షెడ్యూల్‌ వచ్చేసింది

The schedule has arrived మార్చి 22 నుంచి ఐపీఎల్‌ 17
– ఆరంభ మ్యాచ్‌లో చెన్నై, బెంగళూర్‌ ఢీ
– తొలి 21 మ్యాచుల షెడ్యూల్‌ విడుదల
క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2024 షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచుల షెడ్యూల్‌ను ప్రాథమికంగా ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్‌ అనంతరం పూర్తి మ్యాచుల షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు. మార్చి 22న సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తలపడనుంది.
నవతెలంగాణ-ముంబయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 17 షెడ్యూల్‌ విడుదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఊహించినట్టుగానే ఐపీఎల్‌ షెడ్యూల్‌ పాక్షికంగానే ప్రకటించారు. మార్చి 22న ఐపీఎల్‌ షురూ కానుండగా.. తొలి 17 రోజులకు మాత్రమే షెడ్యూల్‌ విడుదల చేశారు. తొలి దశలో 17 రోజుల్లో 21 మ్యాచులు జరుగనున్నాయి. మార్చి ఆరంభంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఎన్నికల షెడ్యూల్‌ అనంతరం ఐపీఎల్‌ మిగతా మ్యాచులకు షెడ్యూల్‌ను సిద్ధం చేయనున్నారు. మార్చి 22న జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తలపడనుంది. ఇక తొలి దశ షెడ్యూల్‌లో హైదరాబాద్‌ రెండు మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. విశాఖపట్నం సైతం రెండు మ్యాచులకు వేదిక కానుంది. దీంతో ఐపీఎల్‌ 2024 ఆరంభంలో తెలుగు అభిమానులకు రెట్టింపు వినోదం ఖాయం.
ధోని వస్తున్నాడు : ఏడాది విరామం అనంతరం ఎం.ఎస్‌ ధోని మళ్లీ మైదానంలో అడుగు పెట్టనున్నాడు. గత సీజన్‌ టైటిల్‌ నెగ్గిన అనంతరం మోకాలి శస్త్రచికిత్సకు వెళ్లిన మహి.. మరో పది రోజుల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ శిబిరంలో చేరనున్నాడు. గత రెండు రెండు సీజన్లు గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్సీ వహించిన హార్దిక్‌ పాండ్య.. తాజా సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ సారథిగా తొలి మ్యాచ్‌లో టైటాన్స్‌తో తలపడనున్నాడు. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న రిషబ్‌ పంత్‌ సైతం ఈ సీజన్లో పునరాగమనం చేయనున్నాడు. ఇక తొలి దశ షెడ్యూల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ఏకంగా ఐదేసి మ్యాచులు ఆడనుండగా.. కోల్‌కత నైట్‌రైడర్స్‌ మూడు మ్యాచులే ఆడనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌లు నాలుగేసి మ్యాచులు ఆడనున్నాయి .
సమయంలో మార్పు లేదు :
ఐపీఎల్‌ మ్యాచ్‌ సమయంపై ఎన్నో ఫిర్యాదులు, విమర్శలు ఉన్నాయి. అర్థరాత్రి వరకు మ్యాచులు సాగటం ప్రసారదారు వీక్షణలపై ప్రభావం చూపుతుంది. గతంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ఆరంభం కాగా.. ఆ సమయాన్ని 30 నిమిషాల సడలించారు. ప్రస్తుతం సాయంత్రం మ్యాచులు 7.30 ఆరంభం కానుండగా.. మధ్యాహ్నం మ్యాచులు 3.30 గంటలకు మొదలు కానున్నాయి. భారత్‌లో అంతర్జాతీయ టీ20 మ్యాచులు సాయంత్రం 6.30 గంటలకు ఆరంభం అవుతున్నాయి. అదే సమయానికి ఐపీఎల్‌ మ్యాచులను సైతం నిర్వహించాలనే వినతులు బోర్డు దృష్టికి వచ్చినా.. సమయంలో ఎటువంటి మార్పులు చేయలేదు. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌ మాత్రం రాత్రి 8 గంటలకు మొదలవనుంది. ఆరంభ వేడుకలు, నత్య ప్రదర్శనలు వంటివి దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. తొలి 21 మ్యాచుల్లో నాలుగు మధ్యాహ్నం జరుగుతాయి. వారాంతాల్లో డబుల్‌ హెడర్‌ షెడ్యూల్‌ చేశారు.
ఉప్పల్‌లో మెగా మ్యాచులు : హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం ఈ సీజన్‌ ఆరంభంలోనే రెండు మెగా మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి 17 రోజుల షెడ్యూల్‌లో నాలుగు మ్యాచులు ఆడనుండగా.. అందులో రెండు మ్యాచులు సొంతగడ్డపై ఉన్నాయి. మార్చి 27న ముంబయి ఇండియన్స్‌తో, ఏప్రిల్‌ 5న చెన్నై సూపర్‌కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. ఇక సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో ఆడనుంది. మార్చి 23న ఈ మ్యాచ్‌కు కోల్‌కత ఈడెన్‌గార్డెన్‌ వేదిక కానుంది. మార్చి 31న మరో మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో సన్‌రైజర్స్‌ ఢకొీట్టనుంది. లీగ్‌ దశలో 14 మ్యాచుల్లో సన్‌రైజర్స్‌ తొలి విడత షెడ్యూల్‌లో నాలుగు మ్యాచులు ఆడనుంది.
విశాఖకు ఐపీఎల్‌ బొనంజా: ఈ ఏడాది ఐపీఎల్‌ షెడ్యూల్‌లో అనూహ్యంగా విశాఖపట్నం చోటు దక్కించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ విశాఖలో సొంత గడ్డ మ్యాచులు ఆడనుంది.
ఢిల్లీ అరుణ్‌ జైట్లి స్టేడియం మహిళల ప్రీమియర్‌ లీగ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ఐపీఎల్‌ మ్యాచులకు పిచ్‌లు సిద్ధం చేయటం కష్టతరమని ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్స్‌ క్రికెట్‌ సంఘం (డిడిసిఎ) బీసీసీఐకి తెలిపింది. దీంతో జిఎంఆర్‌ యాజమాన్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ వైజాగ్‌ను సొంత మైదానంగా ఎంచుకుంది. మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఏప్రిల్‌ 3న ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌ మ్యాచులు వైజాగ్‌లో జరుగనున్నాయి.

Spread the love