జిమ్నాస్ట్‌ దీపపై సాయ్ అభ్యంతరం!

నేషనల్‌ క్యాంప్‌ ప్రాబబుల్స్‌
నుంచి తొలగింపు
న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్‌లో పతకం తృటిలో చేజార్చుకున్నప్పటికీ, అద్భుత విన్యాసాలతో అందరినీ ఆకట్టుకున్న జిమ్నాస్ట్‌ దీప కర్మాకర్‌. డోప్‌ పరీక్షలో విఫలమైన దీప కర్మాకర్‌ ప్రస్తుతం 21 నెలల సస్పెన్షన్‌లో ఉంది. రానున్న ఆసియా చాంపియన్‌షిప్స్‌, ఆసియా క్రీడలు సహా ఇతర అంతర్జాతీయ టోర్నీలకు జాతీయ శిక్షణ శిబిరం ఏర్పాటుకు జాతీయ జిమ్నాస్టిక్‌ సమాఖ్య ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసింది. ప్రాబబుల్స్‌ జాబితాను సాయ్ ను పంపించి, నేషనల్‌ క్యాంప్‌కు నిధులు మంజూరు చేయాలని కోరింది. అయితే ప్రాబబుల్స్‌లో దీప కర్మాకర్‌కు చోటు కల్పించటంపై సాయ్ ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతర్జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఐటీఏ) నుంచి నిషేధం ఎదుర్కొంటున్న దీప కర్మాకర్‌ నేషనల్‌ క్యాంప్‌కు దొడ్డిదారిన ఎంపికైనట్టు సాయ్ భావించింది. దీంతో జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య ప్రాబబుల్స్‌ నుంచి దీప కర్మాకర్‌ పేరును తొలగించింది. ఇదిలా ఉండగా, ఐటీఏ నిబంధనల ప్రకారం దీప కర్మాకర్‌ జాతీయ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యేందుకు అర్హురాలు. దీప కర్మాకర్‌ నిషేధం ఈ ఏడాది జులైలో ముగియనుంది. అందుకు రెండు నెలల ముందుగానే జాతీయ జట్టుతో కలిసి శిక్షణలో పాల్గొనేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. రూల్‌ 10.14.2 రిటర్న్‌ టు ట్రైనింగ్‌ కింద ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. రూల్స్‌ ప్రకారం దీపను ఎంపిక చేసినా.. ఆమెపై సారు అభ్యంతరం వ్యక్తం చేయటం పట్ల జిమ్నాస్టిక్స్‌ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

Spread the love