లాభాల్లో లేం…నష్టాలు తగ్గిస్తున్నాం జీతాల పెంపునకు సీఎం సానుకూలం

– త్వరలో నిర్ణయం
– ‘ప్రగతి చక్రం వార్షిక పురస్కారాలు’ కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) లాభాల్లో లేదనీ, నష్టాలను మాత్రమే తగ్గిస్తున్నామని ఆ సంస్థ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌ అన్నారు. గతంలో రోజుకు రూ.8 కోట్ల నుంచి రూ.9 కోట్లు వచ్చే ఆదాయం ఇప్పుడు రూ.14 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఉద్యోగులకు ఏడు డిఏలు చెల్లించామనీ, ఇంకో డిఏ బకాయి ఉన్నదనీ, త్వరలో దాన్నీ ఇస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విషయం తమకు తెలుసనీ, వారికి జీతాలు పెంచాల్సి ఉన్న విషయాన్ని మంత్రులు టీ హరీశ్‌రావు, కే తారకరామారావుతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారనీ, త్వరలో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ ఒక్కటీ పూర్తయితే తమకు సంపూర్ణ తృప్తి లభిస్తుందని చెప్పారు. మంగళవారంనాడిక్కడి టీఎస్‌ఆర్టీసీ కళాభవనంలో ‘ప్రగతి చక్రం వార్షిక పురస్కారాలు’ పేరుతో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు అవార్డులు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమానికి బాజిరెడ్డి గోవర్థన్‌ ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఆర్టీసీ సిబ్బంది కచ్చితంగా ఉంటారనీ, దీనివల్ల రాష్ట్రం మొత్తం తమ కుటుంబంలాగే కనిపిస్తుందని అన్నారు. ప్రయివేటు రవాణాకు ధీటుగా ఆర్టీసీ పనిచేస్తున్నదని తెలిపారు. పోటీ వద్దంటూ ప్రయివేటు ఆపరేటర్లు తనవద్దకు వచ్చి చెప్తుంటారనీ, కానీ రాష్ట్రంలో విద్య, వైద్యరంగాల్లో ఎలాగైతే ప్రయివేటుతో పడుతున్నానమో అలాగే ప్రజారవాణాలో కూడా పోటీ ఉండాలని తాము భావిస్తామన్నారు. దానికోసం కొత్త బస్సులు కొంటున్నామనీ, బస్టాండ్లలను ఆధునీకరిస్తున్నామనీ చెప్పారు. ప్రస్తుతం రూ.37 కోట్లతో నిర్మల్‌ బస్టాండు, రూ.80 కోట్లతో వరంగల్‌ బస్టాండ్లలో షాపింగ్‌ కాంప్లెక్సులు నిర్మిస్తూ అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ ప్రత్యేక బస్సులకు అనూహ్య స్పందన లభించిందనీ, ఇదే తరహాలో మహారాష్ట్రలోని పండరీపూర్‌, తుల్జాపూర్‌ యాత్రా స్థలాలకు కూడా పర్యాటక టూర్‌ ప్యాకేజీలు నడపాలని సూచించారు. టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్లు ఉన్న సంస్థ నష్టాలను రూ.600 కోట్లకు తగ్గించా మన్నారు. ఇది కచ్చితంగా సంస్థ ఉద్యోగులు, అధికారుల సమిష్టి కృషితోనే సాధ్యమైందని తెలి పారు. ఆర్టీసీ ఉద్యోగు లు రకరకాల ఛాలెంజ్‌లు స్వీకరించి, విజేతలుగా నిలిచారని కొనియాడారు. దేశంలోనే టీఎస్‌ఆర్టీసీ ఉత్తమ ప్రజా రవాణా సంస్థగా పనిచేస్తున్నదనీ, ఉద్యోగుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో రోజూ 1,500 మంది ఔట్‌ పేషెంట్లకు సేవలు అందిస్తూ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చామని తెలిపారు. సంస్థ స్వావ లంబన స్థితికి వెళ్తున్నదనీ, భవిష్యత్‌లోనూ దీన్ని కొనసాగిం చాలని ఆకాంక్షించారు. రోల్‌ ఆఫ్‌ హానర్‌, ఎక్స్‌ట్రామైల్‌, ఇన్నోవేషన్‌, బెస్ట్‌ ఎంప్లారు, ఉత్తమ డిపో, ఉత్తమ రీజియన్‌ వంటి వివిధ కేటగిరీల కింద 573 మందికి అవార్డులు అందచేశారు. అవార్డు గ్రహీతల్లో డ్రైవర్లు, కండక్టర్లు, మెకా నిక్‌లు, హెల్పర్లు, శ్రామిక్‌లు, సూపర్‌వైజర్లు, డిపో మేనేజ ర్లు, డిప్యూటీ, రీజినల్‌ మేనేజర్లు ఉన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన డిపోలకు నగదు ప్రోత్సాహకాలను అంద చేశారు. కార్యక్రమంలో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రవీందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ (వి అండ్‌ ఎస్‌) సంగ్రామ్‌ సింగ్‌ జి.పాటిల్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు మునిశేఖర్‌, కష్ణకాంత్‌, పురుషోత్తం, వెంకటే శ్వర్లు, వినోద్‌ పాల్గొన్నారు.

Spread the love