ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు తగ్గిన ప్రజాదరణ – నివేదిక

ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు తగ్గిన ప్రజాదరణ - నివేదిక53 దేశాలలో చేసిన సర్వే ప్రకారం చైనా, రష్యా రెండూ గత సంవత్సరంలో ప్రపంచంలో తమ స్థితిని మెరుగుపరుచుకోగా, అమెరికాకుగల ఆమోదం రేటింగ్‌ మధ్యప్రాచ్యంలో, ఐరోపాలో కూడా క్షీణించింది. డెమోక్రసీ పర్సెప్షన్‌ ఇండెక్స్‌ 2024గా పిలువబడే ఈ సర్వేను జర్మన్‌ కంపెనీ లాటానా లయన్స్‌ ఆఫ్‌ డెమోక్రసీస్‌ తరపున నాటో మాజీ సెక్రెటరీ-జనరల్‌ అండర్స్‌ ఫాగ్‌ రాస్‌ముస్సేన్‌ నేతత్వంలోని ఎన్జీవో తరపున నిర్వహించారు. గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న మారణకాండకు మద్దతు ఇస్తున్న కారణంగా అమెరికాకున్న ఆమోదం క్షీణిస్తుండగా, రష్యా, చైనా ఇప్పుడు ఆసియా, మధ్యప్రాచ్యం/ఉత్తర ఆఫ్రికాలలో సర్వే జరిగిన చాలా దేశాలలో అమెరికాకు దీటుగా సానుకూ లంగా చూడబడుతున్నాయి. యూరోపియన్లలో కూడా అమెరికాకున్న మద్దతు క్షీణించింది. ” బైడెన్‌ పరిపాలన ప్రారంభమైనప్పటి నుంచి మొదటిసారిగా అనేక పాశ్చాత్య యూరోపియన్‌ దేశాలలో నివసిస్తున్న ప్రజలు అమెరికాపట్ల నికరంగా ప్రతికూల అవగాహనకు వచ్చారు” అని లాటానాలోని సీనియర్‌ పరిశోధకుడు ఫ్రెడరిక్‌ డివెక్స్‌ తెలిపారు.ముఖ్యంగా జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండ్‌, బెల్జియం, స్విట్జర్లాండ్‌లలో గతంలో ఉన్న సానుకూల దక్పథం కనుమరుగవటం ‘ స్పష్టంగా కనపడుతోంది ” అని డివెక్స్‌ చెప్పారు. గత సంవత్సరం నుండి అమెరికా ప్రపంచ ఖ్యాతి దెబ్బతింది.
ముఖ్యంగా ముస్లిం మెజారిటీ దేశాలు – అల్జీరియా, ఈజిప్ట్‌, ఇండోనేషియా, మలేషియా, మొరాకో, టర్కీయే దేశాలలో అమెరికా ప్రతిష్ట తీవ్రస్థాయిలో దెబ్బతింది. గాజాపై ఇజ్రాయిల్‌ యుద్ధానికి అధ్యక్షుడు జో బైడెన్‌ ఎటువంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వడం దీనికి కారణమని పరిశోధకులు పేర్కొన్నారు. మరోవైపు యూరప్‌ మినహా ప్రతి ప్రాంతంలో రష్యా, చైనాలపై సెంటిమెంట్లు క్రమంగా మరింత సానుకూలంగా ఉన్నాయని సర్వే కనుగొంది. ఉక్రెయిన్‌ లో జరుగుతున్న యుద్ధం కారణంగా రష్యాతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవడానికి ఇప్పటికీ అమెరికాకు యూరోపియన్‌ యూనియన్‌ మాత్రమే మద్దతు ఇస్తోంది. మిగిలిన ప్రపంచ మంతా మాస్కోతో సాధారణ సంబంధాలను కొనసాగించడానికి ఇష్టపడుతుంది. తైవాన్‌పై చైనా దండెత్తితే ఆంక్షలు విధించటానికి పశ్చిమ దేశాలు మాత్రమే సిద్ధపడుతుండగా, మిగిలిన ప్రపంచం అందుకు సిద్ధంగా లేదు. డెమోక్రసీ పర్సెప్షన్‌ ఇండెక్స్‌ అనేది 53 దేశాల్లో నిర్వహించబడే వార్షిక సర్వే. ”ప్రజాస్వామ్యం, భౌగోళిక రాజకీయాలు, గ్లోబల్‌ పవర్‌ ప్లేయర్స్‌ ”గురించి అభిప్రాయాల కోసం ఈ సంవత్సరం పరిశోధన దాదాపు 63,000 మంది నుంచి ప్రతిస్పందనలను సేకరించింది.

Spread the love