పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో
పడిపోతున్న పాల దిగుబడి
పాల ఉత్పత్తులకూ తప్పని కొరత
న్యూఢిల్లీ : మనదేశంలో పాలు, పాల పదార్థాల వినియోగం ఎక్కువే. ఉదయం లేవగానే ఓ కప్పు టీ లేదా కాఫీ కడుపులో పడాల్సిందే. డైనింగ్ టేబుల్ వద్ద చిన్నా పెద్దా అందరికీ పనీర్ కన్పించాల్సిందే. ఇక ప్రతి వేడుకలోనూ మిఠాయిలు, చాక్లెట్లు తప్పనిసరి. ‘పప్పులో నెయ్యి కలిపితే స్వర్గం కన్పిస్తుంది’ అనే నానుడి ఉండనే ఉంది. రొట్టెలపై కూడా నెయ్యి రాసుకొని తింటారు. అంటే ప్రతి భారతీయ ఆహారంలోనూ డెయిరీ ఉత్పత్తులు ఏదో ఒక రూపంలో కన్పిస్తుంటాయి. పాలు, పాల ఉత్పత్తులను ఇంతగా ఇష్టపడే మనకు ప్రస్తుతం వేసవి ఎండల తీవ్రత రూపంలో కష్టకాలం దాపురించింది.
తగ్గుతున్న పశుగ్రాసం
రాబోయే కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాలలో పచ్చిక బయళ్లు అదృశ్యమ వుతాయని, ఫలితంగా ఈ శతాబ్దం చివరి నాటికి ఒక్కో పశువులో పాల ఉత్పత్తి సుమారు పాతిక శాతం తగ్గిపోతుందని అంచనా. గత సంవత్సరం ఉత్తర, మధ్య భారతంలో ముందస్తుగానే వడగాలులు వీచాయి. దీంతో అనేక ప్రాంతాలలో పాల ఉత్పత్తి పడిపోయింది. సేకరణపై ఒత్తిడి పెరిగింది. అనేక ప్రముఖ డెయిరీలు పాల ధరను పెంచేశాయి. ఈ ఏడాది ఇప్పటికే ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. అనేక చోట్ల అవి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఒత్తిడి పశువుల పైనే కాదు…పశుగ్రాసంపై కూడా పడుతోంది. రుతుపవనాల సీజన్‌లో పశుగ్రాసాన్ని ఎక్కువగా సాగు చేస్తారు. అయితే వాతావరణంలో సంభ విస్తున్న అనూహ్య మార్పుల కారణంగా పశుగ్రాసం ఉత్పత్తిని అంచనా వేయడం కష్టం. కొరత కారణంగా ఇప్పటికే పశుగ్రాసం ధరలు కొన్ని ప్రాంతాలలో మూడింతలు పెరిగాయి. దీంతో చిన్న కమతాలు కలిగిన రైతులు విధిలేని పరిస్థితులలో పశువులను తక్కువ ధరకు తెగనమ్ముకుంటున్నారు. లేదా వాటి సంఖ్యను తగ్గించుకుంటున్నారు. ఏది జరిగినా పాల ఉత్పత్తిపై ప్రభావం పడక తప్పదు.
వాతావరణ ప్రభావమే కారణం
2024లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం…దేశంలో పశుపోషణపై ఆధారపడిన ఎనిమిది కోట్ల మందికి పైగా రైతులు తమ పశువులపై వాతావరణ మార్పుల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని పశువులలో సంకరజాతికి చెందినవే ఎక్కువ. దేశీయ జాతులతో పోలిస్తే ఇవి వాతావరణ మార్పులను తట్టుకోలేవు. వేసవి ఎండల తీవ్రత ప్రభావం అనివార్యంగా పాల ఉత్పత్తిపై పడుతోంది. మన దేశంలో వాతావరణం ఎక్కువ కాలం వేడిగానే ఉంటుంది. ఇది పాల ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపి దానిని దెబ్బతీస్తుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు పశువులు మేత, దాణాను తగినంతగా తీసుకోవు. దీంతో సహజంగానే పాల ఉత్పత్తి పడిపోతుంది. పశువు తన శక్తినంతటినీ శరీరాన్ని చల్లబరచుకోవడానికే వినియోగిస్తుంది. పాల ఉత్పత్తితో పాటు దాని నాణ్యత కూడా తగ్గిపోతుంది. సీజన్ల వారీగా నెలకొనే వాతావరణ పరిస్థితులలో పాల ఉత్పత్తి 25.8 శాతం వరకూ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రపంచంలో అత్యధిక ఉత్పత్తి జరుగుతున్నా…
చాలా మంది ప్రజలు లీటర్ల కొద్దీ పాలను రిఫ్రిజిరేటర్లలో భద్రపరచుకుంటారు. అవసరం వచ్చినప్పుడు వాడుకుంటారు. ప్రపంచంలో అత్యధికంగా పాల ఉత్పత్తి జరుగుతున్నది మన దేశంలోనే. ఓ అంచనా ప్రకారం ప్రపంచ ఉత్పత్తిలో సుమారు పాతిక శాతం వాటా మనదే. 2024లో దేశీయ ఉత్పత్తి 239 మిలియన్ టన్నులకు చేరింది. బియ్యం, గోధుమల మొత్తం విలువతో పోలిస్తే దేశంలో ఉత్పత్తి అవుతున్న పాల విలువే అధికం. అంటే దేశంలో అత్యంత ముఖ్యమైన రెండు పంటలు కలిసి కూడా పాల ఉత్పత్తితో, వినియోగంతో పోటీ పడలేకపోతున్నాయన్న మాట. అలాంటి పాడి పరిశ్రమ వాతావరణ మార్పుల కారణంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
సూపర్ ఎల్‌నినో ప్రభావం తప్పదా?
పాల ఉత్పత్తి వ్యయంలో దాణా వాటా 60-70 శాతం ఉంటుంది. పశుగ్రాసం ధరలు పెరిగితే రైతుల లాభాలు తగ్గిపోతాయి. వినియోగదారులపై అధిక ధరల భారం పడుతుంది. ఈ సంవత్సరం సూపర్ ఎల్‌నినో ప్రభావం ఉంటుందన్న అంచనాల నడుమ పాల ఉత్పత్తి తగ్గి, ధరలు గణనీయంగా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. మన దేశంలో పాడి పరిశ్రమపై ఆధారపడి ఎందరో జీవనాన్ని సాగిస్తున్నారు. తొమ్మిది కోట్ల గ్రామీణ కుటుంబాలకు చెందిన నలభై ఐదు కోట్ల మంది ప్రజలు దేశీయ పాడి పరిశ్రమ పైనే ఆధారపడ్డారు. వీరిలో మహిళలు, చిన్నకారు రైతుల సంఖ్యే అధికం. వేసవిలో పాడి పరిశ్రమపై పడే ప్రభావం వారి ఆదాయాన్ని దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమను వాతావరణ మార్పుల ప్రభావం నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలి. దేశీయ పశు జాతుల సంఖ్యను పెంచేందుకు విధానాలను రూపొందించాలి.



