– సొంతగడ్డపై సఫారీతో వీడ్కోలు టెస్టు
కాన్పూర్: బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకిబ్ అల్ హసన్ టీ20లకు గుడ్ బై పలికాడు. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌తోనే పొట్టి ఫార్మాట్ కెరీర్‌కు ముగింపు పలికానని వెల్లడించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వీడ్కోలు టెస్టు ఆడతానని ప్రకటించాడు. దీంతో బంగ్లాదేశ్ తరఫున షకిబ్ ఇక నుంచి వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. భారత్‌తో టీ20 సిరీస్‌లోనూ షకిబ్ ఆడటం లేదు. అయితే, స్వదేశంలో వీడ్కోలు టెస్టుపై స్పస్టత రావాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ ప్రభుత్వంలో పార్లమెంట్ సభ్యుడిగా షకిబ్ భాగస్వామి. దీంతో మీర్పూర్‌లో జరిగే టెస్టులో షకిబ్‌కు భద్రత కల్పించటంపై బీసీబీ సహా ప్రభుత్వ విభాగాల నుంచి హామీ రావాల్సి ఉంది. టెస్టులో ఆడటంతో పాటు తిరిగి విదేశాలకు చేరుకునేందుకు స్పష్టమైన హామీ లభిస్తేనే ఆడతానని షకిబ్ తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్‌లో సఫారీ పర్యటనకు దక్షిణాఫ్రికాకు ఇంకా భద్రతపరమైన క్లియరెన్స్ రావాల్సి ఉంది. 37 ఏండ్ల షకిబ్ 129 టీ20ల్లో 2551 పరుగులు, 149 వికెట్లు పడగొట్టాడు. 70 టెస్టుల్లో 4600 పరుగులు సహా 242 వికెట్లు తీసుకున్నాడు.