గ్రూప్ -1 పరీక్ష పకడ్బందిగా నిర్వహించాలి: కలెక్టర్

పరీక్షా కేంద్రాలకు సెల్  ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతులు లేవు
– పరీక్షా కేంద్రాల్లో  మౌలిక వసతులు కల్పన
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో వచ్చే జూన్ 9న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష  సజావుగా జరిగేలా పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీఎస్పీఎస్సీ  గ్రూప్ 1 పరీక్షా నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన   సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు , అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక, అదనపు కలెక్టర్ ఎం. నాగేశ్వర రావుతో   కలిసి సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 9వ తేదీ న  ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు  నిర్వహించనున్న గ్రూప్ వన్  పరీక్ష ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా పకడ్బంది ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు.  పరీక్షా కేంద్రాలలో వికలాంగుల కొరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు సౌకర్యాలను కల్పించాలని సూచించారు. అదేవిదంగా స్ట్రాంగ్ రూం నుండి పరీక్షా కేంద్రానికి తిరిగి పరీక్షా కేంద్రం నుండి  స్ట్రాంగ్ రూంకు ఎగ్జామ్ మెటిరియల్ తరలించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సూర్యాపేటలో ఏర్పాటు చేయనున్న 32 కేంద్రాల్లో 9745 మంది అభ్యర్థులు పరీక్షను రాయనున్నారని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యంగా నిరంతర విద్యుత్ , త్రాగునీరు,  టాయిలెట్స్  ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో 10.15 తరువాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించవద్దని ఆదేశించారు.  పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వాచ్,  సెల్ ఫోన్ అలాగే బూట్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరాదని ఆదేశించారు. నియమించిన వివిధ విభాగాల అధికారులు నిబద్ధతతో బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ స్టాల్ చేపట్టాలని, అభ్యర్థులు హల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని అన్నారు.  ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు . అదేవిదంగా ప్రశ్నాపత్రాలు ఎట్టి పరీస్థితిలో  కూడా పరీక్షా ముగిసే వరకు బయటకు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తదుపరి అదనపు ఎస్పీ నాగేశ్వర రావు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తామని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని  తెలిపారు.  అనంతరం జూన్ 3 నుండి 19 వరకు చేపట్టే బడిబాట బ్రోచర్ ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో   ఆర్డిఓ వేణుమాధవ్,  యస్.వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్.    కో ఆర్డినేటర్ డా” వెంకటేశమ్, డి.ఈ. ఓ అశోక్,  ఏ ఓ సుదర్శన్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love