జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష..

– ఉదయం10:30 నుండి మధ్యాహ్నం 01:00 వరకు పరీక్షా సమయం
– బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరు నమోదు..
– గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధం కావాలి: టీజిపీఎస్సి  చైర్మన్ మహేందర్ రెడ్డి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జూన్ 09న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు సన్నద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రీజనల్ కో ఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ జూన్  9న  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించు గ్రూప్ -01 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.ఎటువంటి పొరపాట్లు జరుగకుండా, సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.జూన్ 09న ఉదయం 10-30 నుండి మధ్యాహ్నం 1-00 వరకు  నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షను ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని, చీఫ్ సూపరింటెండెంట్ మానిటరింగ్ చేసే విధంగా సి.సి. కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి రూమ్ లో విద్యుత్ సౌకర్యం, త్రాగునీరు ఏర్పాటు చేయాలని  పరీక్షకు రెండు రోజుల ముందే పారిశుధ్య  కార్యక్రమాలు నిర్వహించి కేంద్రాలను
పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లోని గోడలపై ఎలాంటి మ్యాపులు, పట్టికలు, గడియారాలు, ఇతరత్రా లేకుండా చూడాలన్నారు.
ప్రతి గదిలో సరైన లైటింగ్,  ఫ్యాన్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి గదిలో సీసీ కెమెరా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు.దివ్యాంగులైన అభ్యర్థుల కోసం గ్రౌండ్ ఫ్లోర్ ను కేటాయించాలని పరీక్ష కేంద్రం ఆవరణలో సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరుచుకోకుండా చూడాలని, 144 సెక్షన్ విధించి 100 మీటర్ల దూరం వరకు ఇతరులను రానివ్వకూడదని పేర్కొన్నారు.  అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కచ్చితంగా మహిళలను పరిశీలించేందుకు మహిళా కానిస్టేబుల్ ను విధులలో ఉంచాలని ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించి సెల్ ఫోన్లు,  స్మార్ట్ వాచీలు బ్లూటూత్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించవద్దని పేర్కొన్నారు. అభ్యర్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా పోలీసు శాఖ నుంచి ఎస్ హెచ్ ఓ స్థాయి అధికారి పరీక్ష పూర్తయ్య వరకు నిరంతర పర్యవేక్షించాలని తెలిపారు.పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమును ఏర్పాటు చేసి క్లోజ్డ్ వాహనంలో  పోలీస్ ఎస్కార్ట్ ద్వారా ప్రశ్నాపత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించాలని పరీక్ష పూర్తయిన తర్వాత పోలీస్ ఎస్కార్ట్ ద్వారా తిరిగి స్ట్రాంగ్ రూమ్ కు ప్రశ్నపత్రాలను తరలించాలన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ రూట్ అధికారులను నియమించి పరీక్ష జరిగే రోజు రూట్ అధికారులకు వారి వారి రూట్లలో పంపించాలని తెలిపారు.
బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేసుకోవడం జరుగుతుందని ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్ అనుసరించాలని అన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ లు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయడానికి సిబ్బంది నియమించి వారికి తగిన శిక్షణ ఇవ్వాలని కోరారు. అభ్యర్థులను పరీక్ష కేంద్రాల లోపలికి ఉదయం 09:30నుండి అనుమతించాలని అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకొని  రావాలని  అన్నారు. ఓఎంఆర్ షీట్ నింపడంలో అభ్యర్థులు హాల్ టికెట్ లో పేర్కొనబడిన సూచనలు క్షుణ్ణంగా పరిశీలించుకుని పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని  తెలిపారు. పరీక్షకు ముందు బబ్లింగ్ గురించి అభ్యర్థులకు తెలియజేసీ, టి.జి.పి.ఎస్.సి. నియమ, నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంగా పనిచేసే గ్రూప్ 01 ప్రిలిమినరీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని టిజి పి ఎస్ సి చైర్మన్ సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం 9,725 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని వన్ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎడిషినల్ ఎస్పీ నాగేశ్వరరావు,ఈ సూపర్డెంట్ పద్మారావు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love