”జైల్‌ కా జవాబ్‌ ఓట్‌సే” పాటకు బ్రేక్‌

''జైల్‌ కా జవాబ్‌ ఓట్‌సే'' పాటకు బ్రేక్‌– ఆప్‌ ‘ప్రచారం’ పై ఈసీ నిషేధం
– ఆ నిర్ణయాన్ని తప్పుపట్టిన మంత్రి అతిషి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ”జైల్‌ కా జవాబ్‌ ఓట్‌ సే” అంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ రూపొందించిన పాటను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిషేధించింది. ఈ నిర్ణయాన్ని ఆప్‌ తప్పుపట్టింది. ఎన్నికల సంఘం ఆశ్రితపక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించింది. ”ప్రతిపక్ష నేతలపై దాడులకు ఈడీ, సీబీఐలను బీజేపీ ఉపయోగించుకుంటే వాళ్లను ఈసీ నివారించలేదు. తప్పుడు అరెస్టులు చోటుచేసుకున్నాయంటూ ప్రచారంలో ఎవరైనా మాట్లాడితే మాత్రం ఎన్నికల సంఘం దానిని ఒక సమస్యగా చూస్తోంది. నియంతృత్వ ప్రభుత్వం లక్ష్యమిది” అని ఆప్‌ నేత అతిషి విమర్శించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మద్దతుగా ‘వాక్‌ ఫర్‌ కేజ్రీవాల్‌’ పేరుతో పాదయాత్రతో ఆప్‌ ప్రచారం నిర్వహించింది. ఢిల్లీలోని సీఆర్‌ పార్క్‌ నుంచి ఈ పాదయాత్ర సాగింది. ‘జైల్‌ కా జవాబ్‌ ఓట్‌ సే’ అనే నినాదాలతో కేజ్రీవాల్‌ ఫోటో, పార్టీ జెండాలతో ఆప్‌ మద్దతుదారులు ఇందులో పాల్గొన్నారు. ఆప్‌ మంత్రులు అతిషి, సౌరభ్‌ భరద్వాజ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love