మరణం ఎరుగని విప్లవ సంకేతం హోచిమిన్‌

          అవినీతి, వృథా, అధికార నియంతృత్వం అనేవి ప్రభుత్వం, సైన్యం, ప్రజల యొక్క శత్రువులు. అని ఆయన పేర్కొన్నారు. అందువలన ప్రభుత్వం నుండి సాధారణ ప్రజా సంఘాలు, ప్రజల వరకు మొత్తం దేశం గానే విప్లవాన్ని నిలబెట్టుకోవాలంటే పై మూడు రుగ్మతలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉండాలి అని ఆయన చేసిన బోధనలను వియత్నాం ప్రజలు నేటికీ పాటిస్తున్నారు. కరోనా మహమ్మారితో పెట్టుబడిదారీ ప్రపంచం అల్లాడి పోయినా సోషలిస్టు వియత్నాం ఆ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది.
హోచిమిన్‌ అంటే వియత్నాం విప్లవం. విప్లవ జీవితం తప్ప వ్యక్తిగత జీవితం లేని మహోన్నత విప్లవ నేత హోచిమిన్‌. 80 సంవత్సరముల పాటు ఫ్రాన్స్‌ వలస దేశంగా, అత్యంత క్రూరంగా పరిపాలించబడ్డ దేశం వియత్నాం. అభివృద్ధి లేదు. ప్రజలు కటిక దారిద్య్రంలో, తీవ్రమైన వెనుకబాటు తనంతో మగ్గుతున్న వియత్నాంలో అనేక విప్లవ పోరాటాలు లేవనెత్తబడ్డాయి. కానీ, ఏది విజయం సాధించలేదు. ఆ విప్లవాల నాయకుల దేశభక్తి, సామ్రాజ్యవాద వ్యతిరేకత వారి అశేష త్యాగాలు అనేక కారణాల రీత్యా ఫలితాలను ఇవ్వలేదు. అటువంటి గడ్డమీద దేశభక్తితో ప్రారంభించి, ఆ దేశాన్ని విముక్తి చేయడమే గాక దానిని సోషలిస్టు రాజ్యంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. 18వ శతాబ్ధం నుండి పెట్టుబడిదారీ వ్యవస్థ భూస్వామ్య రాచరికంపై అనేక తిరుగుబాట్లు విప్లవాలు రేపింది. పెట్టుబడిదారీ వ్యవస్థ నిలదొక్కుకునే కొద్ది దాని అసాధారణ క్రూరత్వంపై కార్మికవర్గ తిరుగుబాట్లు, విప్లవాలు ప్రారం భమైనాయి. అటువంటి విప్లవాలు జరుగు తున్నాయి. జరుగుతాయి. విప్లవ పోరాటాలు విఫలమైనా లేక విజయం సాధించినా సమాజాన్ని ముందుకే నడిపిస్తాయని మానవ చరిత్ర పదేపదే చెబుతున్నది. ఆ విప్లవాలు ప్రజా నాయకులను, త్యాగధనులను ముందుకు తెస్తాయి. అటువంటి వారిలో అత్యున్నత స్థాయికి చెందిన అంతర్జాతీయ విప్లవ నేత హోచిమిన్‌. ఆయన జీవితం వెనుకబాటుతనంతో కునారిల్లే మనలాంటి సాంఘిక వ్యవస్థలున్న దేశాలలో సాంఘిక విప్లవాలను నిర్మిస్తున్న ప్రతి కార్యకర్తకి గొప్ప పాఠ్యాంశం అవుతుంది.
వీర వియత్నాం విప్లవం
వియత్నాం విప్లవం ప్రధానంగా రెండు దశలుగా జరిగింది. మొదటిది, 1930 నుండి 1945 వరకు. 1945 ఆగస్టులో విప్లవం జయప్రదమై ఉత్తర వియత్నాంలో ప్రజాతంత్ర రిపబ్లిక్‌ను వియత్నాం వర్కర్స్‌ పార్టీ స్థాపించింది. 1945 నుండి 1969 వరకు దక్షిణ ఉత్తర వియత్నాంల ఏకీకరణ, వియ త్నాంలో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం ప్రారంభం రెండవ దశ. 1945 ఆగస్టు విప్లవంతో 80 సంవత్సరముల ఫ్రెంచి పాలన అంతరించింది. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ముఖ్యంగా కామ్రేడ్‌ హోచిమిన్‌ నాయకత్వం, అంతర్జాతీయ సంఘీభావాన్ని కూడగట్టడంలో ఆయన కృషి ఫలితంగా 1954 జెనీవా ఒప్పందం జరిగింది. దాని ప్రకారం వియత్నాం పునరేకీకరణకు 1956లో సాధారణ ఎన్నికలు జరపాలని నిర్ణయించడం జరిగింది. వీరోచిత వియత్నాం ప్రజల విప్లవ పోరాటంతో దద్దరిల్లిన ఫ్రెంచి సామ్రాజ్యవాదం వెనక్కి తగ్గింది. కానీ సామ్రాజ్యవాద శిబిర నాయకుడు అమెరికా దక్షిణ వియత్నాంని ఆక్రమించి ఏకీకరణకు విరుద్ధంగా, దక్షిణ వియత్నాంని సామ్రాజ్యవాద శిబిరంలో నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నించింది. కానీ కామ్రేడ్‌ హోచిమిన్‌ అసాధారణ ప్రతిభ, మార్క్సిస్టు లెనినిస్టు అవగాహన ఫలితంగా వియత్నాంలో సోషలిస్టు వ్యవస్థ అభివృద్ధి చెందింది. దక్షిణ వియత్నాంలో సామ్రాజ్యవాద వ్యతిరేక గెరిల్లా, సాయుధ ప్రజల తిరుగుబాట్లు ఫలితంగా ఎట్టకేలకు అమెరికన్‌ సామ్రాజ్యవాదం 20సంవత్సరాల పాటు వియత్నాం ప్రజలపై అత్యంత పాశవిక దాడి జరిపినా దాని పెత్తనం సాధ్యం కాక 1968 నవంబర్‌ నెలలో చేతులు ఎత్తి పారిపోయింది. వియత్నాం ప్రజలు, సాయుధ బలగాలు ”మన నేలపై ఒక్క దురాక్రమణదారుడు అయినా ఉన్నంతవరకు, వాడిని సైతం తుడిచి పెట్టేదాకా మనం పోరాడాల్సిందే” అన్న హోచిమిన్‌ ఆదేశాలను మనస్ఫూర్తిగా పాటించి అఖండ విజయం సాధించాయి. ”యుద్ధాన్ని నిలబెట్టడానికి యుద్ధం” అన్న అమెరికన్‌ వ్యూహాన్ని కామ్రేడ్‌ హోచిమిన్‌ నాయకత్వాన వియత్నాం ప్రజలు చావుదెబ్బ కొట్టి అమెరికన్‌ సామ్రాజ్య వాదాన్ని ప్రపంచం ముందు శాశ్వతంగా దోషిగా నిలబెట్టారు.
వియత్నాం ప్రజల జీవన సంకేతం ఆయన
హోచిమిన్‌ 1890 మే 19న వియత్నాంలోని ఒక దేశభక్త, మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేర్లు గుయన్‌ సిన్హ్‌ కంగ్‌ / గుయన్‌ ఐక్వాన్‌. తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి వ్యవసాయం చూసేది. తండ్రి ఫ్రెంచ్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వియత్నాం విముక్తి కోసం పరితపించేవాడు.ఈ క్రమంలో నైతిక విలువల గురించి ప్రత్యేకంగా తన పిల్లలకు గట్టిగా బోధించే వాడు. బహుశా అందుకే హోచిమిన్‌ నైతికత మీద, దాన్ని మరింత అభివృద్ధి చేసి విప్లవ నైతికత అనే గొప్ప నూతన నినాదాన్ని రూపొందించాడు. 1918 మొదటి ప్రపంచ యుద్ధానంతరం గెలిచిన దేశాల కూటమి (ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, అమెరికా) వర్సైల్స్‌లో ప్రపంచం కళ్ళు గప్పడానికి, మానవాళికి వారు చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకోవడానికి శాంతి సభ నిర్వహించారు. దానికి హోచిమిన్‌ ఎనిమిది అంశాల లేఖ రాశాడు. ఫ్రాన్స్‌ తను పాలించే దేశాల ప్రజలకు తమ దేశ ప్రజలతో సమానత్వం ఇవ్వాలని కోరాడు. ఇది వియత్నాంలో సంచలనం సృష్టించింది. ఆ లేఖను ”సిగల్‌ షాట్‌” (రాబోయే పోరాటానికి మొదటి దెబ్బ)గా అనేక పత్రికలు పేర్కొనడం జరిగింది.
తన 21వ యేట ఆయన విదేశీ పర్యటనలు ప్రారంభించాడు. 1911లో ఒక ఫ్రెంచి నౌకలో ‘బా’ అనే పేరిట వంటవాడిగా చేరి ఫ్రాన్స్‌ చేరుకున్నాడు. మూడు సంవత్సరములు సీమన్‌గా పని చేశాడు. 1915-17 లండన్‌లో గడిపాడు. 2017-23 (6 సంవత్సరాలు) తిరిగి ఫ్రాన్స్‌లో ఉన్నాడు. తోటమాలిగా, స్వీపర్‌గా, వెయిటర్‌గా ఇలా ఎన్నో వృత్తులు చేస్తూనే ఫ్రెంచి సోషలిస్టు పార్టీలో చురు కుగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఐదు ఖండాలు తిరిగాడు. వెళ్లిన ప్రతిచోట వియత్నాం దేశభక్తులను కూడదీస్తూనే ఆయా దేశాలలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ప్రత్యేకించి ఫ్రెంచ్‌ సామ్రా జ్యవాదం వియత్నాం తదితర దక్షిణాసియా దేశాల్లో సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా ప్రచారం సాగించాడు. 1930లో ఇండో చైనా కమ్యూనిస్టు పార్టీని ప్రారంభించాడు. 1945 నుండి 1969 వరకు వియత్నాం దేశాధ్యక్షుడిగా ఉన్నాడు.
విప్లవ నైతికత
ఆయన నడిపిన వీరోచిత పోరాటాలకి, ఈ మహత్తర విజయాలకు, ప్రధాన కారణం ఆయన విప్లవాత్మక కార్యాచరణకి, తన నిరాడంబర జీవితానికి, నిజాయితీకి ఉన్న ఐక్యతే. ఆరు దశాబ్దాలకు పైగా విదేశాలలో, స్వదేశంలో నడిచిన ఆయన జీవితం మొత్తంగా చూసినప్పుడు విప్లవకారుల లక్షణాలను ఆయన చెక్కుచెదరకుండా కాపాడుకోగలిగాడు. జైళ్లలో భయంకరమైన జీవితాన్ని గడుపుతున్న కాలంలో కాళ్లు చేతులు కట్టివేసిన దుర్భర దినాలలో సైతం ఆ విప్లవ మూర్తి అచంచలమైన మనో నిగ్రహంతోనే ప్రవర్తించాడు. ఆయనది నిరాడంబరమైన, నిష్కల్మషమైన జీవితం. అహోరాత్రులు పనిచేసేవాడు. తనకు తానుగా చేసుకోగలిగిన ఏ పనికీ ఆయన ఇతరుల సహాయం కోరేవాడు కాదు. తన వద్దనున్న సహాయకులను ట్రోంగ్‌, కీ, కాంగ్‌, దాంత్‌, లోయి వంటి పేర్లు పెట్టి పిలిచేవాడు. వీటన్నింటినీ కలిపి చదివితే ‘శత్రువుకి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించే వియత్నాం ప్రజల వజ్ర సంకల్పం’ అనే అర్థం వస్తుంది. హౌచిమిన్‌ తన తోటి సహచరుల పట్ల, దేశ ప్రజల పట్ల విపరీతమైన ఆదరాభి మానాలు చూపేవాడు. ప్రతి వ్యక్తికి పోరాటంలో పని అప్పగించడం, అతని పని విధానాన్ని, అతని జీవితాన్ని అభిమానంగా పరిశీలించేవాడు. మరో గొప్ప విషయం ఏమంటే, కార్యకర్తలకు గైడెన్స్‌ ఇవ్వడంలో, వారి పొరపాట్లను సరిదిద్దటంలో ఆయన అనురాగాన్ని ప్రదర్శించేవాడు. ”ప్రజల అండ దండలు లేకుండా అత్యంత సులభమైన పని కూడా జరగదు. ప్రజల సహకారంతో అత్యంత కష్టమైన పనిని సైతం సాధించవచ్చు” అని చెప్పేవాడు. కృషి, పొదుపరితనం, నిజాయితీ, హుందాతనం, ప్రజాప్రయోజనాల కోసం అంకితం కావడం, సంపూర్ణమైన స్వార్థరాహిత్యంలను కలిపి ఆయన ”విప్లవ నైతికత” అని చెప్పేవారు. విప్లవ సాధనలో కమ్యూనిస్టు నాయకులకు ప్రత్యేకించి విప్లవ నైతికత ఉండాలని, లేకుంటే విప్లవ సాధనలో అశేష జనబాహుళ్యాన్ని సమీకరించడం, పోరాటంలో నిలబెట్టడం, వారిని త్యాగాలకు సిద్ధం చేయడం, విజయ సాధనకు సంసిద్ధం చేయడం సాధ్యం కాదని ఆయన పదేపదే బోధిస్తూ ఉండేవాడు.
సోషలిస్టు నిర్మాణం
వియత్నాంలో సోషలిస్టు వ్యవస్థని నిర్మించడం కష్ట సాధ్యమైన విషయం. దశాబ్దాల సామ్రాజ్యవాద పాలనలో సర్వనాశనమైన ఆర్థిక వ్యవస్థ. వెనుకబాటుతనంతో ఉన్న ప్రజలు. ఓ పక్క సామ్రాజ్యవాదులతో పోరాడుతూనే ఉత్తర వియత్నాంలో సోషలిస్టు విప్లవ నిర్మాణం కోసం ప్రజలను స్వచ్ఛందంగా రంగంలోకి దించాడు. సోషలిజం మాత్రమే వందల సంవత్సరాల నికృష్టమైన జీవితాలను బాగుపరచగలదని, స్వేచ్ఛ స్వాతంత్య్రాలను ప్రసాదించ గలదని, వేగంగా అభివృద్ధి చెందగలుగుతామని ప్రజా బాహుళ్యాన్ని ఆయన ఒప్పించగలిగాడు. అందుకు ముందుగా ఓ బలమైన ప్రజా విప్లవ పార్టీని నిర్మించాడు. వియత్నాంలో ఉన్న అనేక సాంఘిక అంతరాలను అధిగమించే కృషి చేశాడు. ప్రత్యేకించి మహిళలను ఉద్యమాలలోకి, విప్లవంలోకి తీసుకు రాగలిగాడు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన మొత్తం దేశానికి దిశా నిర్దేశం చేసే క్రమంలో మహిళలు విముక్తి కాకపోతే మనం సగం సోషలిజాన్నే నిర్మించినట్లు అవుతుందని ప్రకటించాడు. అలాగే మహిళలకు ఆయన ”ప్రభుత్వం పార్టీ ఆదేశాలు ఇచ్చేవరకు ఆగకండి, మీ పోరాటం కొనసాగించండి. హక్కుల కోసం నిలబడండి” అని బోధించేవాడు. మహిళలకి సమానత్వం రావాలంటే మనదేశంలో నాలుగు అంశాల పైన చట్టం తేవాలని ఆయన పేర్కొన్న ఫలితంగా 1959లో ప్రభుత్వం చట్టం చేసింది. 1.పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు (అరేంజ్డ్‌ మ్యారేజెస్‌) అనే పద్ధతి రద్దు చేయడం. 2. బహుభార్యత్వాన్ని రద్దు. 3. సమాజంలోనే కాకుండా ఇంట్లో కూడా స్త్రీ పురుషుల సమానత్వాన్ని గుర్తించడం 4. మహిళల, పిల్లల హక్కులను గుర్తించడం. ఈ చట్టం వియత్నాం సాంఘిక పరిస్థితులను విప్లవాత్మకంగా మార్చింది.
