ప్రమాదవశాత్తు నీటిలో మునిగి విద్యార్థి మృతి

ప్రమాదవశాత్తు నీటిలో మునిగి విద్యార్థి మృతినవతెలంగాణ – బోనకల్‌
బోనకల్‌ గ్రామానికి చెందిన ఓ విద్యార్థి ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి డ్యాం వద్ద ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఆదివారం మృతిచెందాడు. బాధితులు, బంధువులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్‌ గ్రామానికి చెందిన గుడిమల్ల గోపాలరావు, రమాదేవి
దంపతుల కుమారుడు సాయికృష్ణ చింతకాని మండలం నాగులవంచ ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో తన మిత్రులతో శనివారమే మాట్లాడుకున్న ఒప్పందం ప్రకారం తల్లిదండ్రులకు నిజం చెబితే వెళ్ళనివ్వరా అనే ఉద్దేశంతో చిరునోములలో తమ స్నేహితులు ఉప్పలమ్మ పెట్టుకుంటు న్నారని అబద్ధం చెప్పి చిరునోముల తన మిత్రుల వద్దకు మోటార్‌ సైకిల్‌ వేసుకొని వచ్చాడు. చిరునోములలో తన మిత్రులైన తెల్లబోయిన నరసింహారావు కుమారుడు శివరాం (పదవ తరగతి), గొల్ల పరుశురాం కుమారుడు ప్రేమ్‌ సాయి(9వ తరగతి) వద్దకు తమ మోటార్‌ సైకిల్‌ వేసుకొని వెళ్లాడు. శివరాం, ప్రేమ్‌ సాయి ప్రేమ్‌ మరో మోటార్‌ సైకిల్‌ వేసుకొని సాయికృష్ణతో పాటు బోనకల్లు వెళ్లారు. సాయి కష్ణ తన మోటార్‌ సైకిల్‌ని తమ ఇంటి దగ్గర పెట్టి ముగ్గురు కలిసి శివరాం మోటార్‌ సైకిల్‌ మీద ముందుగా చొప్పకట్లపాలెం వెళ్లారు. చొప్పకట్లపాలెంలో తన మిత్రులైన తారక్‌, ఏకాంత్‌ (శ్రీ ఆదర్శ పాఠశాల), నాగచైతన్య 10వ తరగతి (చిరునోముల ఉన్నత పాఠశాల) కలుపుకొని ఆంధ్రప్రదేశ్‌ లోని ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలంలోని పోలంపల్లి డ్యామ్‌ వద్దకు సరదాగా వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత అందరూ కలిసి ఈత కొడదామని మున్నేరు నదిలోకి దిగారు. అందరూ కలిసి ఒకేసారి నదిలోకి దిగిన వీరు ఆ తర్వాత సాయికృష్ణ, శివరాం మరి కొంచెం ముందుకు వెళ్లారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన వీరు సుడిగుండంలో చిక్కుకుపోయారు. సాయికష్ణ (15), శివరాం కొట్టుకుపోతుండటంతో మిగిలిన నలుగురు భయంతో కేకలు వేస్తూ ఒడ్డుకు చేరుకున్నారు. అదే సమయంలో మత్స్యకారులు అక్కడే ఉండటంతో విద్యార్థుల కేకలు విని సంఘటన స్థలానికి చేరుకొని తమ వద్ద గల చేపల వలలతో వారిని రక్షించగలిగారు. కానీ అప్పటికే సాయికృష్ణ మృతి చెందాడు. శివరాం మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. మృతిని వద్ద ఉన్న ఫోన్‌ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెళ్లి సాయికృష్ణ మృతదేహాన్ని బోనకల్లు తీసుకెళ్లారు. గోపాల్‌రావు దంపతులకు ఒకే ఒక కుమారుడు సాయికృష్ణ. ఒక్క కుమారుడూ ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, బంధువులు మృతదేహంపై పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తుండటంతో గ్రామస్తులు అందరూ కన్నీరు పెట్టారు.

Spread the love