కోరుకున్నది ఇది కాదు కదా…

          సెక్రటేరియట్‌కు సందర్శకుల రాకపై సర్కారు త్వరలో తీసుకోబోతున్న మరో నిర్ణయం పైన చెప్పిన వారందరికీ ఆశనిపాతంలాంటిది. అదే డిజిటల్‌ పాసుల జారీ. క్యూఆర్‌ కోడ్‌తో ఉండే… ఆ పాసుల వల్ల ఎవరెవరు సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారు..? ఎవరెవర్ని ఎన్నిసార్లు కలిశారు..? అక్కడ ఎంతసేపు గడిపారనే సమాచారాన్ని నిక్షిప్తం చేయనున్నారని అధికారిక వర్గాల భోగట్టా. పైకి భద్రతా కారణాలను బూచిగా చూపుతున్నప్పటికీ… సమాచార సేకరణకు వీల్లేకుండా.. విషయాలు బయటకు పొక్కకుండా చేయటమే ఆయా పాసుల ముఖ్యోద్దేశం.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహం.. నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు… వీటిని ఘనతలుగా చెప్పుకుంటోంది బీఆర్‌ఎస్‌ సర్కార్‌. వాటిని మనం అంగీకరించాల్సిందే. హుస్సేన్‌ సాగర్‌లోని బుద్ధుడు సమాజానికి జ్ఞాన మార్గాన్ని ప్రసాదిస్తుంటే.. ఆయనకు సమీపంలోనే ఆకాశమంత అంబేద్కరుడు.. ప్రజాస్వామ్య సౌధానికి ఊపిరిలూదే రాజ్యాంగ విలువల గురించి ప్రబోధిస్తున్నారంటూ రాష్ట్రాధినేత ఆ మధ్య వ్యాఖ్యానించారు. ఆయన మాటలను కాదనలేంగానీ వచ్చిన చిక్కల్లా నిత్యం అంబేద్కర్‌ నామ స్మరణ చేస్తున్న పాలనాధీశులు, ఆయన ఉద్బోధించిన భావ ప్రకటనా స్వేచ్ఛ, పారదర్శక పాలనకు పాతరేయటం.
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వమంటారు. అలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయన్నది నిజమే అయినా… తన ఇష్టారీతిన, తనకు నచ్చిన పద్ధతుల్లో పాలన సాగిస్తామనటం సహేతుకం కాదు. పైగా ప్రజాధనంతో నిర్మించిన పరిపాలనా సౌధంలోకి ఇటు ప్రజలు,ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్ష నేతలను, అటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్న మీడియాను రానివ్వకపోవటం అత్యంత శోచనీయం. సెక్రటేరియట్‌కు సందర్శకుల రాకపై సర్కారు త్వరలో తీసుకోబోతున్న మరో నిర్ణయం పైన చెప్పిన వారందరికీ ఆశనిపాతంలాంటిది. అదే డిజిటల్‌ పాసుల జారీ. క్యూఆర్‌ కోడ్‌తో ఉండే… ఆ పాసుల వల్ల ఎవరెవరు సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారు..? ఎవరెవర్ని ఎన్నిసార్లు కలిశారు..? అక్కడ ఎంతసేపు గడిపారనే సమాచారాన్ని నిక్షిప్తం చేయనున్నారని అధికారిక వర్గాల భోగట్టా. పైకి భద్రతా కారణాలను బూచిగా చూపుతున్నప్పటికీ… సమాచార సేకరణకు వీల్లేకుండా.. విషయా లు బయటకు పొక్క కుండా చేయటమే ఆయా పాసుల ముఖ్యోద్దేశం. అలాంటప్పుడు ఇక భావ ప్రకటనా స్వేచ్ఛ ఎలా పరిఢవిల్లుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.
రాష్ట్ర సచివాలయ పరిస్థితి ఇలా ఉంటే.. గ్రామ సచివాలయా ల్లోని దుస్థితి మరో రకంగా ఉంది. వాటిల్లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శు(జేపీఎస్‌)లు… తమ డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఇటీవల సమ్మెబాట పట్టిన సంగతి విదితమే. వారి సమస్య లను పరిష్కరించటం ద్వారా సమ్మెను నివారించా లంటూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కోరినా సర్కారు పట్టించుకోలేదు. పైగా సమ్మె విరమించక పోతే విధుల్లోంచి తొలగిస్తామంటూ ప్రభుత్వం హుకూం జారీ చేయటం గమనార్హం. ఈ క్రమంలో ఒక మహిళా జేపీఎస్‌ ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వాధినేత మనసు చలించకపోవటం ప్రజాందోళనలు, ఉద్యమాల పట్ల బీఆర్‌ఎస్‌ సర్కారు అనుసరిస్తున్న తీరుకు నిదర్శనం.
ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలు ప్రజాందోళనల పట్ల కర్కశంగా, నిరంకుశంగా వ్యవహరించిన దాఖలాలు కోకొల్లలు. కానీ అవి ఏ రోజు కూడా ప్రతిపక్ష నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా చిన్న చూపు చూడలేదు. అప్పట్లో ముఖ్యమంత్రులు సైతం ప్రజా దర్బార్లు నడిపేవారు. వాటి ద్వారా సమస్యలు పరిష్కారమైనా కాకపోయినా ప్రభుత్వాధినేతకు తమ గోడు వినిపించామన్న తృప్తి జనాలకు దక్కేది. కానీ నేడు ఆ పరిస్థితి లేకపోవటం నిజంగా ఇబ్బందికరమే. తెలంగాణ అనేది ఆత్మగౌరవం మెండుగా ఉండే సమాజం. నాటి సాయుధ పోరాట కాలం నుంచి నేటి దాకా ఆ ఆత్మగౌరవ పతాక రెపరెపలాడుతూనే ఉంది.అనేక సందర్భాల్లో అది ప్రస్ఫుటమైంది. ఈ క్రమంలో ఘనత వహించిన ‘తెలంగాణాధీశులు…’ ఈ వాస్తవాన్ని గ్రహించాలి. ఉద్యమాల పట్ల ఉక్కుపాదం మోపటం, వాటిని చిన్న చూపు చూడటం, సమ్మెలు, ఆందోళనలు నిర్వహించే వారికి అల్టిమేటాలు జారీ చేయటం, సచివాలయంలోకి రానివ్వకపోవటాన్ని నియంతృత్వ చర్యలుగానే మనం భావించాల్సి ఉంటుంది. తెలంగాణ సమాజం వీటిని ఎప్పుడూ కోరుకోలేదు..మున్ముందు కోరుకోదు కూడా. అందువల్ల రాజ్యాంగం కల్పించిన అవకాశంతో, ప్రజాస్వామిక పద్ధతుల్లో తెలంగాణాను సాధించామని చెప్పుకుంటున్న ‘అధినేతలు…’ నిజమైన ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి పూనుకోవాలి. అందులో భావ ప్రకటనా స్వేచ్ఛ పరిఢవిల్లాలి. అప్పుడే రాజ్యాంగ నిర్మాత లక్ష్యాలు నెరవేరుతాయి.

Spread the love