విఫల ప్రయోగం!

”ఒక కళాకారుడు తన ధ్యాసని చేసే పని మీద లగం చేయకుండా ప్రేక్షకుల చప్పట్ల మీదా, అందుకోబోయే బిరుదుల మీదా ఉంచినప్పుడు కళంకం తప్పదు” అని సాగర సంగమం సినిమాలో కథానాయకుడు అంటాడు. 2016 నోట్ల రద్దు ఈ కోవలోకే వస్తుందేమో! ఆనాడు అట్టహాసంగా విడుదల చేసిన 2వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. క్లీన్‌ మనీ అనే కాన్సెప్ట్‌లో భాగంగా ఈ రద్దును ప్రకటిస్తున్నట్లుగా ఆర్బీఐ పేర్కొన్నది. ఈ నినాదం ఒక కుంటి సాకులా ఉన్నది. ఈ నోటును విడుదల చేసినప్పుడే అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మొహం చాటేసిన చందాన దీనిని రద్దు చేశారు. అంచేత ఈ నోట్ల రద్దులన్నీ ఈ దశాబ్దపు విఫల ప్రయోగాలుగా చరిత్రలో నిలుస్తాయి. మేధావులంతా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతుంటే సామాన్యులు అంగీకరి స్తున్నారని ఒక వక్రభాష్యాన్ని గోడీ మీడియా మోసింది. దీని గురించి తన పుస్తకంలో ప్రస్తావిస్తున్న నరేంద్ర మోడీకి నాలుగేళ్ళుగా ఆర్థిక సలహాదారుగా పని చేసి రిటైర్‌ అయిన అరవింద్‌ సుబ్రమనియన్‌ అన్నదేమంటే, ‘నల్లధనం పోగేసిన వాళ్ళందరి రోగం కుదురు తుందన్న’ భ్రమల్లో సదరు సామాన్యులు ఉండి మావి మేకలు పోతే వారివి ఆవులు పోతాయిగా అంటూ కొంత నష్టాన్ని కూడా భరించారు అని. గత నోట్ల రద్దు చేదు అనుభవం దృష్ట్యా కావచ్చు ఈసారి చాలా గడువు నోట్ల మార్పిడికి ఆర్బీఐ ఇచ్చింది. అయితే ప్రస్తుతం 2వేల రూపాయల నోట్లు సాధారణ ప్రజానీకం దగ్గర ఎక్కువగా లేవన్నది ఒక సమాచారం. అదేవిధంగా బ్యాంకుల దగ్గర కూడా ఈ నోట్లు లేవని కూడా తెలుస్తుంది. 2వేల నోట్ల మొత్తం విలువ 3.62 లక్షల కోట్ల రూపాయలు అని ఆర్బీఐ తేల్చింది. మరి ఈ నగదు ఎవరి దగ్గర ఉన్నట్లు? తాజా సమాచారం ప్రకారం నోట్ల మార్పిడి కన్నా వాటిని డిపాజిట్‌ చేయ డానికే కొందరు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అది బ్యాంకులోకి చేరే క్రమంలో ఎంత మందిని జవాబు దారి చేయనున్నారు, వారి పన్ను పరిధులెంతా… అనే అంశాలు బయట పెట్టగలిగితే ఆర్‌బీఐ కార్యకలాపాలపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.
