S/o మాణిక్యం ఇప్పుడెలా ఉన్నాడు?

How is S/o Manikyam now?”లోలోపల కవిత్వపు వెలుగున్నవాడికి అది మసకబారుతుందేమోనన్న చింత ఉండదు” అని పలికిన సన్నాఫ్‌ మాణిక్యం ఇప్పుడెలా ఉన్నాడు?
అవును ఇప్పుడు S/o మాణిక్యం ఏం ఆలోచిస్తున్నాడు? వాక్యాల నడ్డి, ముడ్డి విరిచిన అదే బాటలో పయనిస్తున్నాడా? లోనంతా, మేనంతా దుర్వ్యాపారమే, దుర్వాణిజ్యమే అని అన్నాడు కదా!
”వురేరు… ఉరేరు… మనిషి వైతే ఇటు రా వినియోగదారుడు మాత్రమే అయితే అటుపో” అంటూ వినియోగదారుడు అనగానేమి? మనిషి అంటే ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ప్రకటనల రూపంలో జారీ చేస్తూ ఉన్నాడు. ఒకానొక రంజాన్‌ రోజున అవును నేను సెక్యులర్‌నే అని ప్రకటించాడు. అవును ఇప్పుడు సన్నాఫ్‌ మాణిక్యం ఫాదర్‌ ఆఫ్‌ తనయ పూర్ణిమ, జైత్రమాణిక్యంగా అయ్యాక ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడు, ఎలా కొలుస్తున్నాడు? మెటాఫర్లతో ఆటలాడిన ఇమేజ్లలో మాట్లాడిన కవి ఇప్పుడీ కవితలో చూడండి…
”నిదురించే పిల్లలను/ బడికి పంపేందుకు లేపకు/ వాళ్ల కలలు మెలకువలో జారిపోతాయి/ కలలు ఏమైతేనేం/ పిల్లలు లేచి బడికి పోవడమే ముఖ్యం/ ఎన్ని స్వప్నాలో పిల్లల గురించి!/ బడికి పంపాక కూడా/ కలలే కలలు/ పిల్లలు నిద్ర లేచాక/ కలలకు మాత్రం ఏం పని/ అందుకే ఇక్కడ అంతా ఖాళీ!” (పిల్లలు..కలలు, ఫే˜స్‌ బుక్‌ నుండి)
ఈ కవిత చదివాక మనం కూడా ఖాళీ అవుతాం. పిల్లల పట్ల ఎంత దయ కలిగి ఉండాలో, అంత దయను నిజంగా మనం చూపామా, మనం ఎంతసేపూ మనవాడు ఇది కావాలి, అది కావాలని మన కలలే నిజం కావాలని అనుకుంటాం గానీ అటువైపు చిట్టి హృదయాల్లోని కలల గురించి ఆలోచించలేక పోయినందుకు ఇప్పుడు పశ్చాతాపడినా దానికి విలువ ఉండదు.
కవిత్వానికి చలనశీలత ఒక లక్షణం. సమాజంలో నిత్యం అనేక పరిణామాలు, సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అక్కడెక్కడో ఒక యుద్ధం జరుగుతుంది. మనలాంటి మనుషులు చనిపోతారు. మన పిల్లలు లాంటి పిల్లలు తెల్లటి గుడ్డలో చుట్టి వేయబడతారు. ఆ దృశ్యాలను చూసిన కవి మనసు అల్లకల్లోలం అవుతుంది. కవిత్వానికి సంబంధించి ప్రకృతి, మానవ సంబంధాలు ఇవి రెండూ ఎప్పటికీ అరిగిపోని వస్తువులు. అయితే కవి వాటిని చూసే తాజాతనం, దృష్టి మీద ఆ కవిత నిలబడుతుంది. తాను చూసిన ఒక సంఘటన లేదా అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధమో, ఆ యుద్ధ పర్యావసనాలో కవిలో కల్లోలం రేపినప్పుడు తక్షణ స్పందనగా కవిత పుడుతుంది. ”ఎవరిదీ జాగా?/ ఆట బొమ్మలు చనిపోయాయని పిల్లలు శోకిస్తారు/ ఆడుకుంటున్న బొమ్మల్లాంటి పిల్లలు మరణించారని తల్లులు శోకిస్తారు/ చిట్టితల్లులూ.. చినచిన్న తండ్రులూ క్షతగాత్రమై/ నెత్తురోడుతూ రోదిస్తారు/ పిల్లుల్ని పెంచుకుంటూనే పిల్లలను హతమార్చుకుంటాం/ గుండెలు యుద్ధశకటాలుగా రాకెట్లుగా బాంబర్లుగా మోగుతుంటారు!