దేశానికి ‘అనన్య’ పాఠం!

ఈదృశ్యం చూడగానే ప్రపంచ నరమేధ ఇజ్రాయిల్‌ గాజాపై సాగిస్తున్న భీకరబాంబుల వర్షం నుంచి తప్పించుకుని, శిథిలాల కింద పుస్తకాల బ్యాగును సంకన పెట్టుకుని, గాజాలో వీధుల వెంట పరుగెత్తిన చిన్నారి గుర్తుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో తమ గుడిసె కాలుతుంటే ఓ బాలిక స్కూల్‌ బ్యాగును పట్టుకుని ఏడుస్తూ పరుగెత్తడం అందరి మనసుల్ని కలిచి వేసింది. ఈ వీడియో భారత అత్యున్నత్త న్యాయస్థానాన్ని కలవరపాటుకు గురిచేసింది. అంతకన్నా ముందు ‘బుల్డోజర్‌’ కూల్చివేతలపై యోగీ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది. ఇక్కడే ఒక వసివాడని మనసు అనన్య దేశానికి ఒక పాఠం చెప్పింది! చట్టవ్యతిరేకమైన, రాజ్యాంగ విరుద్ధమైన బుల్డోజింగ్‌ను ‘డబులింజన్‌సర్కార్‌’ ఒక సంస్కృతిగా మార్చింది. దళితులు, ముస్లిం మైనార్టీల లక్ష్యంగా ప్రారంభమై ‘బుల్డోజింగ్‌ జస్టిస్‌’ పేరుతో పేదల ఇండ్లను కూల్చేస్తున్నది. ఈ కూల్చివేత పర్వం భావి భారత పారులుగా ఎదగాల్సిన చిన్నారుల హృదయాలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నది పాలకులు గమనించకపోవడం శోచనీయం. దేశాన్ని ఏలే పెద్దమనుషులు మాట మాట్లాడితే ‘బేటి బచావో..బేటి పడావో’ అంటూ సాగించే ఉపన్యాసం ఈ చిన్నారి వేదనకు కారణం అన్వేషించగలదా? ఈ ఘటన నుంచి గుణపాఠం నేర్వగలదా?
ఆ ఎనిమిదేండ్ల బాలిక పేరు అనన్య. యూపీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నది. కూలీ పనులు చేసుకుని బతికే కుబుంబం. గతనెల 21న అంబేద్కర్‌నగర్‌లో ఇండ్ల కూల్చివేత వారిని నిలువ నీడ లేకుండా చేసింది. యాభై ఏండ్లుగా ఆక్రమణలో ఉంటున్న గుడిసె మంటల్లో కలిసింది. దీన్ని చూస్తున్న బాలిక తన పుస్తకాల సంచిని భద్రంగా పట్టుకుని పరుగులు పెట్టింది. స్కూలు నుండి వచ్చిన తర్వాత తమ గుడిసెను ఆనుకుని వున్న పశువుల పాకలో పుస్తకాల సంచి పెట్టింది. ఆక్రమ ణలో ఉన్నాయనే పేరుతో కొందరి ఇండ్లు కూలగొడుతుండగా మంటలు చెల రేగాయి. వారి గుడిసె కూడా నిప్పంటుకుంది. ఒక్కసారిగా తన పుస్తకాలు కాలిపోతాయేమోననే భయంతో చిన్నారి పరుగెత్తింది. తల్లి వారిం చినా వినలేదు. అవి కాలిపోతే మళ్లీ స్కూల్లో దొరకవని భయపడింది. ఆ చిన్నారి వీడియో వైరల్‌ అయ్యాక ఆమెతో చాలామంది మాట్లాడారు. ‘కలెక్టర్‌ కావాలని..దేశాన్ని రక్షించాలని’ చెప్పి దేశం మీద తన అభిమానాన్ని చాటింది.
