– నేడు ఆ రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాల వ్యాప్తి
– రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
– పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకేశాయి. వచ్చే 48 గంటల్లో ఆ రాష్ట్రమంతటా అవి వ్యాప్తి చెందనున్నాయి. తమిళనాడు, కర్నాటకలోని కొన్ని భాగాలకూ విస్తరించనున్నాయి. ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియల్ కర్నాటక వరకు వ్యాపించి ఉన్న ద్రోణి బలహీనపడింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని సూచించింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో గురువారం రాత్రి పది గంటల వరకు 54 ప్రాంతాల్లో వర్షం పడింది. వికారాబాద్ జిల్లా మోమిన్ పేటలో అత్యధికంగా 2.23 సెంటీమీటర్ల వాన పడింది.
పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక
రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ జాబితాలో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలున్నాయి. వడగాల్పులు వీయనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం కొమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లా కుంచవల్లిలో అత్యధికంగా 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రవీంద్రనగర్(కొమ్రంభీమ్ అసిఫాబాద్)45.5, కేతేపల్లి(నల్లగొండ) 45.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.