గంజాయి విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

గంజాయి విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి– డీవైఎఫ్‌ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్‌ బషీరుద్దీన్‌
నవతెలంగాణ-ఖమ్మం
గంజాయి విక్రయిస్తున్న వారిపై ప్రభుత్వం పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి షేక్‌ బషీరుద్దీన్‌ అన్నారు. ఆదివారం ఖమ్మం వన్‌ టౌన్‌ కమిటీ ఆధ్వర్యంలో 23వ డివిజన్లో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్‌ బషీరుద్దీన్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే నిర్వహించాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లాలో గ్రామాల్లో, డివిజన్స్‌లో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సర్వేలో వచ్చిన సమస్యలపై ఆగస్టు నెలలో ఆందోళన నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో యువత బాగా డ్రగ్స్‌కి బానిసలు అవుతున్నారని, ముఖ్యంగా వన్‌టౌన్‌ ప్రాంతంలో యువతకు అందుబాటులో గంజాయి లభిస్తుందని, దీనివలన యువత దానికి బానిసలు అవుతున్నారన్నారు. విద్యార్థుల యువకుల దగ్గరికి గంజాయి తీసుకొస్తున్న విక్రదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌శాఖ, ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ గంజాయి తీసుకోవడం వల్ల పట్టణంలో నేరాలు పెరిగిపోతున్నాయని, దొంగతనాలు గొడవలు విపరీతమవుతున్నాయని చెప్పారు. సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తుపైన భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. అందుకే పోలీసు యంత్రాంగం రాత్రి పూట పహార నిర్వహించాలని, విక్రయిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. డీవైఎఫ్‌ఐ వన్‌ టౌన్‌ కార్యదర్శి కూరపాటి శ్రీను మాట్లాడుతూ 23వ డివిజన్లో సర్వే నిర్వహించడం జరిగిందని దాదాపు 35 మంది యువకులతో సర్వే నిర్వహించామని, ఈ సర్వేలో కొన్ని సమస్యలు మా దష్టికి వచ్చాయని తెలిపారు . ముఖ్యంగా డ్రైనేజీ సమస్య, రోడ్ల విస్తరణ సమస్య, పారిశుద్ధ్యం లాంటి ఉన్నాయని, వీటి ని అధికారులు దష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ వన్‌ టౌన్‌ అధ్యక్షులు రావులపాటి నాగరాజు, మండల నాయకులు ఎంఏ రైమాన్‌, సతీష్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Spread the love