రైతుబీమాకు ‘మరో అవకాశం’

'Another chance' for Rythu Bima– ఆగస్టు 5 వరకు దరఖాస్తుల స్వీకరణ
– జూన్ 28 వరకు పట్టాపాస్ పుస్తకం పొందిన రైతులు అర్హులు
– దరఖాస్తులు స్వీకరిస్తున్న ఏఈవోలు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఆరుగాలం కష్టపడినా పంట రైతుల చేతికి అందే వరకు ఆదాయం కనిపించని పరిస్థితి. ప్రకతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పంటల్లో దిగుబడి తగ్గి ఆదాయం తగ్గుతోంది. తరచూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొ లేక పంటల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఏటా అనేక మంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో రైతులకు అండగా నిలవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పంటల పెట్టుబడికి రైతుబంధు అందించడంతోపాటు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో బీమా సౌకర్యం కల్పిస్తోంది. 2018లో ఈ పథకాన్ని రూపొందించి అర్హులైన ప్రతీ రైతు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు, తల్లితండ్రుల నుంచి వారసత్వంగా భూములు పొందిన కొత్త వారికి పాస్ పుస్తకాలు పొందిన వెంటనే రైతుబీమాకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. తాజాగా ప్రభుత్వం రైతుబీమా దరఖాస్తులకు మరో అవకాశం కల్పించింది.
550684 మంది రైతులు
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 550684 మంది రైతులు ఉన్నారు. అందులో 391883 లక్షల మంది రైతులకు రైతుబీమా పథకానికి పాత వాళ్లకు వ్యవసాయ శాఖ అధికారులు రెన్యువల్ చేశారు. ఈ ఏడాది కొత్తగా 23003 వేలమంది రైతులు రైతు బీమాకు అర్హత ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. వీరిలో ఇప్పటివరకు 4906 మంది రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారు.మరికొంత మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నా ఆధార్ కార్డులో తప్పులు, పట్టాపాస్ పుస్తకా ల్లోని వివరాలు ఆధార్ వార్డులోని వివరాలతో సరి పోకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోయారు. వారు కూడా ప్రస్తుతం దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు రైతు బీమా క దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఆగస్టు 5లోగా దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతులు రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది. అయితే జూన్ 28లోగా కొత్త పట్టాపాస్ పుస్తకం పొందిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ క్లస్టర్ పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొత్తగా పాస్ పుస్తకం పొందిన రైతులు మాత్రమే రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తులు అందించిన రైతులు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదు. 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారు పట్టాదారు పాస్ పుస్తకం గానీ.. డిజిటల్ సంతకం చేసిన డీఎస్ పత్రాలు, ఆధార్, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను దరఖాస్తు ఫారంతో జత చేయాల్సి ఉంటుంది. సంబంధిత పత్రాలను ఆగస్టు 5 లోగా క్లస్టర్ ఏఈవోలకు అందించాలి. బీమాకు సంబంధించిన ప్రీమియం నగదును ప్రభుత్వమే భరిస్తోంది. రైతులు ఏదైనా కారణంతో మరణిస్తే బీమా కంపెనీ ద్వారా ప్రభుత్వం నామినీకి 10 రోజుల్లోనే రూ.5లక్షలు చెల్లిస్తుంది.బాధిత కుటుంబం భవిష్యత్తులో ఏదైనా ఉపాధి పొందేందుకు ఆ నగదు ఉపయోగకరంగా మారుతుంది.
1171 మంది రైతులకు భీమా చెల్లింపు
2023-24 ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో 1339 మంది రైతులు వివిధ కారణాలతో మరణించారు. వారిలో 1171 మంది రైతు కుటుంబాలకు బీమా డబ్బులు రూ.5 లక్షల చొప్పున 58.55 కోట్లు చెల్లించారు. ఇంకా 168  మంది చనిపోయిన రైతులకు  సంబంధించి బీమా డబ్బులు చెల్లించాల్సి ఉందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. అయితే కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతుల తోపాటు గతంలో రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోని రైతులందరూ ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
నేరుగానే వెళ్లి ఎన్రోల్ చేయాలి: శ్రవణ్ కుమార్ (జిల్లా వ్యవసాయ శాఖ అధికారి)
జిల్లాలో కొత్తగా పట్టాపాస్ పుస్తకం పొందిన రైతులు ఆగస్టు 5 లోగా సంబంధిత క్లస్టర్ ఏఈవోలకు దరఖాస్తులు అందించాలి. నల్లగొండ జిల్లాలో 23003 మంది రైతులు రైతు బీమాకు అర్హత కలిగి ఉన్నారు.జిల్లాలో ఉన్న 140 రైతు వేదికలలో ఉన్న ఏఈఓ లు రైతుల వద్దకు నేరుగా వెళ్లి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్,   ఆప్లికేషన్ ఫామ్, నామిని ఆధార్ కార్డు, తీసుకొని రైతు బీమాకు దరఖాస్తు చేయాలి. నామిని ఒకవేళ మైనర్ అయితే మరొక మేజర్ వ్యక్తిని పెట్టుకోవచ్చు. ఏఈఓ లు వ్యక్తిగతంగానే వెళ్లి వివరాలు రికార్డు చేయాలి తప్ప ఫోన్లో తీసుకోవద్దు.గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
Spread the love