క్లీన్‌స్వీప్‌పై కన్నేసి..!

Kannesi on the cleansweep..!– భారత్‌, శ్రీలంక మూడో టీ20 నేడు
– రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-పల్లెకెలె
సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీ, గౌతం గంభీర్‌ చీఫ్‌ కోచ్‌గా తొలి సిరీస్‌లోనే టీమ్‌ ఇండియా క్లీన్‌స్వీప్‌ విజయంపై కన్నేసింది. వరుస రోజుల్లో తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన సూర్యకుమార్‌ యాదవ్‌ సేన.. 2-0తో ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. నేడు జరుగనున్న నామమాత్రపు మూడో టీ20లోనూ విజయం సాధించి 3-0తో పరిపూర్ణ విజయం సాధించాలని చూస్తుంది. సిరీస్‌ విజయం దక్కటంతో మూడో మ్యాచ్‌లో రిజర్వ్‌ ప్లేయర్లకు అవకాశం కల్పించేందుకు చూస్తున్నారు. ఓవైపు మహిళల జట్టు ఆసియాకప్‌ విజేతగా నిలువగా.. మెన్స్‌ జట్టు సైతం ఓ విజయంతో ఊరట దక్కించుకోవాలని ఆతిథ్య శ్రీలంక ఎదురుచూస్తుంది.
రిజర్వ్‌కు చాన్స్‌: 2026 టీ20 ప్రపంచకప్‌ దిశగా అడుగులు వేస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ సేన పొట్టి ఫార్మాట్‌లో ప్రయోగాలకు తెరలేపనుంది. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌ విజయంలో కీలక సభ్యులు ఇప్పుడూ జట్టులో ఉన్నారు. ప్రపంచకప్‌ జట్టులో లేని ఆటగాళ్లకు అధికంగా అవకాశాలు కల్పించాలని గౌతం గంభీర్‌ భావిస్తున్నాడు. రియాన్‌ పరాగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రింకూ సింగ్‌ సహా ఖలీల్‌ అహ్మద్‌, రవి బిష్ణోరు వంటి ఆటగాళ్లకు తుది జట్టులో ఎక్కువగా చోటు ఇవ్వనున్నారు. మిడిల్‌ ఆర్డర్‌లో రియాన్‌ పరాగ్‌, లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌లో రింకూ సింగ్‌ను సానపట్టాలని గౌతం గంభీర్‌ ఆలోచన. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజు శాంసన్‌ను సైతం ప్రత్యామ్నాయ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా తీర్చి దిద్దనున్నారు. నేటి మూడో మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌తో సంజు శాంసన్‌ ఓపెనర్‌గా రానున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు.
ఊరట దక్కేనా?: తొలి టీ20లో ఛేదనలో విజయం దిశగా దూసుకెళ్లిన లంకేయులు.. ఆ తర్వాత ఆఖర్లో తడబడ్డారు. రెండో టీ20లో వర్షం అంతరాయం కలగటంతో ఆతిథ్య జట్టు విజయంపై ఆశలు పెట్టుకుంది. రెండు మ్యాచుల్లోనూ సూర్యకుమార్‌ సేన గొప్ప ప్రదర్శనతో విజయాలు అందుకుంది. మూడో మ్యాచ్‌లోనైనా విజయం సాధించి ఊరటతో పాటు వన్డే సిరీస్‌ ముందు విలువైన ఆత్మవిశ్వాసం సాధించాలని శ్రీలంక భావిస్తుంది. నిశాంక, కుశాల్‌ మెండిస్‌, కుశాల్‌ పెరీరా సహా చరిత్‌ అసలంక ఆతిథ్య జట్టుకు కీలకం కానున్నారు. వానిందు హసరంగ, రోమేశ్‌ మెండిస్‌, మహీశ్‌ తీక్షణ, మతీశ పతిరణలు బంతితో మాయ చేసేందుకు ఎదురు చూస్తున్నారు. భారత్‌, శ్రీలంక మూడో టీ20 మ్యాచ్‌కు కొత్త పిచ్‌ను సిద్ధం చేశారు. తొలి రెండు మ్యాచులను ఒకే పిచ్‌పై ఆడించగా.. నేడు కొత్త పిచ్‌పై ఆడనున్నారు. అయినా, పిచ్‌ నుంచి కొత్తగా ఆశించటానికి అవకాశం లేదు. మిడిల్‌ ఓవర్లలో పిచ్‌ నుంచి స్పిన్‌కు సహకరించనుంది. ఆరంభ ఓవర్లలో పరుగుల వేట సులభతరంగా ఉండనుండగా.. మ్యాచ్‌ కొనసాగుతున్న కొద్ది బౌలర్లకు అనుకూలించనుంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం మెండుగా ఉంది.

Spread the love