– భారత్‌లో కొనసాగుతున్న డోపింగ్ కలకలం
న్యూఢిల్లీ : ఇటీవల వాడా విడుదల చేసిన నివేదికతో భారత క్రీడా రంగం ప్రతికూల ప్రభావానికి గురైంది. అంతర్జాతీయ క్రీడా సమాజం దృష్టిలో భారత్‌లో అత్యధిక డోపింగ్ కేసులు వస్తున్నాయనే ప్రచారం జరిగింది. ఇది అథ్లెట్లను కలవరపాటుకు గురి చేస్తుండగా.. మరోవైపు డోపింగ్ పాజిటివ్ కేసులు కొత్తగా వస్తున్నాయి!. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన ఓ స్టార్ మహిళా అథ్లెట్ తాజాగా డోపింగ్‌లో దొరికిపోయింది. ఫిబ్రవరి 16న సేకరించిన శాంపిల్స్‌లో మహిళా అథ్టెట్ నిషేధిత ఉత్పేరకాలు వాడినట్టు తేలింది. శాంపిల్ పాజిటివ్‌గా తేలినా.. అథ్లెట్‌పై ఎటువంటి సస్పెన్షన్ విధించలేదు. రానున్న టోర్నమెంట్లలో పోటీపడేందుకు ఎటువంటి నిషేధం విధించలేదు. సంతాన సాఫల్యత కోసం సదరు మహిళా అథ్లెట్ వైద్య చికిత్స తీసుకోగా.. ఆమె శాంపిల్స్‌లో క్లోమిఫెనె ఉన్నట్టు వెల్లడైంది. వాడా నిబంధనల ప్రకారం సంతాన సాఫల్యత చికిత్సలో భాగంగా నిషేధిత ఔషధాలు తీసుకునే మహిళా అథ్లెట్లు ముందుగా మినహాయింపు కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. భారత అథ్లెట్ ఈ మినహాయింపు కోసం దరఖాస్తు చేసిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఈ అథ్లెట్ డోపింగ్‌లో దొరకటం ఇది మూడోసారి అని సంబంధిత వర్గాల సమాచారం.