/ ప్రపంచమే మోసగించినప్పుడు/ ఇక ఏంచేస్తాం/ యుద్ధం మొదలు పెడతాం/ మోసం మీద, వంచన మీద…/ బొమ్మ చనిపోయిందని పిల్లలేడుస్తారు/ బొమ్మల్లాంటి పిల్లలను బ్రతికించుకునేందుకు/ తల్లులు దుఃఖ దుఃఖంగా పరుగులు పెడతారు/ యుద్ధమూ ఆట వస్తువే..” ( 23.12.23, ఫేస్బుక్‌ నుండి)
ఇక్కడ ఎక్కడా సంక్లిష్టత లేదు. తత్పూర్వ కవితా వ్యాకరణాన్ని కఠినంగా శిక్షించడం లేదు. కవితలోకి మనం ప్రవహించాలి లేదా మనల్ని కవితైనా ప్రవహించేటట్లు చేయాలి.
కవిత శీర్షిక చాలా విభిన్నంగా ఉంది. శీర్షికలు ఎప్పుడూ కవితకు ఒక రిఫరెన్స్‌లా ఉండాలి. కచ్చితంగా కవితలో ఆ పదం ఉండి తీరాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరిదీ జాగా అనడంలో యుద్ధానికి కారణమైన మౌలిక ప్రశ్న ఉదయిస్తుంది. అది ఎవరిదీ కానప్పుడు, యుద్ధం ఎందుకు?
కవులలో ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాల్లో నిజాయితీ ఒకటి. కానీ దురదష్టవశాత్తు చాలామంది కవులలో అది ఉండటం లేదు. చెప్పేదొకటి చేసేదొకటి. తను కూడా దానికి అతీతమేం కాదంటూనే ఆత్మ విమర్శ చేసుకున్న తీరు మనల్ని ఆలోచింపజేస్తుంది. ప్రతి కవి జీవితంలో ప్రతి సందర్భంలో తనని తాను ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో హృద్యంగా మనం తీసుకుంటూనే ఉన్నాం గానీ ఇవ్వడం మర్చిపోయాం అంటూ ఎత్తిపొడుపుగా ఆయన అంటున్నా, అవును నేను పరమ సెక్యులర్‌ని అనే మాట కచ్చితంగా మన మెదడును తొలుస్తుంది. నిజంగా నేను ఒక సెక్యులర్‌ నేనా అనే ప్రశ్న మనల్ని నిలబడుతుంది. అవును నేను పరమ సెక్యులర్‌ని అనే కవితను పరిశీలిస్తే నికార్సైన కవి ఎలా ఉండాలో తెలుస్తుంది.
చాలామంది కవిత్వం అభిప్రాయాన్ని కవిత్వంలో పొందుపరుస్తారు. అలాగే కొంతమంది ఒక కవితని ఎలా రాయాలో చెబుతూ ఉంటారు. కొంతమంది ఆ కవితలు రాసేటప్పుడు ఎదురయ్యే కష్టాలను కూడా చెప్తారు. మన అనుభవాలను పాల చెంబులాంటి గుండెల్లో నుంచి కొలుస్తూ పుస్తకాల్లోకి ఒంపుతూ ఉంటాం అంటాడు. కవితను రాసే కవిని పండించే రైతుతో పోలుస్తూ ఈ కవిత సాగిన విధానం కొత్తగా ఉంటుంది.
”దిగుబడి తగ్గిందని విచారిస్తావు/ నిజానికి నువ్వు అక్కడ ఏమీ విత్తలేదని పంట చేతికి అందలేదని అంటాడు/ ఏం చేయాలో దిక్కు తోచదు, కొత్త విత్తనాలు కనుగొనేందుకు బయలుదేరుతారు” అంటాడు. నిజానికి ఇక్కడ విత్తనం అంటే కవిత్వ వస్తువు. మనం అనుభూతి చెందనపుడు, ఆ భావాన్ని అనుభవించనప్పుడు అది వస్తువుగా మారదు ఒక మంచి కవితగా మారదు. సరుకు అయిపోతుంది. పెన్ను మూసేస్తాడు.
