నవతెలంగాణ-హైదరాబాద్: పలు రోజుల నుంచి విదేశీ పర్యటనలతో పీఎం మోడీ చక్కర్లు కొడుతున్నారు. తాజాగా ఇటలీలోని రోమ్‌లో ప్రధానమంత్రి అడుగుపెట్టగా , ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆయనకు స్వాగతం పలికారు. భారత్- ఇటలీ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఇరువురి నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ తనకు ‘మెలోడీ’ టాఫీల (చాక్లెట్ల) ప్యాకెట్‌ను బహుమతిగా ఇస్తున్న వీడియోను మెలోని స్వయంగా షేర్ చేశారు. ఆ వీడియోకు “బహుమతికి ధన్యవాదాలు” అని ఆమె క్యాప్షన్ పెట్టారు.
అదే విధంగా ప్రధానమంత్రి మోడీ బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లాతో ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరిపారు. ఈ ద్వైపాక్షిక సమావేశంలో పీఎం మోడీ వెంట విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (పశ్చిమ) సిబి జార్జ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి, ఇతర సీనియర్ దౌత్య అధికారులు పాల్గొన్నారు.



