Monday, September 29, 2025
E-PAPER
Homeజాతీయంసంపన్నులకే మేలు

సంపన్నులకే మేలు

- Advertisement -

జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పేదలకు ఒరిగేదేమీ లేదు
అనాలోచిత నిర్ణయమే
పెద్ద నోట్ల రద్దులా విఫల ప్రయోగం అవుతుందా?

ట్రంప్‌ సుంకాల హెచ్చరికలతో కలత చెందిన కేంద్ర ప్రభుత్వం హడావిడిగా జీఎస్టీ శ్లాబులు తగ్గించింది. పెద్ద నోట్లను రద్దు చేయడం, వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టడంపై ఏ మాత్రం ఆలోచించకుండా మోడీ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను నష్టపరిచాయి. ఇప్పుడు జీఎస్టీ రేట్లను తగ్గించడం కూడా హడావిడిగా చేపట్టిన అలాంటి అనాలోచిత చర్యే. ఈ నిర్ణయం సంఘటిత రంగానికి, సంపన్నులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది తప్ప దీని వల్ల అట్టడుగు వర్గాల వారికి ఒరిగేదేమీ ఉండదు. మొత్తంగా చూస్తే ఇది ప్రతికూల ప్రభావాన్నే సూచిస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ : జీఎస్టీ రేట్లను కుదించడాన్ని, ఆ పన్నుకు సంబంధించిన నిబంధనల్లో కొన్ని మార్పులు చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల స్వాగతిస్తూ ఈ చర్యను ‘తదుపరి తరం సంస్కరణ’గా అభివర్ణించారు. దాన్ని ‘బచత్‌ ఉత్సవ్‌’గా చెప్పుకొచ్చారు. ఆత్మనిర్భరత దిశగా ఇదో అడుగు అని కొనియాడారు. అయితే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ గురించి ప్రకటించడం, ఆ తర్వాత కొద్ది కాలానికే అంటే సెప్టెంబర్‌ 3న జీఎస్టీ మండలి దానికి ఆమోదముద్ర వేjడం…ఈ పరిణామాలకు దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
పన్ను రేట్ల కుదింపు ఎందుకంటే… భారత్‌పై జరిమానా సుంకాన్ని విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను కుదించింది. అమెరికా విధించిన సుంకాల కారణంగా మన దేశం నుంచి అక్కడికి జరుగుతున్న ఎగుమతుల్లో దాదాపు సగం…అంటే రూ.4.4 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు ప్రమాదంలో పడతాయి.

అమెరికాతో మన వాణిజ్య లోటు బాగా పెరుగుతుంది. విదేశీ మారక నిల్వలు పడిపోతాయి. ఫలితంగా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడుతుంది. ద్రవ్యోల్బణం కూడా బాగా పెరుగుతుంది. కొత్త మార్కెట్ల కోసం అన్వేషణ జరుగుతుంది. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. ఎందుకంటే సుంకాల కారణంగా నష్టపోయే ఇతర దేశాలు కూడా నూతన మార్కెట్ల అన్వేషణలో పడతాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమే మంటే ప్రపంచ వాణిజ్యానికి ఎదురవుతున్న అడ్డంకుల కారణంగా ఇతర మార్కెట్లకు జరిపే ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఎగుమతులపై అధిక ప్రభావం పడితే ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. ప్రైవేటు పెట్టుబడులు బలహీనంగా ఉన్నందున వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. జీఎస్టీ రేట్లను కుదించడం వల్ల ధరలు తగ్గుతాయని, డిమాండ్‌ పెరుగుతుందని, ఫలితంగా వినియోగమూ పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

ఇదేమి పండుగ ?
జీఎస్టీ రేట్ల కుదింపుతో ప్రజల రోజువారీ వినియోగ వస్తువుల ధరలు తగ్గుతాయని, తద్వారా వాటిపై కుటుంబాలు చేస్తున్న వ్యయం తగ్గిపోతుందని ప్రభుత్వం అంటోంది. ప్రజలు చేసే ఈ పొదుపునే మోడీ ‘బచత్‌ ఉత్సవ్‌’ (పొదుపు పండుగ) అంటున్నారు. జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల రూ.48,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతామని (2023-24 డేటా ఆధారంగా) ప్రభుత్వం అంచనా వేసింది. అంటే ఇది వినియోగదారులు చెల్లించాల్సిన తక్కువ పన్ను పరిమాణం. ఇది ఓ వ్యక్తికి సంవత్సరానికి రూ.331 లేదా అతని వినియోగంలో 0.23 శాతంతో సమానం. కొన్ని వస్తువులపై పన్ను ఆదాయంలో పెరుగుదలను పరిగణనలోకి తీసుకోకపోయినప్పటికీ ఏడాదికి చేసే పన్ను ఆదా దీనికి మూడు రెట్లు లేదా 0.7 శాతంగా ఉండవచ్చు. అలాంటప్పుడు ఈ స్వల్ప పొదుపునే పండుగ అని ఎలా చెబుతారు? అది కూడా మొత్తం జీఎస్టీ తగ్గింపును వినియోగదారులకు అందించినప్పుడే సాధ్యపడుతుంది.

