Thursday, April 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యోగులకు భరోసా

ఉద్యోగులకు భరోసా

- Advertisement -

రూ.వెయ్యి కోట్లకు పెరిగిన బకాయిల చెల్లింపులు
2015 అక్టోబర్‌ వరకు రిటైర్డ్‌ ఉద్యోగుల జీపీఎఫ్‌ నిధులు విడుదల

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టమైన ఆదేశాల మేరకు ఉద్యోగుల పెండింగ్‌ బకాయిల కోసం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల నిధులను బుధవారం విడుదల చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఈ మేరకు నిధులను విడుదల చేశారు. గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం 2026 మార్చి వరకు ప్రతినెలా ఉద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం అమలు చేసింది. ఉద్యోగుల ఆర్థిక అవసరాలు, వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా గమనించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని రూ.వెయ్యి కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్‌ నెలకు సంబంధించి రూ.వెయ్యి కోట్లను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. 2025 అక్టోబర్‌ వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్‌ ఉద్యోగుల జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌) బకాయిలన్నింటినీ ఈ నిధులతో విడుదల చేశారు. ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది సీనియర్‌ సిటిజన్లకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం.

ఉద్యోగుల ఆరోగ్య అవసరాలకు సంబంధించి మెడికల్‌ బిల్లులను ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా, ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం మెడికల్‌ బిల్లుల చెల్లింపులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని ప్రకటించింది. మెడికల్‌ బిల్లులు, స్కాలర్‌షిప్‌లకూ మోక్షం ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క రోజు కూడా జాప్యం లేకుండా మెడికల్‌ బిల్లుల చెల్లింపులు నిరంతరం జరిగేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ‘ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు. వారి సమస్యలను పరిష్కరించడం మా బాధ్యత” అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పెంచిన నిధులు, మంజూరైన జీపీఎఫ్‌ బకాయిలు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఉద్యోగ వర్గాల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనే విషయాన్ని ఈ తాజా నిర్ణయం నిరూపిస్తోందని తెలిపారు. ఉద్యోగుల కష్టాలను గుర్తించి, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి చొరవతో పెద్ద మొత్తంలో నిధులు విడుదల కావడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -