– మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, కార్పొరేషన్ మాజీ చైర్మెన్ వాసుదేవరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని సహజ వనరులను లూటీ చేస్తున్నారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మెన్ వాసుదేవరెడ్డి విమర్శించారు. మంత్రి శ్రీధర్‌బాబు అండతో మంథని నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియా చెలరేగి పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలు ఇసుకను యధేచ్ఛగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. మైనింగ్ ప్రమాణాలు పాటించకుండా వారు మట్టిని తరలిస్తున్నారని చెప్పారు. ఒక లారీకి పర్మిషన్ ఉంటే వంద లారీల్లో మట్టిని తరలిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బు శ్రీధర్‌బాబు కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళుతోందని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ఇసుక మాఫియా గురించి నీతులు చెప్పిన శ్రీధర్‌బాబు అదే దందాకు ఇప్పుడు తెరతీశారని విమర్శించారు. జిల్లా అధికారులకు ఈ దందాల గురించి చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారులైనా ఈ అంశాన్ని పట్టించుకోవాలనీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.