– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ
– పెరిగిన ధరలను తగ్గించాలని
– నేడు, రేపు నిరసనలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పెరుగుతున్న ధరలను నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ అన్నారు. పెరుగుతున్న ధరలకు నిరసనగా ఈ నెల 6, 7 తేదీల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం కేంద్రంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో సీపీఐ(ఎం) ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు, మెడిసిన్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారన్నారు. గ్యాస్, వంటనూనె, పప్పులు, అల్లం వెల్లుల్లి, ఈ పెరిగిన ధరలను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని దుయ్యట్టారు. నిత్యం ఇంట్లో వాడుకునే వస్తువుల ధరలు దడ పుట్టిస్తున్నాయన్నారు. పెరిగిన ధరలతో ఏది కొనలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడి పనిచేసిన డబ్బంతా కూరగాయలకు, నిత్యావసర సరుకులకే సరిపోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కుటుంబ పోషణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రజల ఆదాయాలు మాత్రం పెరగడం లేదన్నారు. కానీ ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. ఈ పెరిగిన ధరలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఈ పెరిగిన ధరలను తగ్గించాలని దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పి.యాదయ్య, బోడ సామేల్, ఎం.చంద్రమోహాన్, డి.జగదీష్ జిల్లా కమిటీ సభ్యులు డి.రాంచందర్, కే.జగన్, ఆలంపల్లి నర్సింహ, శ్యాంసుందర్, డి.కిషన్, ఆర్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.