– ప్రీ క్వార్టర్‌ఫైనల్లో పరాజయం
– తనీశ, అశ్విని జోడీ, ప్రణరు సైతం
– ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్
2024 పారిస్ ఒలింపిక్స్ ముంగిట టీమ్ ఇండియా షట్లర్లకు గట్టి ఎదురుదెబ్బ. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు ఆశిస్తున్న మన షట్లర్లు.. బ్యాడ్మింటన్ పవర్‌హౌస్‌లు తలపడే ఆసియా చాంపియన్ షిప్స్‌లో సత్తా చాటాలని తపించారు. కానీ వరల్డ్ నం.1 జోడబీ సాత్విక్, చిరాగ్‌లు పోటీ నుంచి తప్పుకోగా.. బరిలో నిలిచిన అగ్ర షట్లర్లు సింధు, లక్ష్యసేన్, ప్రణరు, శ్రీకాంత్‌లు మట్టి కరిచారు. ఆసియా బ్యాడ్మింటన్ వైఫల్యంతో భారతబ్యాడ్మింటన్ క్రీడాకారులు మరింత ఒత్తిడిలో పడ్డారు!.
నింగ్‌బో (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్ల పోరాటానికి తెరపడింది. జంబో బృందంతో చైనాకు చేరుకున్న భారత బ్యాడ్మింటన్ జట్టు.. రెండో రౌండ్‌కే చాప చుట్టేసింది. 2024 పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్న రెండు సార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి సింధు మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో పరాజయం పాలైంది. 69 నిమిషాల పాటు సాగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో పి.వి సింధు పోరాడినా ఓటమి తప్పలేదు. మ్యాచ్‌కు ముందు చైనా షట్లర్, ఆరో సీడ్ హన్ వీపై 5-0 క్లీన్ రికార్డుతో బరిలోకి దిగిన సింధు మూడు గేముల మ్యాచ్‌లో నిరాశపరిచింది. 18-21, 21-13, 17-21తో సింధు పోరాడి ఓడింది. ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌ను సింధు దూకుడుగా మొదలెట్టింది. 8-4తో ఆరంభంలోనే ఆధిక్యం దక్కించుకుంది. 14-8తో మరింత ముందుకెళ్లిన సింధు ఆ తర్వాత వరుస తప్పిదాలు చేసింది. సుదీర్ఘ ర్యాలీలతో సింధుపై పైచేయి సాధించిన చైనా షట్లర్ 15-15తో స్కోరు సమం చేసింది. గేమ్‌ను నియంత్రణలోకి తీసుకున్న హన్.. వెనక్కి తగ్గలేదు. 21-18తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. కీలక రెండో గేమ్‌లో సింధు ఎదురుదాడి చేసింది. దూకుడుగా ఆడుతూ పాయింట్ల వేట సాగించింది. దీంతో 16-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పుంజుకునేందుకు చైనా అమ్మాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా సింధు జోరు తగ్గలేదు. 21-13తో రెండో గేమ్‌ను సింధు సొంతం చేసుకుంది. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. డిసైడర్‌లో సింధుకు మంచి ఆరంభం దక్కినా.. తెలుగు తేజం సద్వినియోగం చేసుకోలేదు. 8-4తో చైనా అమ్మాయి ముందంజలోకి వెళ్లింది. లాంగ్ ర్యాలీలతో దూకుడు ప్రదర్శించిన చైనీస్ షట్లర్ ఈ క్రమంలో తప్పిదాలు చేసింది. దీంతో 10-10తో స్కోరు సమమైంది. ఈ సమయంలో పుంజుకున్న హన్ 17-10తో భారీ ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత సింధు చేసిన ప్రయత్నం పాయింట్ల అంతరం కుదించేందుకే సరిపోయింది. 21-17తో నిర్ణయాత్మక గేమ్‌తో పాటు క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌ను సైతం హన్ వీ సొంతం చేసుకుంది.
ముగిసిన పోరాటం : ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత పోరాటానికి తెరపడింది. మహిళల డబుల్స్‌లో తనీశ క్రాస్టో, అశ్విని పొన్నప్ప జోడీ పరాజయం పాలైంది. ప్రీ క్వార్టర్‌ఫైనల్లో 17-21, 12-21తో మూడో సీడ్ జపాన్ షట్లర్ల చేతిలో అశ్విని, క్రాస్టో ఓటమి చెందారు. తొలి రౌండ్లో భారత షట్లర్లకు వాకోవర్ లభించిన సంగతి తెలిసిందే. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్.ఎస్ ప్రణరు సైతం పరాజయం పాలయ్యాడు. ఏడో సీడ్ ప్రణరు 18-21, 11-21తో అన్‌సీడెడ్ చైనీస్ తైపీ షట్లర్ లిన్ చున్ యి చేతిలో కంగుతిన్నాడు.