టార్గెట్‌ ఏ రూ.10 వేల కోట్లు

 The target is Rs.10 thousand crores– ఖజానా పూడ్చుకునేందుకు సర్కారు కసరత్తు
– తెరపైకి మరోసారి పెండింగ్‌ దరఖాస్తులు
– మార్చి 31 వరకు కటాఫ్‌ గడువు
– ఎల్‌ఆర్‌ఎస్‌ కింద 25. 44 లక్షల అప్లికేషన్లు
– దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ, కోర్టు కేసులున్న భూములకు వర్తించదని వెల్లడి
వట్టిపోయిన తెలంగాణ ఖజానాను నింపేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి నుంచి ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో లేఅవుట్‌ రెగ్యూలరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)ను తెరపైకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2020లో ఈ పథకానికి ధరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది మార్చి 31 వరకు ఫీజు చెల్లించేందుకు కటాఫ్‌ డేట్‌ విధించింది. ఫలితంగా రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని సర్కార్‌ భావిస్తోంది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్దీకరణకు గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని తీసుకొచ్చింది. 2020లో ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు చిన్న, మద్యతరగతి ప్రజల నుంచి మొదలుకుని రియల్టర్ల వరకు పోటీ పడ్డారు. ఆగస్టు 31 నుంచి అక్టోబర్‌ 31 వరకు రెండు నెలల పాటు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారు. కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ అంశంపై పలువురు న్యాయస్థానాన్ని అశ్రయించడంతో పథకానికి బ్రేకులు పడ్డాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం లక్షల సంఖ్యలో ప్రజలు దరఖాస్తు చేసుకున్నారనీ, కోర్టు తుది ఉత్తర్వులొచ్చేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోమనీ, అయితే వాటిని పరిశీలించి అర్హతగల వారిని ఎంపికే చేసేందుకు అనుమతినివ్వాలని అప్పటి ప్రభుత్వంకోరింది. ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి తీసున్నందున క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. మొదటి దశలో దరఖాస్తుల పరిశీలన, రెండవ దశలో స్థలాల క్రమబద్ధీకరణ అర్హత గుర్తించి సిఫారసు చేయడం, మూడో దశలో సంబంధిత అధికారి నిబంధనల మేరకు ఫీజు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఈ ప్రక్రియ పూర్తయినప్పటికి మూడున్నరేండ్లుగా ఎలాంటి పురోగతి కన్పించలేదు. తాజాగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుదారులు మార్చి 31లోగా లే-అవుట్లను క్రమబద్ధీకరించుకనేందుకు అవకాశం కల్పించింది. దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్‌ లను క్రమబద్ధీకరించనున్నట్టు సర్కార్‌ ఈ సందర్భంగా తెలిపింది.
క్రమబద్దీకరణ చార్జీలు
చదరపు గజం ధర రూ. 3,000 కంటె తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్‌ విలువలో 20 శాతం చెల్లించాలి
రూ.3,001 నుంచి రూ.5,000 వరకు 30 శాతం
రూ.5,001 నుంచి రూ.10,000 వరకు 40 శాతం
రూ.10,001 నుంచిరూ.20,000 వరకు 50 శాతం
రూ.20,001 నుంచి 30,000 వరకు 60 శాతం
రూ.30,001 నుంచి రూ.50,000 వరకు ఉంటే 100 శాతం చెల్లించాలి.
ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణలో నాలా కన్వర్షన్‌ (వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు) నిర్ణయించిన ఫీజును అదనంగా చెల్లించాలి. ఆమోదం పొందని లే అవుట్లలో 10 శాతం ఖాళీ స్థలం అందుబాటులో లేక పోతే ప్లాట్‌ విలువలో 14 శాతం ప్రో రేటా ఓపెన్‌ స్పేస్‌ చార్జీలు చెల్లించాలి.
అర్హుల ఎంపికపై అనుమానాలు?
గ్రామ పంచాయితి నుంచి మొదలుకుని కార్పొరేషన్ల వరకు వేలాది అక్రమ లేఅవుట్‌ వెంచర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 25.44 లక్షల ధరఖాస్తుల్లో సగం వారివే అని తెలుస్తోంది. నిబంధనలు అతిక్రమించిన వారి ధరఖాస్తులకు సైతం గత సర్కార్‌ ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతించినట్టు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. రోడ్డు వెడల్పు, కనీసం 9 మీటర్లుండాలి, బలహీన వర్గాలకు చెందిన లే అవుట్లు లేదా 100 మీటర్ల ప్లాట్లకు తక్కువ ఉన్న వాటిలో రహదారి 6 మీటర్ల వరకు ఉండాలి.
అవసరమైన భూమి లేకుంటే రెండు వైపులా సమానంగా వెడల్పు చేయడానికి అవసరమైన భూమి ఉండాలి. ఇలా అనేక నిబంధనలు ఉన్నప్పటికి అప్పటి సర్కార్‌ ఆదాయం కోసం వాటిని ఓవర్‌ కం చేసి సరైనవేనని సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. అయితే కోర్టులో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో ఆ పథకం మూడున్నరేండ్లుగా పెండింగ్‌లో ఉంది.

Spread the love