నాటో సైనికులు ఇప్పటికే కీవ్‌కు సహాయం చేస్తూ ఉక్రెయిన్‌లో ఉన్నారని, అయితే అమెరికా నేతత్వంలోని కూటమి రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఇష్టపడదని పోలిష్ ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్ అన్నాడు. పోలిష్ పార్లమెంట్‌లో గుర్తింపు పొందిన విలేకరులలో పదేండ్ల బాలిక అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ టస్క్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశాడు. ”ఈరోజు నాటో తనకు చేతనైనంత సహాయం చేస్తోంది. నాటో సహాయం లేకుండా ఉక్రెయిన్ ఇంత కాలం తనను తాను రక్షించుకోగలిగేది కాదు” అని టస్క్ బదులిచ్చాడు. సారా మాలెక్కా-ట్జ్రాస్కోస్‌గా పోలిష్ మీడియా గుర్తించిన చైల్డ్ రిపోర్టర్ యుగోస్లావ్ వివాదం ఎలా ముగిసిందని, 1990లో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల మోహరింపు గురించి టస్క్‌ని అడిగింది. అయితే, బాల్కన్‌లో ఐక్యరాజ్య సమితి పరీక్షలో విఫలమైంది నాటో దళాలు జోక్యం చేసుకుని, యుద్ధాన్ని ముగించడానికి బెల్గ్రేడ్‌పై బాంబులు వేయవలసి వచ్చిందని ఆయన అన్నాడు. అయితే ఆయన చరిత్రను అంటే 1992-95 బోస్నియా-హెర్జెగోవినాలో జరిగిన సంఘర్షణను, 1999 కొసావోపై బాంబు దాడిని కలగాపులగం చేశాడనేది సుస్పష్టం. అమెరికా నేతత్వంలోని కూటమి ఉక్రెయిన్‌తో ఎందుకు అదే పని చేయదని టస్క్‌ను అడిగినప్పుడు నాటో- రష్యాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ విషయంలో ‘ అణు యుద్ధం చెలరేగుతుందని ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు’ అని ఆయన అన్నాడు.
అంతకుముందు రోజు నాటో సెక్రటరీ-జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ నాటో ఉక్రెయిన్‌లో బలగాలను మోహరించదని వాదించాడు. ఎందుకంటే ఉక్రెయిన్ దానిని కోరలేదని ఆయన అన్నాడు.
”నాటోకు ఉక్రెయిన్‌కు బలగాలను మోహరించే ఉద్దేశం లేదు. నేను గత వారం ఉక్రెయిన్‌ను సందర్శించినప్పుడు, ఉక్రెయిన్‌లో నాటో దళాలను ఉక్రేనియన్లు అడగలేదు, వారు కోరింది మరింత మద్దతు, ”అని ఇటలీ పర్యటనలో ఉన్నప్పుడు స్టోల్టెన్‌బర్గ్ విలేకరులతో అన్నాడు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అనేక సందర్భాల్లో ఉక్రెయిన్‌లో నాటో జోక్యానికి సంబంధించిన భావనను తీసుకువచ్చాడు.
వ్యూహాత్మక అస్పష్టతలో భాగంగా దీనిని తోసిపుచ్చరాదని పట్టుబట్టాడు. రష్యన్లు ముందు వరుసలను ఛేదించినట్లయితే , ఉక్రేనియన్ ప్రభుత్వం కోరినట్లయితే పాశ్చాత్య సైనికులను పంపించవచ్చని అతను సూచించాడు.
ఉక్రెయిన్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, డబ్బును అందించడం ద్వారా ప్రత్యక్ష ఘర్షణకు గురయ్యే ప్రమాదం ఉందని అమెరికా, దాని మిత్రదేశాలను రష్యా పదేపదే హెచ్చరించింది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు 200 బిలియన్ల కంటే ఎక్కువ విలువైన సహాయాన్ని అందించాయి. అయితే ఇది వారిని సంఘర్షణలో భాగస్వాములను చేయకూడదని పట్టుబట్టింది. అయితే వాస్తవంలో ఇప్పటికే నాటోకు చెందిన సైనిక దళాలు రహస్యంగా యుద్ధంలో ఉక్రెయిన్‌కు అన్నివిధాలా సహాయ పడుతున్నాయి.