నవతెలంగాణ గాంధారి
వినాయక చవితి పండగ వచ్చిందంటే హడావుడి అంతా ఇంతా కాదు ముఖ్యంగా యువకులు సంవత్సరం మొత్తంలో ఏ పండుగకు ఇవ్వని ప్రాముఖ్యత వినాయక చవితి నవరాత్రులకు ఇస్తారు. పండగ 15 రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. యువకులు గణేష్ మండపాల ఏర్పాటు కోసం ప్రముఖులను రాజకీయ నాయకులను వ్యాపారుల నుండి వారికి తోచిన విధంగా చందాలు ఇవ్వాలని కోరుతుంటారు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు అడగకముందే గణేష్ మండపాల నిర్వాహకులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహాలు కొనివ్వడం, మండపాల ఏర్పాటు ఖర్చులు భరించడం. అన్నదానం ఖర్చులు, గణేష్ నిమజ్జనం రోజు డీజే ఖర్చులు, బ్యాండ్ ఖర్చులు, నిమజ్జనానికి తరలించడానికి ట్రాక్టర్ ఖర్చులు, ఇతర నిర్వహణ ఖర్చులు ఇలా ఈసారి నాయకులు పోటీపడి గణేష్ మండపాల నిర్వహణ ఖర్చులు భరిస్తున్నారు.
యువతను మాకు ఎన్నికల లో సహకరించాలని ప్రత్యక్షంగా ప్రచారం చేయకుండా పరోక్షంగా యువతను ప్రసన్నం చేసుకోవడం కోసం వివిధ రాజకీయ పార్టీల నాయకులు పోటీ పడుతున్నారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో నాయకులు సర్పంచ్ ఎంపీటీసీ వార్డ్ మెంబర్ జెడ్పిటిసికి పోటీ చేసే ఆలోచనలు ఉన్న అభ్యర్థులు గణేష్ మండపాల ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అలాగే ఒకసారి ప్రచారం కూడా అయిపోతుందని నాయకులు భావిస్తున్నారు అలాగే పార్టీ నాయకులకు మేం పోటీలో ఉన్నట్టు సాంకేతాలు కూడా పంపుతున్నారు. ప్రత్యర్థులకు మేమే మా పార్టీ అభ్యర్థులం పార్టీలో ఉన్న నాయకులకు కూడా సర్పంచ్ పోరులో మేము ఉన్నట్టు పరోక్షంగా సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గణనాథుని సహకారంతో గణేష్ మండపాలు ఏర్పాటు చేసిన యువతకు కొంత ఆర్థిక వెసులుబాటు కలిగింది.