
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
మొక్కల సంరక్షణ మన బాధ్యతని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్ లో వాటర్ డే సందర్బంగా ఇరువైపులా నాటిన మొక్కలకు అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంకతో కలసి నీరు పోసారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్ల వలన వాతావరణం సమతులయంగా ఉంటుందని, వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వాటి సంరక్షణ కూడా తీసుకోవాలని అన్నారు. వేసవి దృష్ట్యా మొక్కలు చనిపోకుండా రెండు పూటలు నీరు అందించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.తదుపరి బిబిగూడెం లో గల పట్టణ నర్సరీని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నర్సరీలో అన్ని రకాల మొక్కలు పెంచాలని ఎండలు దృష్ట్యా మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. నర్సరీలో గల మొక్కల వివరాలు తెలుసుకొని మరికొన్ని మొక్కల ప్రతిపాదనలు పంపాలని అలాగే ఇప్పటికే 60 వేల ఫ్రూట్ బేరింగ్ మొక్కలను తమిళనాడు నుండి తెప్పించడం జరిగిందని తెలిపారు. నర్సరీలలో పనిచేస్తున్న కూలీల చెల్లింపులపై పై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.