ఒలింపిక్స్‌ ఆశలు ఆవిరి

Olympics hopes evaporated– ప్రి క్వార్టర్స్‌లో పురుషుల జట్టు కొరియా చేతిలో ఓటమి
– ప్రపంచ టీమ్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌
బుసాన్‌: పారిస్‌ ఒలింపిక్స్‌కు బెర్త్‌ దక్కించుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత పురుషుల టిటి జట్టు పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ టీమ్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లో పురుషుల జట్టు 3-0తో కొరియా రిపబ్లిక్‌ చేతిలో ఓటమిపాలైంది. తొలి సింగిల్స్‌లో హర్మీత్‌ దేశారు 10-21, 11-13, 7-11తో జంగ్‌-వూజిన్‌ చేతిలో ఓటమిపాల వ్వగా.. రెండో సింగిల్స్‌లో శరత్‌ కమల్‌ 9-11, 5-11, 8-11, 4-11తో లిమ్‌ జొంగ్‌హూన్‌ చేతిలో ఓడారు. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లోనూ స్టార్‌ జి సాథియాన్‌ 5-11, 8-11, 2-11తో లీగ్‌-సంగ్‌-సు చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. అంతకుముందు జరిగిన రౌండ్‌-32 తొలి సింగిల్స్‌లో హర్మీత్‌ దేశారు 11-5, 11-1, 11-6తో తిమోర్తీ ఛారు, రెండో సింగిల్స్‌లో జ్ఞానకేశ్వరన్‌ సాథియాన్‌ 11-3, 11-7, 11-6తో ఆల్‌ఫ్రెడ్‌ డెలా పెనా, మూడో సింగిల్స్‌లో మనుష్‌ 11-4, 11-8, 11-6తో మ్యాక్స్‌వెల్‌ను ఓడించాడు.
భారత మహిళా, పురుషుల జట్లు ప్రవేశించాయి. పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌లే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత టిటి జట్లు బుధవారం జరిగిన నాకౌట్‌ పోటీల్లో విజయం సాధించాయి. రౌండ్‌-32 నాకౌట్‌ పోటీలో మహిళల జట్టు 3-0తో ఇటలీని, పురుషుల జట్టు కూడా 3-0తోనూ న్యూజిలాండ్‌ను చిత్తుచేశాయి. మహిళల బృందం తొలి సింగిల్స్‌లో స్టార్‌ క్రీడాకారిణి ఆకుల శ్రీజ 12-10, 11-6, 11-7తో కేవలం 20 నిమిషాల్లోనే నికోలెటా స్టెఫనోవాను చిత్తుచేసింది. రెండో సింగిల్స్‌లో మనిక బత్రా విజయం సాధించి భారత్‌ ఆధిక్యతను 2-0కు చేర్చింది. మనిక ఆ మ్యాచ్‌ను 12-10, 11-6, 11-5తో కేవలం 23 నిమిషాల్లోనే ముగించింది.
తొలి రెండు మ్యాచుల్లో నెగ్గిన భారత్‌… ఇటలీపై 2-0 ఆధిక్యతను సాధించింది. మూడో సింగిల్స్‌లో అహిక ముఖర్జీ 15-13, 11-9, 13-15, 11-8తో మౌన్‌ఫర్డినిని చిత్తుచేయడంతో భారత్‌ 3-0తో మ్యాచ్‌ను ముగించింది. 17వ ర్యాంకర్‌గా బరిలోకి మహిళల జట్టు ప్రి క్వార్టర్స్‌లో 4వ సీడ్‌ చైనీస్‌ తైపీతో తలపడనుంది. ప్రి క్వార్టర్స్‌లో భారత మహిళలజట్టు చైనీస్‌ తైపీని చిత్తుచేస్తే పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కినట్లే. ఇక పురుషుల జట్టు రౌండ్‌-32లో కజకిస్తాన్‌తో తలపడనుంది.

Spread the love