వరుణుడే అడ్డంకి?

– నేడు చెన్నైతో బెంగళూర్‌ ఢీ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ వేటలో అమీతుమీ
నవతెలంగాణ-బెంగళూర్‌ :
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) గ్రూప్‌ దశ మ్యాచులు ఆదివారంతో ముగియనున్నాయి. అయినా, ప్లే ఆఫ్స్‌ రేసు ఇంకా రసవత్తరంగానే సాగుతుంది. టాప్‌-4లో మూడు బెర్త్‌లు ఇప్పటికే ఖాయం అయ్యాయి. కోల్‌కత నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. నాల్గో స్థానం కోసం చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ పోటీపడుతున్నాయి. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ వేటలో నాకౌట్‌ సమరంగా మారిన ఈ ముఖాముఖి పోరుకు వర్షం ప్రమాదం పొంచి ఉంది. బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ జరుగనుండగా.. మ్యాచ్‌ రోజు ఇక్కడ భారీ వర్షం కురువనుందని వాతావరణ శాఖ తెలిపింది. వరుణుడు శాంతిస్తే చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ పోరు నేడు రాత్రి 7.30 గంటలకు ఆరంభం.
ఎవరి అవకాశాలు ఎలా? : రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ : ప్లే ఆఫ్స్‌ రేసులో ఆర్సీబీకి మంచి అవకాశమే ఉంది. కానీ అందుకు కఠిన సవాల్‌ ఎదుర్కొవాలి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తొలుత 200 పరుగులు చేస్తే కనీసం 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఇక చెన్నై సూపర్‌కింగ్స్‌ నిర్దేశించే లక్ష్యాన్ని డుప్లెసిస్‌ సేన మరో 11 బంతులు మిగిలి ఉండగానే ముగించాల్సి ఉంటుంది. అప్పుడే చెన్నై నెట్‌రన్‌రేట్‌ను ఆర్సీబీ అధిగమించి టాప్‌-4లోకి అడుగుపెడుతుంది. వర్షం కారణంగా ఓవర్లను కుదిస్తే ఆర్సీబీ సమీకరణాలు మరింత కష్టతరం అవుతాయి.
చెన్నై సూపర్‌కింగ్స్‌: సూపర్‌కింగ్స్‌కు ఈ మ్యాచ్‌లో ఓడినా అవకాశాలు ఉన్నాయి. లక్ష్య ఛేదనలో తక్కువ వ్యత్యాసంతో ఓటమి చవిచూసినా మెరుగైన నెట్‌ రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్‌కు చేరనుంది. లక్ష్యాన్ని కాపాడుకుంటే.. ఆఖరు ఓవర్‌ వరకు నెట్టుకొస్తే సరిపోతుంది. ఇక మ్యాచ్‌లో విజయం సాధిస్తే సూపర్‌కింగ్స్‌ ఏకంగా టాప్‌-2లో నిలిచేందుకు సైతం పోటీపడనుంది. అందుకు సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ మ్యాచుల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

Spread the love