నవతెలంగాణ-ఆసిఫాబాద్
జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని రమాదేవి అన్నారు. శనివారం నుంచి ఝార్ఖాండ్‌లో నిర్వహింస్తున్న 34వ సబ్ జూనియర్ జాతీయస్థాయి ఖోఖో ఛాంపియన్షిప్‌కు బయలుదేరుతున్న గిరిజన క్రీడ పాఠశాల విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో చదువుతున్న నలుగురు గిరిజన విద్యార్థులు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో పాటు ఈ నెల 18 నుంచి 25 వరకు కల్లూరు లో నిర్వహించిన ప్రత్యేక క్యాంపులో ప్రతిభ కనబరిచి తెలంగాణ జట్టుకు ఎంపికయ్యారని అన్నారు. విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అధికారి బండమీనారెడ్డి, జీసీడీఓ శకుంతల, ఏసీఎంఓ ఉద్దవ్, ఏటీడీఓ చిరంజీవి, శిక్షకులు తిరుమల్, ఎంపికైన విద్యార్థులు నాగేశ్వరి, వైష్ణవి, సరోజ, శ్రీలత పాల్గొన్నారు.