”కొత్త కాలాన్ని కళ్ళతో చూద్దామని/ నేను కూడా ఎర్రని యాక్టివా/ TS04 EX2437 మీద రోడ్డెక్కాను/ నిన్ననో మొన్ననో పిల్లలడిగారు/ కారు కొనుక్కుందాం నాన్నా అని/ నయా సాల్‌ కి ముబారకో కదా…/ స్కూటర్‌ మెకానిక్‌/ పాత మరకల చొక్కానే తొడుక్కున్నాడు/ అంతే…”
ఇక ఇక్కడి నుంచి ఈ కవితని మనమే పూరించుకోవచ్చు. మామూలు మాటల్లోనే అసాధారణ భావాన్ని కలిగించడం ఈ కవిలో ఉన్న మరో ప్రత్యేక లక్షణం. విలక్షణమైన ఆలోచనలు, శబ్దార్థాల ప్రత్యేక ప్రయోగాలు పాఠకుల్ని ఆకర్షిస్తాయి.
”అతను బాల్యంలో/ బూస్టూ, కాంప్లాను అయ్యాడు/ మరి శైశవంలో అతడు/ బేబీ ఆయిల్‌ సబ్బు అయ్యాడు” కవిత ఇలా ప్రారంభమవుతుంది. జీవితంలో వస్తువు ఎలా భాగం అవుతుందో చెప్తాడు.
”పెళ్లి మాత్రం అనేక ప్రకటనల్లో/ కనిపించే మోడల్స్‌ అందరూ కలిసిన/ ముఖంతో అయింది”
ఈ వాక్యాలు చదివిన పాఠకుడు ఒక్కసారిగా కుదేలవుతాడు. హఠాత్తుగా ఆగిపోతాడు. అయితే కవి కవితలోని తర్వాత వాక్యాలు వస్తువు మనిషిని ఏం చేస్తుందో చెప్తాడు. అతనికి చాలా కాలంగా ఒక కోరిక ఉందంటాడు. ఎన్నో వస్తువులు కాగలిగిన అతను, ఎంతో జీవితాన్ని అనుభవించిన ఆ వ్యక్తిలో ఒక చిత్రమైన కోరికతో ఉన్నాడు. అయితే అది విన్నాక మనం చిత్రం అనుకోకూడదు. నొసలు, ముక్కు, పెదవులు విరవకూడదు.
మిత్రులారా అప్పుడెప్పుడో అలా ఉండి, కాలం మారే కొద్ది అటో ఇటో మారిపోయిన, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిన రాసిన వాక్యాలపై కూడా నిలబడలేకపోయిన ముందు తరం కవులు గురించి కావచ్చు, మనలాంటి కవుల గురించి కావచ్చు. అది చదువుతూ ఉంటే వేషాలు మార్చిన గాయకులు, ప్రభుత్వపరమైన కవులు, రంగులు మార్చుకున్న వాక్యాలు గుర్తుకు వస్తాయి. ఈ కవి రాసిన అంతరింపూ, ఒక, జలదరింపూ కవిత చదివితే. కవిత 2012 లో ఉంటుంది. వీలు ఉంటే చదవండి. మనం కూడా అలా అవుతామా అలా అయిపోయామా చెక్‌ చేసుకుందాం.
”కవుల మట మేము/ కవన మట మాది/ ఏ ఒక్కడిని మార్చలేకపోయిన వాళ్ళం/ నాలుగు ధైర్య వచనాలు మాత్రమే చెప్పగలం/ చెవులు వైరస్‌ లేనట్లే మనిషికి లేవ్‌” (Man or microbe), (ఫేస్‌ బుక్‌ నుండి)
సన్నాఫ్‌ మాణిక్యం అంటే అందరికీ తెలిసే ఉండొచ్చు, అతని పేరు రావులపాటి సీతారాం.
(సీతారాం గారికి దేవులపల్లి రామానుజరావ్‌ అవార్డు వచ్చిన సందర్భంగా)
– డాక్టర్‌ గోపాల్‌ సుంకర, 9492638547

Spread the love