పంత్‌కు పిలుపు

పంత్‌కు పిలుపు– దూబె, శాంసన్‌, చాహల్‌కు చోటు
– టీ20 ప్రపంచకప్‌కు
– భారత జట్టు ఎంపిక
ఐసీసీ టైటిల్‌ వేటలో దశాబ్ది నిరీక్షణకు తెరదించగల గెలుపు గుర్రాలు సిద్ధం. 2024 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడే భారత జట్టుకు రోహిత్‌ శర్మ సారథ్యం వహించనుండగా.. రిషబ్‌ పంత్‌, సంజు శాంసన్‌, శివం దూబె, చాహల్‌లు జట్టులో చోటు సాధించారు. ఈ మేరకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
నవతెలంగాణ-అహ్మదాబాద్‌
ఉత్కంఠ వీడింది. నిరీక్షణకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భారత టీ20 ప్రపంచకప్‌ జట్టును మంగళవారం ప్రకటించారు. అహ్మదాబాద్‌లోని ఓ హౌటల్‌లో సమావేశమైన సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ, బోర్డు కార్యదర్శి జై షా వరల్డ్‌కప్‌ గెలుపు గుర్రాలను ఎంపిక చేశారు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఫైనల్స్‌కు చేర్చిన రోహిత్‌ శర్మకే మరోసారి సారథ్య పగ్గాలు దక్కాయి. హార్దిక్‌ పాండ్య వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు చూసుకోనున్నాడు. తీవ్ర రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌.. సుమారు రెండేండ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చాడు. యువ ఆల్‌రౌండర్‌ శివం దూబె సహా సంజూ శాంసన్‌, మణికట్టు స్పిన్నర్‌ యుజ్వెంద్ర చాహల్‌ వరల్డ్‌కప్‌ జట్టులో నిలిచారు. వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త ఆతిథ్యంలో ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్‌ జూన్‌ 2 నుంచి ఆరంభం కానుండగా.. టీమ్‌ ఇండియా వేట జూన్‌ 5న ఆరంభం కానుంది. గ్రూప్‌ దశలో ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, యుఎస్‌ఏ, కెనడాలతో భారత్‌ ఢకొీట్టనుంది.
ఐపీఎల్‌ స్టార్స్‌కు దక్కని చోటు : ఐపీఎల్‌ 17వ సీజన్లో వీరోచితంగా ఆడుతున్న కుర్రాళ్ల ప్రదర్శనను సెలక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. యుఎస్‌ఏ, కరీబియన్‌ దీవుల పిచ్‌ల స్వభావం, అక్కడ రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలను బేరీజు వేసుకుని 15 మంది ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేశారు. బ్యాటింగ్‌ లైనప్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు తోడుగా యశస్వి జైస్వాల్‌ ఓపెనర్‌గా రానున్నాడు. విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌ మిడిల్‌ ఆర్డర్‌లో రానున్నారు. రెండో వికెట్‌ కీపర్‌గా సంజూ శాంసన్‌ ఎంపికయ్యాడు. పేస్‌ ఆల్‌రౌండర్లుగా హార్దిక్‌ పాండ్య, శివం దూబె జట్టులో నిలువగా.. స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా నిలిచారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్లుగా కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వెంద్ర చాహల్‌ ఎంపికయ్యారు. జశ్‌ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, మహ్మద్‌ సిరాజ్‌ స్పెషలిస్ట్‌ పేసర్లుగా జట్టులో నిలిచారు. రిజర్వ్‌ ఆటగాళ్లుగా నలుగురిని ఎంపిక చేశారు. ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా శుభ్‌మన్‌ గిల్‌, లోయర్‌ ఆర్డర్‌లో రిజర్వ్‌ ప్లేయర్‌గా రింకూ సింగ్‌ నిలువగా.. ఖలీల్‌ అహ్మద్‌, అవేశ్‌ ఖాన్‌లు రిజర్వ్‌ పేస్‌ బౌలర్లుగా ఎంపికయ్యారు.
మే 2న మీడియా ముందుకు! : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పోటీపడే భారత జట్టుపై మాట్లాడేందుకు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మీడియా ముందుకు రానున్నారు. మే 3న వాంఖడేలో ముంబయి ఇండియన్స్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ ఉండగా.. ముందు రోజు మే 2న ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఉంటుందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, సంజు శాంసన్‌, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), శివం దూబె, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వెంద్ర చాహల్‌, అర్షదీప్‌ సింగ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌. (రిజర్వ్‌ ప్లేయర్స్‌ : శుభ్‌మన్‌ గిల్‌, రింకూ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, అవేశ్‌ ఖాన్‌).

Spread the love