మల్లయోధలకూ తప్పని హింసల పరంపర

‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో’ అన్న సినీ కవి వాక్కులు అధికార మదాంధులకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సరిపోతాయి. ఢిల్లీ నడిరోడ్డు మీద, పార్లమెంటుకు కూతవేటు దూరంలో రోజుల తరబడి మల్ల ‘యోధ’ లైన యువతులు చేస్తున్న పోరాటం యావత్‌ దేశాన్ని కదిలిస్తోంది. మొత్తం సమాజం స్పందిస్తోంది. అంతర్జాతీయ సమాజం ఏం జరుగుతుందోనని పరిశీలిస్తోంది. కానీ కనీస స్పందన లేనిది అధికార మదాంధులకు మాత్రమే. 56 అంగుళాల ఛాతీని విరుచుకోవడం తెలిసిన నేతలకు దేశం పరువు నిలబెట్టిన యువతుల పరువు కాపాడాలన్న ఇంగిత జ్ఞానం, న్యాయం చేయాలన్న ‘సోయి’ మాత్రం లేకపోయింది. ఇది మన ఖర్మ అని సరిపెట్టుకోవాలా? లేక కౌరవసభలో మాన మర్యాదలు కోల్పోయిన ద్రౌపది రోదన కురువంశ వినాశనానికి దారితీసిన విధంగా వీళ్ళ పాపం పండిందన్న నిర్ధారణకు రావాలా?
ఇప్పటికి నాలుగు నెలల నుండి ఆందోళన సాగుతోంది. అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కాక గాని కాస్త ఫైలు కదలలేదు. ఎందుకు అధినాయకుల్లో చలనం లేదు? రాతి గుండెలు అనుకోవాలా. అదే సాధారణ వ్యక్తులైతే చిన్న చిన్న నేరాలకు మక్కిలిరగ్గొట్టి, కేసులు పెట్టి, జైళ్లలో కుక్కి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పుతారు కదా! అధికార, అర్థ బలంతో బలిసిన వాళ్లకు ఒక న్యాయం, సాధారణ పౌరులకు ఒక న్యాయమా! ఇదా ప్రజాస్వామ్యం?
ఆడపిల్లలు తమపై జరిగే ఏ అన్యాయమైనా… అది లైంగిక హింస గాని, గృహహింస గాని… పరువు పోతుందనో, పిల్లలు ఉన్నారనో, కెరీర్‌ నాశనం అవుతుందనో రకరకాల కారణాలతో నోరు విప్పరు. విప్పేలా చెయ్యదు ఈ సమాజం. పైగా ‘నోరు మూసుకో’ అని గదమాయిస్తుంది. లేకపోతే మూసుకొనేలా చేస్తుంది. గదిలో పడేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది. న్యాయం దొరుకుతుందో లేదో నన్న అపనమ్మకం. భయం. ఆ భయంతోనే పడి ఉంటారు. భరించ లేకపోతే నుయ్యో గొయ్యో చూసుకోవడం మామూలే కదా. ఆ భయాలతోనే కదా ఇన్నాళ్లు పడి ఉన్నారు.
స్త్రీల మంచి కోసం ఎన్నో ఉద్యమాలు నడిచాయి, నడుస్తున్నాయి. మహిళలే ఉద్యమాలు చేసినా, మగవాళ్ళ నుండి, సమాజం నుండి కూడా మద్దతు దొరికింది, దొరుకుతోంది. ఫలితంగా ఆడవాళ్లు, ఆడపిల్లలు నోరు విప్పగలుగుతున్నారు. కొన్ని భయాలు, సందేహాలు ఉన్నప్పటికీ. ‘న్యాయం దొరుకుతుందో లేదో చావో రేవో కానీ! ఏదైతే అది అయ్యిందిలే తీయి’ అన్నలెక్కో.
ప్రస్తుతానికి వస్తే ‘పోగాట్‌ సిస్టర్స్‌’లో ఒకరైన వినేష్‌ ప్రధానమంత్రికే విన్నవించుకున్నదట. అంతర్జాతీయ స్థాయిలో పథకాలు తెచ్చిన వాళ్ళం కదా! కష్టాలు చెప్పుకుంటే ప్రధానమంత్రి తీరుస్తారనుకుందేమో పాపం. రాజకీయ నాయకులు గురించి, అధికార బలం గురించి తెలియదు కదా! అందునా కుస్తీ పోటీల్లో ఉన్న ఆడపిల్ల కదా! కాస్త ధైర్యం ఎక్కువే కావచ్చు. కానీ లోకం తీరు తెలియని పిల్లలు. తీరా చూస్తే న్యాయానికి బదులు అదిరింపులు, బెదిరింపులు. అందరూ జంతర్‌ మంతర్‌ దగ్గర ధర్నాలు చేస్తున్నారు కదా! మనకి మాత్రం న్యాయం జరగకపోతుందా అనుకున్నారు. ఇప్పటికి నాలుగు నెలలు గడిచాయి. సీజన్‌ జీరో డిగ్రీల టెంపరేచర్‌ నుండి 40డిగ్రీల టెంపరేచర్‌కు మారింది. న్యాయం మాత్రం దొరకలేదు. ఇలా ఉంది ప్రభుత్వాల తీరు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లకే ఇలా ఉంటే ఇక సామాన్యుల మాట చెప్పాలా.
‘బలుపు, కండకావరం’ వంటి పదాలు పత్రికల్లో వాడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించడం ఒళ్ళు బలిసినతనాన్నే సూచిస్తుందనుకోవాలి. స్త్రీలను లొంగ తీసుకోవడమే మగతనం అనుకునే ధోరణి సొసైటీలో పాతుకుపోయింది. ఇక ధన బలం, అధికార బలానికి సొసైటీలో పేరు ప్రతిష్టలు తోడైతే ఇంకా హద్దు పద్దు ఉండదు. లైంగిక దాడులు, ఆ పై హత్యలు, కిరసనాయిలు పోసి కాలబెట్టడాలు వంటివి టీవీల్లోనూ, పేపర్లలోను వచ్చినప్పుడు మాత్రమే గుండెలు బాదుకుంటాం. అయితే వాటికి మూలం ఎక్కడుంది? స్త్రీలను చూసే దృష్టిలోనే ఉందనేది అర్థం కావడం లేదు చాలామందికి. ఆ ‘చాలా మందిలో’ కుటుంబ సభ్యులు కూడా ఉంటున్నారు.
ఈ మధ్య ఒక వ్యాసం చదివాను. భారతదేశంలో ఆడవాళ్లకు పిన్నీసులు, పక్క పిన్నులే గొప్ప ఆయుధాలంట. నిజమే. ఒంటరిగానైనా, జంటగానైనా, రాత్రి గాని, పగలుగాని, బస్సులో గాని రైల్లో గాని ప్రయాణం చేసేటప్పుడు ముక్కు మొఖం తెలియని వాళ్ళ వేధింపులకు గురికాని ఆడదంటూ మన దేశంలో లేదేమో. అపరిచితుల స్పర్శకి ఉలిక్కిపడి లేవడం, పిన్నీసులు తీసి గుచ్చటం, గమ్యం చేరే దాకా పళ్ళ బిగువున కాలం గడపటం… ఇలా ఎన్నిసార్లని చెప్పాలి. నేను కూడా ఇందుకు మినహాయింపు కాదు.
ఇప్పటి విషయానికి వద్దాం. పొగాట్‌ సిస్టర్లుగా పేరుపొందిన బబిత పోఘాట్‌, గీత, రీతు, ప్రస్తుత పోరాటంలో ఉన్న సాక్షి, సంగీత, వినేష్‌ పోగాట్లు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించటం, అదే అంశంపై ‘దంగల్‌’ సినిమా రావడం అందరికీ తెలిసిందే. ఆ తరువాత హర్యానా, పశ్చిమ యూపీ వంటి ప్రాంతాల్లో, గ్రామాల్లో కూడా కుస్తీ నేర్పించే అకాడమీలు పెరిగాయి. కొన్ని వందల మంది మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా కుస్తీ నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రుల ఇష్టంతో సంబంధం లేకుండా తాను ఇష్టపడ్డ వాడిని కులం గోత్రం చూడకుండా పెళ్లి చేసుకుందని కూతుర్ని, అల్లుడిని కుల దురహంకార హత్యలు చేయించే నేల మీదే ఆడపిల్లలు కుస్తీ నేర్చుకొని పతకాలు తేవడం గొప్ప విషయమే. అందరూ మెచ్చుకునేదే. అయితే ఈ పోటీల్లో పైకి రావడం మాత్రం తల్లిదండ్రులకు శక్తికి మించిన పని. ఉన్నదంతా కర్పూరంలా కరిగిస్తే గాని మధ్యతరగతి పిల్లలు ఆ స్థితికి రాలేరు. సాక్షి మాలిక్‌ తల్లి ఒక ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌. ఈ స్థితిలో ఎన్నైనా ఓర్చుకొని కొనసాగడమా లేక తిరిగి ఇంటికి వెళ్లిపోవడమా అనేది ప్రశ్న.
ఆడపిల్లలపై వేధింపులు మామూలుగా చెప్పుకునేట్లు లేవు. శృతి మించి కంట్రోల్‌ తప్పిన స్థితిలోనే తెగించి జంతర్మంతర్‌ దారి పట్టారు. ఎంతకీ న్యాయం జరగకపోవడంతో సహజంగానే హర్యానా, పంజాబ్‌, పశ్చిమ యూపీ ప్రాంతాల్లో గ్రామీణ రైతు స్త్రీ పురుషులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. గ్రామాల నుండి స్త్రీ పురుషులు ప్రతిరోజు వందల సంఖ్యలో వచ్చి మద్దతు ఇస్తున్నారు. ఆడపిల్లల్ని అక్కున చేర్చుకొని ఆశీర్వదిస్తున్నారు. అలా సాక్షి , వినేష్‌లను వాత్సల్యంతో అక్కున చేర్చుకోవడం నేను ఎన్నోసార్లు చూశాను. కారణం ఈ సమస్య తమ కుటుంబాల్లో ఉన్న పిల్లల సమస్య కూడా కావడమేమో.
‘తోటకూర నాడే చెప్పకపోయావా’ అని తెలుగులో సామెత. కుటుంబం గానీ, తోటి వారు గానీ, సమాజం గానీ మొదలే స్పందించి ఉంటే, నాకెందుకనో పరువు పోతుందనో భయాన్ని పక్కనపెట్టి తల ఎత్తి నోరు తెరిచి ప్రశ్నించే తత్వాన్ని మన ఆడపిల్లలకు ఇచ్చి ఉన్నట్లయితే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందేమో. కోర్టులు ఎన్ని తీర్పులు ఇచ్చినా ఎన్ని మొట్టికాయలు వేసినా మారాల్సింది మన సంఘం తీరు. మన రాజకీయ నాయకుల తీరు. రాజకీయాలను, నాయకులను మనం చూసే తీరు. భ్రష్టు పట్టిన నాయకులకు ఎప్పుడైతే రొమ్ము విరుచుకొని, మీసాలు మెలేసి తిరగకుండా చెప్పులతో ఎప్పుడు సత్కారాలు దొరుకుతాయో అప్పుడే ఈ సమాజం బాగుపడేది. నాయకులను దేవుళ్ళుగా ఆరాధించినన్నాళ్లు, 56 అంగుళాల ఛాతీలు విరుచుకొని తిరగనిచ్చినన్నాళ్లు మన ఖర్మ ఇంతే.
– ఎస్‌. పుణ్యవతి

Spread the love