ప్రతీకారానికి సమయమిదే

It's time for revenge.– భారత్‌ 100 శాతం సుంకాలను వసూలు చేస్తోంది : వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌
-అందరి చూపు ట్రంప్‌ వైపే
వాషింగ్టన్‌: తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాల పైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన వాణిజ్య యుద్ధానికి కౌంట్‌డౌన్‌ షురూ అయింది. ఇప్పుడు అందరి దృష్టీ ఆయన పైనే నిలిచి ఉంది. ఎందుకంటే ట్రంప్‌ ప్రకటించిన ప్రతీకార సుంకాల విధింపు ప్రక్రియ బుధవారం (ఏప్రిల్‌ 2) నుంచి అమలులోకి రాబోతోంది. దీనిని ఆయన విమోచన దినోత్సవంగా అభివర్ణించారు. అమెరికా ఉత్పత్తులపై విదేశీ వాణిజ్య భాగస్వాములు ఎంత మేర సుంకాలు విధిస్తారో తాము కూడా వారి ఉత్పత్తులపై ఆ స్థాయిలోనే దిగుమతి సుంకాలు విధిస్తామని, కాబట్టి ఇక తాము విదేశీ వస్తువులపై ఎంతమాత్రం ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అయితే ఏయే దేశాలపై ఏ మేరకు సుంకాలు విధిస్తారో ఇంకా తెలియడం లేదు.
అమెరికాపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల జాబితాను కరోలిన్‌ మీడియాకు చూపించారు. ”దురదష్టవశాత్తూ కొన్ని దేశాలు చాలా కాలంగా మమ్మల్ని టారిఫ్‌ల రూపంలో పీల్చేస్తున్నాయి. అవన్నీ అన్యాయమైన వాణిజ్య విధానాలు. అమెరికా డెయిరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య 50శాతం సుంకాలు వసూలు చేస్తోంది. మా బియ్యంపై జపాన్‌ 700శాతం, యూఎస్‌ వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ 100 శాతం, మా బటర్‌, చీజ్‌పై కెనడా 300 శాతం టారిఫ్‌ వసూలు చేస్తున్నాయి. వీటి వల్ల మా ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు పంపించడం అసాధ్యంగా కన్పిస్తోంది. అమెరికన్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సమయం అని భావిస్తున్నాం” అని ఆమె వివరించారు.
వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు చరిత్రాత్మక మార్పును తీసుకురాబోతున్నారని కరోలిన్‌ అన్నారు. అమెరికా ప్రజల క్షేమం కోరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని, బుధవారం (ఏప్రిల్‌ 2) నుంచి అమల్లోకి రాబోతున్నాయని తెలిపారు. అంతకుముందు అధ్యక్షుడు ట్రంప్‌ కూడా దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ”పరస్పర ప్రతీకార సుంకాల విషయంలో మేం శాశ్వత నిర్ణయం తీసుకోబోతున్నాం. అది మా దేశానికి భారీ గేమ్‌ ఛేంజర్‌ లాంటిది” అని అన్నారు.
అంతేకుండా.. తమ ప్రతీకార సుంకాలు ప్రపంచంలోని అన్ని దేశాలపైనా ఉంటాయని ట్రంప్‌ స్పష్టం చేశారు. ‘చాలా ఏండ్లుగా మేం ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించాం. కానీ చరిత్రలో ఏ దేశాన్నీ దోచుకోని విధంగా అవి అమెరికాను దోచుకున్నాయి. వాణిజ్య పాలసీల విషయంలో కొన్నిసార్లు అమెరికా మిత్ర దేశాలు.. శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తించాయి. దశాబ్దాలుగా వారు మనపై విధించిన, వివిధ పేర్లతో దోచుకున్న దానికంటే ప్రస్తుతం అగ్రరాజ్యం ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలు చాలా తక్కువ” అని అధ్యక్షుడు తెలిపారు.
మినహాయింపులుండవ్‌..
భారత్‌ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలకు సిద్ధమైంది అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తుది నిర్ణయాన్ని ప్రకటించాక… ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని ట్రంప్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. తాజాగా దీనిపై వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ మాట్లాడారు. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ 100శాతం సుంకాలు వసూలు చేస్తోందని అన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాల వల్ల అమెరికా ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారుతోందని అన్నారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు.

Spread the love