నోట్ల రద్దు గుర్తుకు రాగానే కొందరిలో భయానక దడ పుడుతుంది. ఎందుకంటే ఏడేండ్ల క్రితం 2016 నవంబర్‌లో రాత్రికి రాత్రి ప్రకటించబడిన నోట్లరద్దు పర్యవసానాలు సాధారణ ప్రజానీకాన్ని చాలా ఇబ్బంది పెట్టాయి. కొందరు పెద్దల అండతో ముందుగానే మేల్కొని కావలసిన నగదు వ్యవహారాలను చక్కబెట్టుకున్న వారు తమ దగ్గర ఉన్న నూతన కరెన్సీ నోట్లను పాత నోట్లతో మార్చుకుంటూ ఒక కోటి రూపాయలకు 30లక్షల రూపాయల కమిషన్‌ని తీసుకున్నట్లుగా అనేక వార్తలు వెలువడ్డాయి. గిరిజన ప్రాంతాల ప్రజలు పల్లెటూరి అమాయక ప్రజానీకం తమ దగ్గర ఉన్న రెండు మూడు నోట్లను మార్చుకోవడానికి కూడా ఎంతో చెల్లించుకోవలసి వచ్చింది. పాత నోట్లు మార్చు కోవడానికి బ్యాంకుల దగ్గర పోస్టాఫీస్‌ దగ్గర కిలోమీటర్ల మేర క్యూలైన్‌లలో నిలబడాల్సి వచ్చింది. నగదు అవసరమేర్పడిన కొందరు రోగులు యూరిన్‌ బ్యాగులతో సహా వచ్చి బ్యాంకుల దగ్గర నిలబడి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో అధికారిక లెక్కల ప్రకారం 109మంది చనిపోయినట్లుగా కూడా తేల్చారు. నగదును మార్చే క్రమంలో బ్యాంకుల సిబ్బంది కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. ఓవర్‌ టైంలు చేసి కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరికొందరైతే నగదు మార్చే క్రమంలో పొరపాటున కొన్ని ప్రొసీజర్లను పాటించక పోవడంతో తీవ్రమైన క్రమశిక్షణ చర్యలకు లోనయ్యారు. అనేక ఎల్‌ఐసి కౌంటర్లలో కూడా క్యాషియర్లు ఇబ్బందులకు గురయ్యారు. నగదు కొరత ఏర్పడి రోజు కూలీలకు కొన్ని నెలల పాటు ఉపాధి కరువైంది. నగదు ఆధారిత వ్యాపారాలు కర్మాగారాలు నిర్మాణాలు వంటి పనులన్నీ కొన్ని నెలలుగా ఆగిపోయాయి. సాధారణ పరిస్థితిలో నెలకొనడానికి చాలా కాలం పట్టింది. అరవింద్‌ సుబ్రమనియన్‌ చెప్పినట్లు చరిత్రలో ఎక్కడా నోట్ల రద్దుతో అవినీతిని అంతం జేసినట్లు గానీ ఎగవేత దారులను ఏరిపారేసినట్లు గానీ ఆనవాళ్ళు లేవు. అంతే కాకుండా సుబ్రమనియన్‌ సమర్పిస్తున్న గణాంకాల ప్రకారం నోట్ల రద్దుకన్నా ముందు సగటున 8శాతం సాలీనా వృద్ధి సాధిóస్తే నోట్ల రద్దు అనంతరం ఏడు త్రై మాసికాల్లో (దాదాపు రెండేళ్ళ కాలానికి) కేవలం 6.8శాతం మాత్రమే నమోదైంది. అంచేత ఏకపక్షంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసిందనడానికి ఈ గణాంకాలే సాక్ష్యం.
అసలు ఈ రెండు వేల రూపాయల నోట్లను ఎందుకు విడుదల చేసినట్లో సమాధానం చెప్పకుండా రద్దు చేయడం అంటే తప్పును అంగీకరిస్తున్నట్లే. ఇంకా చెప్పాలంటే 2016 నవంబర్‌ 8న ఉన్నఫళంగా రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్ల డిమానిటైజేషన్‌ కూడా నిష్ప్రయోజనాన్ని చేకూర్చింది. నల్లధనం కుప్పలు కుప్పలుగా మూలుగుతున్నది కాబట్టి నోట్ల రద్దును ప్రకటిస్తే, లాకర్లలో, బంకర్లలో దాచుకున్న డబ్బునంతా మార్చుకోలేక తగలబెట్టుకుంటారని తద్వారా నల్లధనంగా ఉన్న లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు రావు అని గొప్ప గొప్ప మాటలు చెప్పారు. ఆనాడు 500, 1000 రూపాయల నోట్ల రూపంలో ఉన్న 15లక్షల 52 వేల కోట్ల రూపాయల్లో 98శాతం బ్యాంకులోకి వచ్చి చేరాయి. అంటే కేవలం పదివేల కోట్ల రూపాయలు రాలేదు. కానీ కొత్త కరెన్సీని ఫ్రింట్‌ చేయడానికి 20వేల కోట్ల రూపాయలు ఖర్చయింది. నల్ల ధనపు కుబేరులెవరో సర్కారుకు తెలియదా? ఆదాయ పన్ను శాఖ దగ్గర అన్ని వివరాలూ వున్నవి. అలాంపుడు నేరుగా చర్యలకు ఉపక్రమించకుండా ఈ అసంబద్దమైన వ్యవహారాల ద్వారా సామాన్యులతో పాటు, దేశం మొత్తం ఇబ్బందులకు గురైంది.
