Wednesday, May 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జనగణనలో సిబ్బంది కష్టాలు

జనగణనలో సిబ్బంది కష్టాలు

- Advertisement -

కార్లు, ట్రాక్టర్ల వివరాలకు జనం నిరాకరణ
15 గ్రామాల్లో సామాజిక ఆర్థికగణన ప్రక్రియ
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి కులసర్వే క్షేత్రస్థాయిలో వింత అనుభవాలకు వేదికవుతోంది. ప్రభుత్వం సిద్ధం చేసినా 34 ప్రశ్నల ఫారాలను పట్టుకుని సిబ్బంది ఇంటింటికీ తిరుగుతుంటే ప్రజల నుంచి వస్తున్న సమాధానాలు ఎన్యుమరేటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో సంపన్న వర్గాలు మధ్యతరగతి ప్రజలు తమ ఆర్ధిక వివరాలను దాచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఎక్కడ కట్ అవుతాయోనన్న భయంతో అన్నీ ఉన్నా మాకేమీలేవంటూ కొందరు అక్కడక్కడ దాపరికం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మండలంలో 15 గ్రామాల్లో ఈసర్వే ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోంది.ఈ కార్యక్రమం కోసం మండల యంత్రాంగం 54 మంది ఎన్యుమరేటర్లను రంగంలోకి దించింది. వీరి విధులను పర్యవేక్షించేందుకు,ఎప్పటికప్పుడు తప్పులను సరిదిద్దేందుకు 7 మంది సూపర్వైజర్లను నియమించారు. యంత్రాంగం క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నప్పటికీ, ప్రజల నుంచి ఆశించినస్థాయిలో పారదర్శకత లభించడం లేదన్న సందేహాలు వినిపిస్తున్నాయి.

కార్లు, ట్రాక్టర్లు ఉన్నా..
సర్వేలో భాగంగా వాహనాలు,ఆస్తుల వివరాలు అడుగుతుండడంతో జనం కొంత మంది ఇబ్బంది పడుతున్నారు.ఇంటి ముందే కారు, చేనులో ట్రాక్టర్ కనిపిస్తున్నా..వాటి వివరాలు చెప్పేందుకు యజమానులు వెనుకాడుతున్నారు. అవి మావి కావు అద్దెకు తెచ్చాం మా తమ్ముడి పేరు మీద ఉన్నాయి అంటూ రకరకాల సాకులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.ఆస్తులు వాహనాల వివరాలు రికార్డుల్లోకెక్కితే భవిష్యత్తులో ఉచితపథకాలకు కోత పడుతుందనే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.

 ఎండల్లో చికాకు..
ప్రస్తుతం ముదురుతున్న ఎండల కారణంగా సర్వే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఉదయం నుంచే ఇళ్ల బాట పడుతున్నా కొన్ని చోట్ల ప్రజల తీరు ఎన్యుమరేట్లకు తీవ్ర చికాకు కలిగిస్తోంది. కనీసం ఇంట్లోకి పిలవకుండా,ఆరుబయటే ఎండలో నిలబెట్టి సమాచారం ఇస్తూ హడావుడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ప్రజలు ఇచ్చిన సమాచారంలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, వివాదాలు ఎందుకని భావిస్తున్న ఎన్యుమరేటర్లు వారు చెప్పిన వివరాలనే నమోదు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.సర్వేకేవలం అర్హులగుర్తింపు భవిష్యత్ ప్రణాళికల కోసమేనని అధికారులు చెబుతున్నా ప్రజల్లో ఉన్న అపోహలు మాత్రం తొలగడంలేదు.ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించి వాస్తవాలు చెప్పేలా చూడాలని ప్రజా సంఘాలు,మేధావులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -