తెలంగాణ బీజేపీకి కర్నాటక కంగారు…

మాజీ టీఆర్‌ఎస్‌/కాంగ్రెస్‌ నాయకుడు కొండా
విశ్వేశ్వరరెడ్డిపై కూడా ఇలాంటి ఊహాగానాలే
సాగాయి. ఈటెలపై కేసీఆర్‌ వేటు వేశాక మొదట
చేరదీసింది విశ్వేశ్వరరెడ్డి కావడం తెలిసిందే. కర్నాటక
ఓటమి తర్వాత కొండా మీడియాతో మాట్లాడుతూ
బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటేనని ప్రజలు అనుకుంటున్నారని,
ఇది పోవాలంటే కవితను అరెస్టు చేయాలని అన్నారు.
నిజానికి ఈ ప్రచారం కాంగ్రెస్‌ వాదనైతే దాన్ని బీజేపీ
తరపున కొండా నెత్తికెత్తుకోవడం విడ్డూరం. అదీగాక
కవితను అరెస్టు చేస్తే ప్రజలు నమ్ముతారని ఒక మాజీ
ఎంపీ వాదించడం చూస్తే దేశంలో చట్టాలను
ఇష్టప్రకారం ఉపయోగించు కోవచ్చని ఆయన
భావనగా స్పష్టమవుతుంది.
కర్నాటక ఎన్నికల దెబ్బ తర్వాత తెలంగాణలో బీజేపీ హడావుడి తగ్గి కంగారు పెరిగింది. దక్షిణాదిలో తమ తదుపరి ఆశాకిరణం తెలంగాణానే అన్నట్టు మాట్లాడిన కమలం పార్టీ నేతలు ఇప్పుడు కొత్తవాదనలు వెతుక్కోవలసిన పరిస్థితిలో పడ్డారు. నిజానికి ఈ పరిస్థితి గతంలోనే మొదలైంది గనకే స్వయంగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షాలు దిగిపోయి స్థానిక నాయకుల స్థాయిలోకి దిగిపోయి కేసీఆర్‌ ప్రభుత్వంపై చిందులు తొక్కారు. అధికార కార్యక్రమాలలోనే రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ దాడికి దిగిన మోడీవాటిని ఎన్నికల ప్రచారసభల్లా మార్చేశారు. దేశంలో ప్రాథమిక సదుపాయాల మెరుగుదల కోసం రవాణా విస్తరణ కోసం కేంద్రం పరితపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని తిట్టిపోశారు. తాను అవినీతిపై పోరాడుతుంటే పరివార్‌ వాదులు అంటే కుటుంబ పాలన చేసేవారు అడ్డుతగులుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇతర పార్టీల ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలసిరావడం లేదని అందరిపై అభాండం వేశారు. డబుల్‌ ఇంజన్‌ పాటతో ఇప్పుడు ట్రబుల్‌ ఇంజన్‌ తెచ్చుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎప్పుడూ అదే పనిలో వుంటారు, టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజరు మతోన్మాద భాషణలైతే తెలంగాణ లౌకిక సంప్రదాయాలకే కళంకం తెచ్చేలా రోజువారి వినిపిస్తుంటాయి. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీ మతతత్వ రాజకీయాలు, కేంద్రం నిరంకుశ పోకడలపై నిరంతర విమర్శలు గుప్పించడం, మహారాష్ట్ర వంటిచోట్ల ప్రజాస్వామికంగా విస్తరించేందుకు ప్రయత్నాలు తీవ్రం చేయడం బీజేపీకి మింగుడు పడని విషయమైంది. కర్నాటక, తెలంగాణ, దక్షిణభారతంలో తమ తదుపరి ప్రభుత్వాలను చూస్తాయని అమిత్‌ షా అక్కడ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ చెప్పారు. అయితే అది అతిశయోక్తి అని అప్పటికే స్పష్టమైంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్య అవగాహన, ఉద్యమాలు ఉమ్మడి పోరాటంపెరుగుతున్న కొద్ది వచ్చే ఎన్నికలలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి సవాలుగానే తయారవుతున్నది. నిరంకుశ కార్పొరేట్‌ మతతత్వం అదానీ కుంభకోణాలు, రాహుల్‌పై అనర్హత వేటు వంటివాటిపై అనేక రూపాల్లో వ్యక్తమవుతున్న నిరసనలు ప్రజాగ్రహాలు బీజేపీని భయపెడుతున్నాయి. ఇప్పుడు రెండువేల రూపాయల రద్దు ప్రహసనం నోట్లరద్దు రోజులను గుర్తు చేసింది. బలమైన లౌకిక ప్రాంతీయ పార్టీలూవున్న చోట గతంలో వలె గెలవలేకపోవచ్చన్న వాస్తవం స్పష్టమైనకొద్ది ఉన్న మిత్రపక్షాలు కూడా దూరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటక చేజారిపోయి కేరళ, తమిళనాడులలో అసలే ఠికానా లేనప్పుడు తెలంగాణ ఒక గడ్డుప్రశ్నలా మారుతున్నది.
బీజేపీ వింత వాదనలు
నిజానికి తెలంగాణలోతామే అధికారానికి రాబోతున్నామని ఆర్భాటం చేసిన బీజేపీకి క్షేత్రస్థాయిలో పరిస్థితి అనుకూలంగా లేదని తేలిపోయింది. లిక్కర్‌ కేసు పేరిట బీఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవితను అనేకసార్లు విచారించడమే గాక అరెస్టు అనివార్యం అని హల్‌చల్‌ చేసినా ఇంతవరకూ అది సాధ్యం కాలేదు. దేశవ్యాపితంగానే ప్రతిపక్షాలు ఈడీ, సిబిఐల దుర్వినియోగాన్ని రాజకీయంగా న్యాయపరంగా కూడా సవాలు చేయడం వాతావరణం మార్చింది. బీజేపీ ఆశించినట్టు ప్రముఖులెవరూ ఆ పార్టీలో చేరింది లేదు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాత్రం చేరారు గాని ఆయన వల్ల ఒరిగేది లేదని బీజేపీ నేతలే చప్పరిస్తున్నారు. పరిస్థితి ఎక్కడకు వచ్చిందంటే చేరికల కమిటీ చైర్మన్‌గా నియమితుడైన ఈటెల రాజేందర్‌ ఎవరినీ ఆకర్షించలేకపోగా కొంతమంది రివర్స్‌ దారి పట్టారు. చేరికల కమిటీ చారికగా మిగిలిపోయింది. దీనికి పరాకాష్ట స్వయంగా రాజేందర్‌ కాంగ్రెస్‌లో చేరతాడని కథనాలు రావడం. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరి మునుగోడులో ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కూడా మాతృసంస్థలోకి వెళ్తరని వార్తలు వచ్చాయి. దీనికి తగినట్టే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాత కాంగ్రెస్‌ నాయకులందరూ తిరిగిరావాలని పిలుపునిచ్చారు.
గొంతు మార్చిన కొండా
మాజీ టీఆర్‌ఎస్‌/కాంగ్రెస్‌ నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డిపై కూడా ఇలాంటి ఊహాగానాలే సాగాయి. ఈటెలపై కేసీఆర్‌ వేటు వేశాక మొదట చేరదీసింది విశ్వేశ్వరరెడ్డి కావడం తెలిసిందే. కర్నాటక ఓటమి తర్వాత కొండా మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటేనని ప్రజలు అనుకుంటున్నారని, ఇది పోవాలంటే కవితను అరెస్టు చేయాలని అన్నారు. నిజానికి ఈ ప్రచారం కాంగ్రెస్‌ వాదనైతే దాన్ని బీజేపీ తరపున కొండా నెత్తికెత్తుకోవడం విడ్డూరం. అదీగాక కవితను అరెస్టు చేస్తే ప్రజలు నమ్ముతారని ఒక మాజీ ఎంపీ వాదించడం చూస్తే దేశంలో చట్టాలను ఇష్టప్రకారం ఉపయోగించు కోవచ్చని ఆయన భావనగా స్పష్టమవుతుంది. ఈడీ, సిబిఐ, ఐటిలను ప్రత్యర్థులపై దాడికి దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు సుప్రీం కోర్టులో కేసు వేశాయి. నిర్దిష్టమైన సందర్భంతో వస్తే పరిశీలించగలమని సామూహికంగా విచారించలేమని కోర్టు కొట్టివేసింది. అదేదో తమ విజయంగా బీజేపీ చెప్పుకుంది గాని వాస్తవం వేరు. అదలా ఉంచితే ఇదే లిక్కర్‌ కేసులో కొందరికి బెయిలు మంజూరుచేస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగ్‌ ఈ కేసుకు ఆధారమే లేదని ఆరోపించడం ప్రతిపక్షాల ఆరోపణ వాస్తవమని నిరూపించినట్టయింది. వందకోట్ల ఆరోపణ చేసేవారు దాన్ని చేతులు మార్చిన హవాలా ఆపరేటర్‌ను ఎందుకు పట్టుకోలేకపోయారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇంత జరిగాక కూడా కొండా వంటివారు ఏకపక్షంగా బీజేపీపై విశ్వాసం కలిగించం కోసం ఎవరినో అరెస్టు చేయాలని బాహాటంగా కోరడం దేనికి నిదర్శనం? ప్రత్యర్థి పార్టీలను భయపెట్టి ప్రజలను లోబర్చుకోవాలనడం కాదా? సహజంగానే దీనిపై దుమారం రేగాక ఆయన కాస్త సర్దుకుని గొంతు మార్చారు. వేగంగా దర్యాప్తు జరపాలని కోరామే తప్ప అరెస్టుచేయడం బీజేపీ చేతుల్లో ఉండదని సర్దుకుంటున్నారు. అంతటితో ఆగక బీజేపీ దేశంలో అత్యంత లౌకికపార్టీ అని భజన కీర్తనలాలపిస్తున్నారు. తన మనుగడ కోసం బీజేపీలో చేరారు గనక పొగడొచ్చు గాని హిందూత్వ తమ మూల సిద్ధాంతమని చెప్పే పార్టీకి అంత లౌకికతత్వం అంటగడితే ఎలాచెల్లుతుంది? దక్షిణ భారతంలో ఈ తరహా మతతత్వం చెల్లదు గనకే కర్నాటకలో ఘోర పరాజయం పాలైనామనే గుణపాఠం నేర్చుకోలేకపోవడం విచిత్రం.
బీఆర్‌ఎస్‌ విశ్వాసం, కాంగ్రెస్‌ వ్యూహం
కర్నాటక విజయం చూసి బీఆర్‌ఎస్‌ భయపడిపోతుందని కాంగ్రెస్‌ అతిగా ఆనందించడం కూడా అవాస్తవికమే. ఆ ఫలితం ప్రధానంగా బీజేపీకి తిరుగులేని తిరస్కృతి. అక్కడ గతంలో చాలాకాలం పాలకపక్షంగా కాంగ్రెస్‌ ఉంది గనక సహజంగానే వారు గెలిచారు. అవకాశవాదంతో అటూ ఇటూ మాట్లాడిన జేడీఎస్‌ బలం కోల్పోయింది. బీజేపీని ఓడించాలని ప్రజలు కోరుకుంటే ఎక్కడ ఎవరు బలంగా ఉంటే వారిని గెలిపిస్తారన్నది ఇక్కడ కీలకాంశం. వారికి ఆ విధమైన యంత్రాంగం పట్టు కూడా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. ఆ విధంగా చూస్తే తెలంగాణలో పాలకపార్టీగా ఉండి బీజేపీ మతరాజకీయాలను నిశితంగా విమర్శిస్తున్న బీఆర్‌ఎస్‌కు ఈ ఫలితం ఎక్కువ సంతోషం కలిగించాలి. మునుగోడులో బీజేపీ ఓటమిలో కీలకపాత్ర వహించి మతతత్వంపై దేశవ్యాపితంగా మోడీ సర్కారును ఓడించడం కీలకమని భావిస్తున్న వామపక్షాలు కూడా ఆ దిశలో పట్టుదలగా ఉన్నాయి. ఉభయ కమ్యూనిస్టుపార్టీల సమావేశాలు, యాత్రలు ఉత్సాహం కలిగిస్తున్నాయి. తెలంగాణలో లౌకిక శక్తుల పట్టు సమీకరణే బీజేపీని భయపెడుతున్నది. వచ్చే ఎన్నికలలో తమకు వందకు పైగా సీట్లు వస్తాయని కేసీఆర్‌ విశ్వాసం వెలిబుచ్చారు. అంతకు ముందు ఎంఎల్‌ఎలకు హెచ్చరికలు చేసిన ముఖ్యమంత్రి వీలైనంత మంది పాతవారికే టికెట్టు ఇస్తామంటూ భరోసా కల్పించేందుకు ప్రయత్నించారు. ఇదంతా పెరిగిన ధీమాకు నిదర్శనమవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తప్పొప్పులపై తప్పక పోరాడవచ్చుగాని దాన్ని బీజేపీతో జతకట్టి చిత్రిస్తున్న కాంగ్రెస్‌ వాదన విడ్డూరంగా ఉందని చెప్పక తప్పదు. ఈ వాదన విశ్వేశ్వరరెడ్డి వంటివారు అందిపుచ్చుకోవడం కన్నా ఇందుకు మరో ఉదాహరణ అవసరం లేదు. దక్షిణ భారతంలో మరో చోట బీజేపీకి అవకాశం ఇవ్వరాదనేది కాంగ్రెస్‌ ప్రధాన లక్ష్యమైతే ఇలా మాట్లాదే అవకాశం ఉండదు. తమ విజయం కోసం ఏ రాజకీయ పార్టీ అయినా పోరాడవచ్చు గాని దేశవ్యాపిత దృక్పథం కోల్పోయి బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఒకేగాట కట్టడం సరైన విధానం అనిపించుకోదు. ముందే చెప్పినట్టు బీజేపీకి దక్షిణాదిన మరో అవకాశం ఇవ్వరాదనేది తెలంగాణలో లౌకికశక్తులన్నిటి లక్ష్యమైతే ఆ మతతత్వం, కేంద్ర నిరంకుశత్వాలపై కాంగ్రెస్‌ కేంద్రీకరించాలి. రాష్ట్రాలలో లౌకిక ప్రాంతీయ పార్టీలను దెబ్బతినడం వల్ల దేశవ్యాపితంగా తనకు కలిగించే నష్టాన్ని గుర్తించాలి. బీహార్‌ వంటిచోట్ల వారు అనుసరిస్తున్న విధానంలో ఈ వాస్తవికత కనిపిస్తుంది. కేసీఆర్‌ కూడా బహుశా ఈ వాస్తవాన్ని గుర్తించారు గనకే కర్నాటకలో పోటీ చేసి ఏ మాత్రం ఓట్లు చీల్చేందుకు సిద్ధపడలేదనుకోవాలి. దేశ వ్యాపిత వాతావరణం కూడా ఇదే కోవలో పెంపొందడం ఆహ్వానించవలసిందే. కర్నాటక ఎన్నికల తర్వాత వివిధ రూపాల్లో ఈ ప్రయత్నాలు పెరగొచ్చు. వైసీపీ, టీడీపీ, బీజేడీ, జనసేన వంటిపార్టీలు కూడా లౌకిక పార్టీలే అయినా ఇప్పటికీ బీజేపీతో ఉంటామనడం ఈ లక్ష్యానికి విరుద్ధమైన పరిణామం. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా దేశ ప్రజలు ప్రత్యేకించి తెలుగు ప్రజలు మాత్రం బీజేపీని నెత్తి నెత్తుకోవడానికి సిద్ధపడబోరని ఖాయంగా చెప్పొచ్చు.
– తెలకపల్లి రవి

Spread the love