అవినీతి, వృథా, అధికార నియంతృత్వం అనేవి ప్రభుత్వం, సైన్యం, ప్రజల యొక్క శత్రువులు. అని ఆయన పేర్కొన్నారు. అందువలన ప్రభుత్వం నుండి సాధారణ ప్రజా సంఘాలు, ప్రజల వరకు మొత్తం దేశంగానే విప్లవాన్ని నిలబెట్టుకోవాలంటే పై మూడు రుగ్మతలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉండాలి అని ఆయన చేసిన బోధనలను వియత్నాం ప్రజలు నేటికీ పాటిస్తున్నారు. కరోనా మహమ్మారితో పెట్టుబడిదారీ ప్రపంచం అల్లాడి పోయినా సోషలిస్టు వియత్నాం ఆ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది.
ఎల్ల కాలాలకూ ఆయన జీవితం ఆదర్శమే
హోచిమిన్‌ లేకున్నా ఈ సంక్షోభ కాలంలో కూడా ముందుకు పోతున్న వియత్నాం మన కళ్ళ ముందు ఉంది. వియత్నాం విప్లవ చరిత్ర మన ముందుంది. అత్యంత బలమైన అమెరికన్‌, ఫ్రెంచి సామ్రాజ్యవాద దేశాలని శతాబ్దంపైగా పోరాడి, మట్టి కరిపించిన ఆ దేశ చరిత్ర మన ముందుంది. వీటన్నింటికీ పూసల్లో దారంలా మహోన్నత విప్లవ నేత హోచిమిన్‌ విప్లవ జీవితం మన ముందుంది. విప్లవ కార్యాచరణకి, విప్లవ నైతికతకి మధ్యనుండే విడదీయరాని బంధాన్ని కామ్రేడ్‌ హోచిమిన్‌ జీవితం మనకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నది. అవినీతి, స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాలు, అసంబద్ధమైన పోటీ, వ్యక్తిగత హోదాలకై పాకులాడటం వంటి దోపిడీ వర్గ లక్షణాల ప్రభావం కార్మికోద్యమం మీద, విప్లవోద్యమాలమీద విస్తారంగా ప్రభావితం చూపుతున్న నేటి తరుణంలో వీటికి వ్యతిరేకంగా మనోధైర్యాన్ని కార్యకర్తలకు కల్పించడానికి వియత్నాం ప్రజల వీరోచిత విప్లవ పోరాట చరిత్రని, దాన్ని నడిపిన కామ్రేడ్‌ హోచిమిన్‌ జీవితాన్ని తెలియజెప్పటం, తెలుసుకోవడం నేడు అత్యవసరం.
(రేపు హోచిమిన్‌ 133వ జయంతి)
– ఆర్‌. రఘు
  సెల్‌:9490098422

Spread the love