ఎలెనా నార్మన్‌ నిష్క్రమణ హాకీ ఇండియా

ఎలెనా నార్మన్‌ నిష్క్రమణ హాకీ ఇండియా– సీఈవోగా రాజీనామా
న్యూఢిల్లీ : హాకీ ఇండియా సీఈవోగా 13 ఏండ్లుగా పని చేసిన ఎలెనా నార్మన్‌ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. భారత హాకీ సమాఖ్య పరిపాలన సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో 2011లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఎలెనా నార్మన్‌.. భారత క్రీడా రంగంలో సరికొత్త పరిపాలన వ్యవస్థకు నాంది పలికారు. నార్మన్‌తోనే భారత క్రీడా సమాఖ్యల్లో ప్రొఫెషనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మొదలైంది. అప్పటి హాకీ ఇండియా కార్యదర్శి నరెందర్‌ బత్రా చొరవతో సీఈవోగా వచ్చిన ఎలెనా.. ఆ తర్వాత అతడు హాకీ ఇండియా అధ్యక్షుడు, అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు సహా భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో హాకీ ఇండియా బాధ్యతలను అన్నీ తానై పర్యవేక్షించారు. ప్రస్తుత హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టర్కీ సైతం ఎలెనా నార్మన్‌ సేవలను కొనసాగించేందుకు మద్దతుగా నిలిచినా.. సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు సహా పలు కారణాలతో ఆమె పదవికి రాజీనామా చేశారు. ఎలెనా నార్మన్‌ రాజీనామాతో హాకీ ఇండియాలో ఓ పరిపాలన శకం ముగిసినట్టైంది.

Spread the love