అంతకన్నా ముందు సుప్రీంకోర్టు ప్రయాగ్‌రాజ్‌లో 2021లో బీజేపీ ప్రభుత్వం డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆరు ఇండ్లను బుల్డోజర్లతో కూల్చి వేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ అహ్మద్‌ హత్య తర్వాత అతని స్థిరాస్తుల్ని ప్రభుత్వం కూల్చివేసింది. ‘అతిక్‌ ఇండ్లనుకుని పొరపాటు వేరేవారివి కూల్చామని’ అధికారులు చెప్పారు. వాస్తవానికి ఇండ్ల కూల్చివేతల బాధితుల్లో ఓ లాయర్‌, ఓ ప్రొఫెసర్‌ కూడా ఉన్నారు. ప్రొఫెసర్‌, లాయర్‌, మరో ముగ్గురు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కోర్టు వారి పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో వారు సుప్రీం గడపతొక్కాల్సి వచ్చింది. అనేక వాదనల తర్వాత మంగళవారం సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి మొట్టికాయలేసి తుదితీర్పును వెలువరించింది. ‘ఈ తీరు మమ్మల్ని ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసింది.ఈ కూల్చివేతలు పూర్తిగా అమానవీయం, చట్టవిరుద్ధం. ఎవరైనా ఆశ్రయం పొందేందుకు భారత రాజ్యాంగం హక్కు కల్పించింది. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్‌లో అది స్పష్టంగా ఉందని డెవలప్‌మెంట్‌ అథారిటీ గుర్తుంచుకోవాలి.’ అని పేర్కొంది. దీంతో పాటే ‘ మీరు కూల్చి వేసిన ఇంటి బయట ఓ చిన్నారి ఏడుస్తున్న వీడియో ఎంతో హృదయ విదార కంగా ఉంది. ఈ వీడియో చూసి ప్రజలు అనేక మంది కలత చెందారు.ఈ తరహా కూల్చివేతలను వెంటనే ఆపేయాలి. కూల్చివేతలు ఫ్యాషన్‌ కాకూడదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అంతేకాదు, ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే ప్రతీకార ధోరణికి స్వస్తి చెప్పాలని, అధికారులే న్యాయమూర్తుల పాత్ర పోషిం చటం సరైంది కాదని స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాల పట్ల వ్యవహరించాల్సిన విధి విధా నాలను కూడా ప్రకటించి, అవి దేశం మొత్తానికి వర్తిస్తాయని చెప్పింది. అయినప్పటికీ పాలకులు పట్టించుకుంటే కదా! యోగి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఇలా తలంటడం ఇదే మొదటిసారి కాదు, బుల్డోజింగ్‌ అన్యాయాన్ని తలకెత్తుకున్న ప్రతిసారీ మొట్టికాయలు వేస్తూనే ఉంది. అయినా, బుద్ధితెచ్చుకోని సర్కార్‌ అదే అనాగరిక ధోరణిని సాగిస్తున్నది. ఇది క్రమంగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటికీ పాకించింది. దేశంలో ముస్లింల ఇండ్లను కూలగొట్టడం ప్రారంభించి, ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక కార్యక్ర మాలు, నిరసనల్లో పాల్గొన్న సామాన్యుల ఇండ్లను నేలమట్టం చేస్తూ వచ్చింది. మొన్నిమధ్య మహారాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ‘మీ ఇంటి మీదకు బుల్డోజర్లను పంపిస్తాం’ అన్నాడు. ఈ వ్యాఖ్యల్ని పరిశీలిస్తే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని చట్టాలను వారి చుట్టంగా భావిస్తున్నా రన్నమాట! ఇలా.. మతం మాటున జరుగుతున్న కూల్చివేతలపై దేశంలో ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఉత్తరప్రదేశ్‌లో జరిగింది ఘటనగా కా కుండా, దేశానికి పొం చిన ముప్పుగా పరిగణించాలి. అనన్య లాంటి చిన్నారికి జరిగిన ‘భావోద్వేగ గాయం’ మరెవరికి జరగకుండా బాసటగా నిలవాలి.

Spread the love