వారి చట్టపరమైన హౌదా రద్దు

వారి చట్టపరమైన హౌదా రద్దు– నాలుగు దేశాలకు చెందిన 5.32 లక్షల మంది వలసదారులపై ఎఫెక్ట్‌
– ట్రంప్‌ మరో షాకింగ్‌ నిర్ణయం
వాషింగ్టన్‌ : వివాదాస్పద చర్యలతో అలజడి సృష్టిస్తున్న ట్రంప్‌.. మరో షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తాత్కాలిక వలసదారులను టార్గెట్‌ చేసుకున్నారు. యూఎస్‌వ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హౌదాను రద్దు చేస్తున్నట్టు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హౌమ్‌లాండ్‌ సెక్యూరిటీ ప్రకటించింది. క్యూబా, హైతీ, నికరాగ్వే, వెనిజులా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకు చట్టపరమైన హౌదాను రద్దు చేస్తున్నట్టు హౌమ్‌లాండ్‌ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. నెల రోజుల్లో వారిని దేశం నుంచి బహిష్కరించనున్నట్టు వివరించింది. 2022 అక్టోబర్‌ తర్వాత ఆ నాలుగు దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన దాదాపు 5,32,000 మందికి ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. మానవత పెరోల్‌ కార్యక్రమం కింద అమెరికాకు వచ్చిన వారిపై ఈ కొత్త విధానం ప్రభావం చూపనున్నది. వీరంతా ఇతరుల ఆర్థిక సహకారంతో అమెరికాకు వచ్చారనీ, రెండేండ్ల పాటు యూఎస్‌లో నివసించటానికి, పని చేయటానికి తాత్కాలిక అనుమతులు పొందారని హౌమ్‌లాండ్‌ సెక్యూరిటీ సెక్రెటరీ క్రిస్టీ నోయెమ్‌ వెల్లడించారు. వీరు ఏప్రిల్‌ 24 లేదా ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోటీసులు ప్రచురించిన 30 రోజుల తర్వాత అమెరికాలో ఉండేందుకు లభించిన లీగల్‌ స్టేటస్‌ను కోల్పోనున్నారని తెలిపారు.మానవతా పెరోల్‌ అమెరికాలో సుదీర్ఘకాలంగా ఉన్న వెసులుబాటు. యుద్ధం, రాజకీయ అస్థిరత ఉన్న దేశాల ప్రజలు అమెరికాకు వచ్చి తాత్కాలికంగా నివాసం ఉండేందుకు వీలుగా ఈ లీగల్‌ స్టేటస్‌ను కల్పిస్తారు. గతేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ దీని గురించి పలుమార్లు ప్రస్తావించారు. ఇందులో భాగంగా ఆయన ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. అంతకముందు ఉన్న నిబంధనల ప్రకారం.. మానవతా పెరోల్‌ కింద వచ్చేవారు రెండేండ్ల పాటు చట్టబద్ధంగా దేశంలో ఉపాధి పొందొచ్చు. ఆ గడువు ముగిసిన తర్వాత మరింత ఎక్కువ కాలం ఉండాలనుకుంటే.. శరణార్థిగా లేదా వీసా కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉండేది. అయితే, ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేశారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలు ఫెడరల్‌ కోర్టులలో పిటిషన్లు దాఖలయ్యాయి.

Spread the love