా తుంగలో తొక్కుతున్నారని తెలిపారు. ఢిల్లీలో రైతుల ఆందోళనలకు మద్దతుగా నిర్వహించే ఉద్యమాలకు సంఘీభావం తెలపాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, బుగ్గవీటి సరళ, బండి రమేష్, వై. విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.