వాస్తవ ప్రభావం ఇప్పుడే తెలియదు
వ్యాపారం చేసే వారు తమ లాభాల మార్జిన్లలో పన్ను తగ్గింపులను కూడా కలుపుకుంటారని గత అనుభవాలు చెబుతున్నాయి. ఒకవేళ పన్ను తగ్గింపు ద్వారా సమకూరే ఆదాయాన్ని కొన్ని నెలల తర్వాత వినియోగదారులకు అందజేసినప్పటికీ ఆ తర్వాత అది రివర్స్‌ కావచ్చు. రాబోయే పండుగల సీజన్‌లో అమ్మకాలు ఊపందుకుంటాయి. మరోవైపు పన్ను రేట్లు తగ్గడంతో కార్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అయితే వినియోగంపై దీని వాస్తవ ప్రభావాన్ని చూడాలంటే కొన్ని నెలలు వేచి ఉండాల్సిందే. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పన్ను వసూళ్లలో తగ్గుదల ధరల తగ్గుదలకు సమానం కాదు. ఉదాహరణకు కార్లనే తీసుకుందాం. వాటిపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. మరో మాటలో చెప్పాలంటే రూ.100 రూపాయల ఖరీదైన కారును గతంలో రూ.128కి అమ్మారు. ఇప్పుడు రూ.118కి విక్రయిస్తున్నారు. అంటే ధరలో తగ్గుదల 7.8 శాతం మాత్రమే.

పొదుపు మరింత తగ్గవచ్చు
జీఎస్టీ రేట్ల కుదింపుతో కార్ల అమ్మకాలపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 35.7 శాతం తగ్గుతుంది. కాబట్టి గతంలో వసూలు చేసిన మొత్తాన్ని ఇప్పుడు రాబట్టుకోవాలంటే కార్ల అమ్మకాలు 55.5 శాతం పెరగాల్సి ఉంటుంది. అయితే ఇది జరిగే పని కాదు కాబట్టి ప్రభుత్వ ఆదాయం పడిపోతుంది. ఆదాయం తగ్గితే కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక లోటు పెరుగుతుంది. ప్రభుత్వం బడ్జెట్‌ స్థాయిలో లోటును కొనసాగించిన పక్షంలో ఖర్చుల్ని తగ్గించుకోవాలి.

రాష్ట్రాలు తమ సామాజిక వ్యయంలో ఎక్కువ భాగం అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం వినియోగిస్తాయి. కాబట్టి ఈ వ్యయంలో రాష్ట్రాలు కోత పెడితే ఆ వర్గాలపై ప్రభావం పడుతుంది. అంటే జీఎస్టీ తగ్గింపు ద్వారా పొదుపు పెరగడం మాట అటుంచి అది మరింత తగ్గే ప్రమాదం ఉంది. జీఎస్టీ హేతుబద్ధీకరణతో రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయన్న ప్రధాని వాదనలో పస లేదని దీని ద్వారా అర్థమవుతోంది.

ఎవరి డబ్బు ఆదా అవుతుందంటే…
కార్లు, ఫ్రిడ్జ్‌లు వంటి వాటిని అణగారిన వర్గాల ప్రజలు కొనలేరు. కాబట్టి ఇలాంటి విలాస వస్తువుల ధరలు తగ్గినంత మాత్రాన వారికి ఒరిగేదేమీ ఉండదు. ఈ వర్గాల వారు ఎక్కువగా అసంఘటిత రంగం ఉత్పత్తి చేసే వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు సంఘటిత రంగంలో తయారైన ప్యాక్డ్‌ రోటీలు, పిజ్జా బ్రెడ్‌ లేదా పరోటా లపై జీఎస్టీని కేంద్రం పూర్తిగా తొలగించింది. అయితే వీటిని అట్టడుగు వర్గాల వారు కొనుగోలు చేయరు. ఒకవేళ వారు రోటీలను కొనుగోలు చేసినా దాబాలు, హోటళ్లలో కొంటారు. అక్కడ జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం కన్పించదు. అసంఘటిత రంగం లో వస్తువులను ఉత్పత్తి చేసే వారు ఎక్కువగా జీఎస్టీ నికర పరిధికి వెలుపలే ఉంటారు. తగ్గిన జీఎస్టీ రేట్లు వారికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చవు. మరో మాటలో చెప్పాలంటే జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు సంఘటిత రంగం నుంచి కొనుగోలు చేసిన వారికి…ఎక్కువగా సంపన్న వర్గాలకు, దిగువ మధ్య తరగతి ప్రజలకే అందుతాయి.

ప్రమాదంలో అసంఘటిత రంగం
సంఘటిత, అసంఘటిత రంగాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువుల ధరల్లో వ్యత్యాసం తగ్గుతున్న కొద్దీ అసంఘటిత రంగం నుంచి వస్తువులను కొనుగోలు చేస్తున్న కొందరు వినియోగదారులు సంఘటిత రంగం నుంచి వచ్చే ప్యాకేజీ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఇది ప్రమాదకరమైన పరిణామం. దీనివల్ల వారాంతపు మార్కెట్లలో జనం పలచగా కన్పిస్తారు. సంఘటిత రంగం ఉత్పత్తి చేసే వస్తువులకు డిమాండ్‌ మరింతగా పెరుగుతుంది.

వాస్తవానికి పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి, అలాగే జీఎస్టీ రేట్లను లోపభూయిష్టంగా నిర్ణయిం చినప్పటి నుంచి సంఘటిత రంగ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోంది. అసంఘటిత రంగం వేగంగా క్షీణిస్తోంది. ఉపాధి దెబ్బతింటోంది. ఆదాయం పడిపోతోంది. డిమాండ్‌ తగ్గిపోతోంది. పేదల ఆదాయం కొంతమేర పెరిగినప్పటికీ వారు మధ్య తరగతి ప్రజల స్థాయికి చేరకపోవడంతో వారు నయా-మధ్య తరగతి జీవులుగానే మిగిలి పోతున్నారు. అసంఘటిత రంగం ఎక్కువగా వెనుక బడిన రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమైంది. కాబట్టి జీఎస్టీని తగ్గించినప్పటికీ ఆ రంగం నష్టపోతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -