జర్నలిస్టుల చిరకాల స్వప్నం నెరవేరేనా!?

ఇల్లు. జర్నలిస్టులకు చిరకాల స్వప్నం. జీవితంలో స్థిరపడ్డారని చెప్పడానికి సాధారణంగా ఇంటినే గీటురాయిగా భావిస్తాం. పరస్పరం కలిసి కరచాలనం చేసే ‘క్రమంలోనూ ‘ఇల్లు’ కట్టుకున్నావా? అని అడుగుతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణలోనూ జర్నలిస్టులకు ఇల్లు, ఇంటిస్థలం కలే అవుతున్నది. వచ్చే జూన్‌ రెండు నాటికి తెలంగాణ సాకారమై తొమ్మిదేండ్లు పూర్తవుతున్నది. కాగా తెలంగాణ జర్నలిస్టులు కట్టుకుని జీవనయానాన్ని కొంతలో కొంతైన కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలని ఓ చిన్ని ఆశ. ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిది. మరువలేనిది. ప్రాణాలకు సైతం వెరవకుండా ప్రజల ఆకాంక్షను నిజం చేయడంలో పాత్రికేయుల సాహాసం అంతా ఇంతా కాదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియా, జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు ఆశించిన మేర ప్రేమాభిమానాలను కనపరచడం లేదు. కానీ రాష్ట్రంలోని జర్నలిస్టులకు నివాసం నేతిబీర చందమవుతున్నది. రాష్ట్రంలో దాదాపు 60వేల మందికిపైగా జర్నలిస్టులు ఉంటే, వారిలో సగం మందికి కూడా అక్రిడిటేషన్లు లేవు. వారి కుటుంబాలతో కలిసి లక్షన్నర జనాభా ఉంది. ఇందులో సగం మందికి అక్రిడిటేషన్లు లేవు. వారంతా ఇండ్లులేక ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తున్నది. ఇక చిన్న, మధ్యతరహా పత్రికల్లో పనిచేసే జర్నలిస్టుల పరిస్థితి వర్ణణాతీతం. ఉమ్మడి రాష్ట్రంలో మూడుసార్లు జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు కేటాయించారు. 1978, 1982, 1994లో దాదాపు 850మందికి అప్పటి ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చాయి. ఆ సమయంలో ఉన్న ప్రభుత్వాలకు ఫెడరేషన్‌ తరపున ధన్యవాదాలు. కాగా తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర ప్రయత్నం చేసినా అది ఫలించలేదు.
అర్హులైన జర్నలిస్టులు వేలాది మంది కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌ తోపాటు జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఈపరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టులో కేసు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా కాలయాపన చేస్తున్నది. తీర్పు వచ్చాక మాత్రం చడీచప్పుడు చేయడం లేదు. జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. అయినా, సర్కారు కనీసం తన విధానాన్ని ప్రకటించలేదు. జర్నలిస్టుల అభివృద్ధి, సంక్షేమం కోసం దీర్ఘకాలికంగా పనిచేస్తున్న తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీబ్ల్యూజేఎఫ్‌) ఏండ్ల తరబడి ఇండ్లస్థలాల కోసం పోరాటాలు చేస్తున్నది. ఉద్యమాలు నిర్వహిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జర్నలిస్టుల ఇండ్లస్థలాల కోసం పలుసార్లు జర్నలిస్ట్‌ సంఘాలతో భేటి అయ్యారు. హైదరాబాద్‌ శివార్లల్లో స్థలాలు వెతికారు. మీడియా అకాడమీ ద్వారా అభిప్రాయ సేకరణ చేశారు. అయినా అడుగు ముందుకు పడటంలేదు. రాష్ట్రంలో అనేక జర్నలిస్టుల హౌసింగ్‌ సోసైటీలు ఉన్నాయి. అందులో సభ్యత్వం ఉన్నవారు, లేని వారూ అనేక మంది జర్నలిస్టులు ఉన్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులతోపాటు హైదరాబాద్‌లోని పాత్రికేయులకు ఇండ్లస్థలాలు కచ్చితంగా ప్రభుత్వం కేటాయించాల్సిందే. అర్హులకే ఇవ్వాలని కోరుతున్నాం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించాల్సిందే. ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందే. ఈనేపథ్యంలో ఫెడరేషన్‌ గత రెండు నెలలుగా నాలుగు దశల కార్యక్రమాన్ని చేపట్టింది. తొలి దశలో నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులతో సంతకాల సేతకరణ చేపట్టింది. రెండో దశలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రలు అందజేసింది. మూడో దశలో జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల ముందు రిలే దీక్షలు చేపట్టింది. నాలుగో దశలో హైదరాబాద్లో మహాధర్నా’కు పిలుపునిచ్చింది. ఇండ్లస్థలాలు వచ్చే వరకు ఫెడరేషన్‌ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని అమలుచేయాలని కోరుతున్నాం. జర్నలిస్టులకు అనుకూలంగా మాత్రమే. కోరి తెచ్చుకున్న తెలంగాణలో కూడా జర్నలిస్టులు న్యాయం కోసం ఎదురుచూడాల్సి రావడం ఆవేదనాభరితమే. ఈ నేపథ్యంలో ఈనెల 18న (గురువారం) హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద జరిగే ‘మహాధర్నా’లో జర్నలిస్టులు భారీ సంఖ్యలో పాల్గొనడం ద్వారా తమ ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకు సహకరించాలి. రండి! కదలిరండి!! వందలాదిగా తరలిరండి!!! మన ఐక్యత, శక్తిని నిరూపించు కోవడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదాం. చిరకాల స్వపాన్ని నిజం చేసుకుందాం.

– బి. బసవపున్నయ్య
  సెల్‌:9490099108

Spread the love