సన్‌రైజర్స్‌ జోరు

Sunrisers Joru– పంజాబ్‌ కింగ్స్‌పై ఘన విజయం
– తెలుగు తేజం నితీశ్‌ అర్థ సెంచరీ
– హైదరాబాద్‌ 182/9, పంజాబ్‌ 180/6
నవతెలంగాణ-ముల్లాపూర్‌
ఐపీఎల్‌ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మూడో విజయం సాధించింది. ముల్లాపూర్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం నమోదు చేసింది. 183 పరుగుల ఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ చతికిల పడింది. ధావన్‌ (14), బెయిర్‌స్టో (0), ప్రభుసిమ్రన్‌ (4) విఫలమయ్యారు. శామ్‌ కరన్‌ (29), సికిందర్‌ రజా (28), జితేశ్‌ శర్మ (19) మెరిసినా.. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగింది. ఆఖరు ఓవర్లో 29 పరుగులు అవసరం కాగా జైదేవ్‌ ఉనద్కత్‌పై ఆషుతోశ్‌ (33 నాటౌట్‌, 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్‌ సింగ్‌ (46 నాటౌట్‌, 25 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) విరుచుకుపడినా.. పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులే చేసింది. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌, కమిన్స్‌, నటరాజన్‌ రాణించారు. అంతకుముందు, తెలుగు తేజం నితీశ్‌ కుమార్‌ రెడ్డి (64, 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగగా సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది.
తడబడినా..దంచికొట్టారు :
సొంతగడ్డ ముల్లాపూర్‌ స్టేడియంలో టాస్‌ నెగ్గిన పంజాబ్‌ కింగ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. సన్‌రైజర్స్‌ ఓపెనర్లు ట్రావిశ్‌ హెడ్‌ (21), అభిషేక్‌ శర్మ (16, 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) సహజంగానే దూకుడుగా ఆడారు. మూడు ఓవర్లలో 26/0తో నిలిచిన సన్‌రైజర్స్‌కు అర్షదీప్‌ సింగ్‌ గట్టి షాక్‌ ఇచ్చాడు. ఒకే ఓవర్లో ట్రావిశ్‌ హెడ్‌, ఎడెన్‌ మార్‌క్రామ్‌ (0)ను సాగనంపాడు. అభిషేక్‌ శర్మ దూకుడు కొనసాగించినా.. కరన్‌ ఓవర్లో అతడూ డగౌట్‌కు చేరుకున్నాడు. ఈ స్థితిలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి (64) అద్భుత ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. పది ఓవర్లలో 66/4తో స్వల్ప స్కోరుకు పరిమితం అయ్యేలా కనిపించిన సన్‌రైజర్స్‌ను నితీశ్‌ కుమార్‌ రెడ్డి నిలబెట్టాడు. మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 32 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన నితీశ్‌..అబ్దుల్‌ సమద్‌ (25) జతగా 20 బంతుల్లోనే 50 పరుగులు పిండుకున్నాడు. నితీశ్‌, సమద్‌ జోరుతో ఊపందుకున్న సన్‌రైజర్స్‌ను అర్షదీప్‌ మళ్లీ దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్లో సమద్‌, నితీశ్‌లను అవుట్‌ చేసి పంజాబ్‌ కింగ్స్‌కు ఊరట అందించాడు. షాబాజ్‌ అహ్మద్‌ (14 నాటౌట్‌), భువనేశ్వర్‌ కుమార్‌ (6), జైదేవ్‌ ఉనద్కత్‌ (6 నాటౌట్‌) ఆఖర్లో మంచి ముగింపు అందించారు.

Spread the love