కొన్ని గణాంకాలను పరిశీలిస్తే 2016లో 18లక్షల కోట్ల రూపాయల లోపు ఉన్న భారతదేశ నగదు నేడది 34.6లక్షల కోట్లకు చేరింది. డిజిటల్‌ లావాదేవీలు అంటూ ఊదరగొట్టిన తర్వాత అవి ఒక్క గతేడాది 8 కోట్ల ట్రాన్సా క్షన్స్‌ నమోదయాక కూడా ఈ ఏడేళ్లలో నగదు నిలువలు రెండింతలు కావడం అంటే అది తిరోగమన పయనమే కదా? నగదు జీడీపీ నిష్పత్తి చూసినప్పుడు 2016లో 11.7శాతం ఉంటే 2023లో 12.7శాతం ఉంది. నిజానికి జీడీపీ పెరిగిన తర్వాత అందులో నగదు నిష్పత్తి తగ్గాలి. కానీ అది పెరిగింది. నోట్ల రద్దు తర్వాత అక్రమ సంపాదకులు జాగ్రత్తపడి పన్ను పరిధిలోకి తమను తాము చేర్చుకోవాలి. అలా జరగనుంది అని అంచనా వేశారు. కానీ ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేసే వారి సంఖ్య పెరిగింది గాని పన్ను మొత్తం పెరగలేదు. పన్నులు చెల్లించే రేటును ఒకసారి గమనిస్తే, 2016 ముందు స్థూల జాతీయోత్పత్తిలో 1.6శాతం ఉంటే, ఆ తర్వాతి సంవత్సరాల్లో క్రమక్రమంగా అది తగ్గుతూ తగ్గుతూ 2022-23లో 0.8శాతంగా నమోదయింది. 2016 తర్వాత భారత జీడీపీలో 59శాతం వృద్ధి నమోదయింది. అలాంటప్పుడు పన్నుల శాతం కూడా పెరిగి ఉండవలసింది. 2018 నుండే 2వేల నోట్ల ముద్రణను ఆపేశారు, వాటికై డిమాండూ లేదు. అయినప్పటికీ ఈ రద్దూ వంటి తతంగాలు చూస్తుంటే అంతకు మించిన రాజకీయ ప్రయోజనాలేవో దాగివున్నాయన్న అనుమానం రాక మానదు.
రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నల్ల ధనాన్ని అరికట్టేందుకని సోషల్‌ మీడియా ద్వారా నమ్మబలక జూస్తున్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా ఎట్లాగైతే ఎన్నికల నిధులను రహస్యాధికారికంగా పెద్ద పార్టీయే పోగేసుకుని, జవాబుదారి తనం అవసరం లేని పార్టీ నిధుల ఖర్చుగా చూపిస్తున్నారో అదే మాదిరిగా ఫోన్‌ పె, గూగుల్‌ పెల మాధ్యమాలతో ఓటర్లకు చేర్చే ఉపాయాలు చేయలేదంటారా? సాహసోపేత నిర్ణయాలకు మారుపేరుగా ప్రకటించుకుంటూ, త్యాగంలోనే మోక్షం అనే అసందర్భ నమ్మకాలను రెచ్చగొడుతూ వాస్తవాలను మరుగున పడేస్తున్నారు. ఆదాయార్జనల్లో మొదటి పది శాతం ప్రజానీకానికి నష్టం కలగనట్లు అనిపించవచ్చు కానీ కింది స్థాయి వారికి జరిగే నష్ట ప్రభావం అందరిపైనా పడుతుంది. అంచేత నాటకీయ రాజకీయాలకు మోహితులవకుండా సామాజిక సమస్యకు శాస్త్రీయ సమాధానాన్ని వెలువరించే ప్రయత్నాలను ప్రోత్సహించాలి.
– జి. తిరుపతయ్య

Spread the love