పెరియార్‌ సచ్ఛీరామాయణ్‌ : ఒక కనువిప్పు

బంగారులేడి ఉండదని తెలిసి కూడా రాముడు దానికోసం ఎందుకు
పరుగెత్తాడూ? అని ప్రశ్నించాడు కదా మన వేమన. వాల్మికి
రామాయణంలోని అయోధ్యకాండ 45వ అధ్యాయంలో సీత, లక్ష్మణున్ని
నిందిస్తుంది. ”ప్రమాదంలో ఉండి సహాయం కోసం పిలుస్తున్న నీ అన్న
రాముడి పిలుపు వినిపించుకోకుండా నువ్వు ఇక్కడే నా దగ్గరే ఎందుకు
తిరుగుతున్నావూ? నన్ను అనుభవించాలన్న కోరికతోనేనా?” అని
నిందారోపణ చేస్తుంది! సీత అగ్ని ప్రవేశం చేసి వచ్చినా, రాముడికి
ఆమెపై అనుమానం పోదు. సీత పవిత్రురాలని వాల్మికి చెప్పినా రాముడు
నమ్మడు. పైగా గర్భిణిగా ఉన్న సీతను అడవిలో వదిలిరమ్మని లక్ష్మణున్ని
ఆజ్ఞాపిస్తాడు. చివరికి ఆమె భూమిలో కూరుకుపోయి ప్రాణాలు
వదులుతుంది. ఇలాంటి పనులు దయార్ద్ర హృదయుడు,
కరుణామయుడు చేయవల్సిన పనులేనా?         
సుప్రసిద్ధ నాస్తికవాది, సంఘ సంస్కర్త, ద్రవిడ ఉద్యమానికీ ఆత్మగౌరవ ఉద్యమానికీ రూపకల్పన చేసిన పెరియార్‌ ఇరోడ్‌ వెంకట రామస్వామి నాయకర్‌ (1879-1973) చేసిన పనుల్లో ‘కీమాయణం’ రాయడం కూడా ఒకటి! ఆయన వాల్మికి రామాయణానికి 1944లో ‘కీమాయణం’ అనే పేరుతో అరవైనాలుగు పేజీల వ్యాఖ్యానం ప్రకటించారు. అది వాల్మికి రామాయణానికి హేతుబద్ధమైన విశ్లేషణ! ఆయన రాసింది తమిళంలో అయితే హిందీ, ఇంగ్లీషు ఇంకా ఇతర భారతీయ భాషల్లో అనువాదాలు వచ్చాయి. అవన్నీ పెరియార్‌ భావజాలాన్ని ఈ దేశ ప్రజలకు అందించాయి. హీందీలో ‘సచ్చీ రామాయణ్‌’ అని, ఇంగ్లీషులో RAMAYANAM A TRUE READING అని, తెలుగులో ‘యదార్థ రామాయణం’ అనీ వచ్చాయి. రామాయణం అందరికీ తెలిసిందే కదా? ఇంకా, మళ్ళీ పెరియార్‌ ఏం రాశారూ? అని కొందరికి అనుమానం రావచ్చు. రామాయణాలదేం ఉంది? భారతీయ భాషల్లో వివిధ కాలాల్లో రాసిన రామాయణాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఎవరి సృజనాత్మకతను వారు జోడించి, చిలువలు పలువలుగా రాసేసుకున్నారు. వేయి పడగలు రాసిన తెలుగు సంప్రదాయకవి విశ్వనాథ సత్యనారాయణ కూడా ఓ రామాయణమే రాసి, జ్ఞానపీఠానికెక్కారు. అయితే, ఇవన్నీ ఒకే మూసలో పోసిన విధంగా… రాముడనే కల్పిత పాత్ర – అయిన ‘దేవుడి’ మీద భక్తి పారవశ్యంలో రాసినవి. వీరంతా వాల్మికి రామాయణాన్ని మార్చి, అందులో కొత్త సంగతులు చేర్చి రాశారు. రామాయణం రాయని వాడు కవే కాదు – అనే అభిప్రాయం గతంలో ఉండేది కూడా!
పెరియార్‌ నాస్తికుడు గనుక, వాల్మికి రామాయణంలోని కథను పాత్రల్ని, ఒక్కొక్కటిగా విశ్లేషించి పాఠకుల కళ్ళు తెరిపించాడు. ”రామాయణం కల్పిత గాథ” అని స్వయంగా శంకరాచార్యే ప్రకటించాడు. ఎందుకూ? అంటే… ఆయన దేవుడు – శంకరుడు. విష్ణుదేవుడి మహిమలు ఆయన ఒప్పుకోడు. ఆ వైరుధ్యం వల్లనే కదా వీరశైవులు, వీరవైష్ణవులు హౌరాహౌరి పోట్లాడుకునే వారు? ”దక్షిణ భారతదేశంలో ఉన్న ద్రావిడుల్ని లొంగదీసుకోవడానికి వారిని బానిసలుగా చేసుకోవడానికి ఉత్తరాది నుంచి వచ్చిన ఆర్యులు రాసుకున్న కల్పిత గాథ ఇది” అని డిస్కవరీ ఆఫ్‌ ఇండియాలో భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ రాశారు. ఈ అభిప్రాయాలన్నింటినీ పెరియార్‌ తన రచనలో తెలియజేపుతూనే, మరో విషయం కూడా నిర్ధారించారు. మన పంచతంత్రం, అరేబియన్‌ నైట్స్‌ కథల్లాగా రామాయణం కూడా కల్పిత గాథే… అని!! వాల్మికి రామాయణంలో రాముడు దుర్మార్గుడని, మోసగాడని రాస్తే, తర్వాత కాలంలో వచ్చిన వైదిక మత రచయితలు, అనువాదకులు – రాముడు మంచివాడని, సచ్ఛీలుడని మార్చి రాసి, ఆ పాత్రకు దైవత్వం అంటగట్టారని అన్నాడు పెరియార్‌. అసలైతే రామాయణం ధర్మస్థాపనకు సంబంధించిన రచనే కాదని కూడా కొట్టిపారేశాడు.
నిజమనేది ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. అబద్దాలు మాత్రమే అనేకం ఉండే ఆస్కారముంది. రామాయణంలోని అబద్దాలు పరిశీలిస్తే… రామభక్తులే మూర్చపోవాల్సిన పరిస్థితి ఉంది. ఉదాహరణకు వాల్మికి రామాయణంలో రాముడి తండ్రి దశరథుడికి 350మంది భార్యలు. అదే కంభ రామాయణంలో ఆయనకు 60వేల మంది భార్యలు. ఇందులో ఏది నిజం? కైకేయిని వివాహం చేసుకునే సమయంలో దశరథుడు కైకేయి తండ్రికి ఒక వాగ్దానం చేస్తాడు. అదేమంటే… కైకేయికి పుట్టిన వాడికే పట్టాభిషేకం చేస్తానని! మరి కైకేయి పుత్రుడు భరతుడయినప్పుడు అతనికి పట్టాభిషేకం ఎందుకు చేయలేదు? తన దగ్గరే ఉంచుకుని, పరిపాలనకు సంబంధించిన అంశాలు ఎందుకు నేర్పించలేదూ? పైగా కైకేయి తండ్రి పాలించే కేకయ రాజ్యానికి పంపించాడెందుకూ? రాముడి పాదుకలు తీసుకుపోవడానికి భరతుడు అడవికి వెళ్ళి రాముణ్ణి కలిసినప్పుడు – స్వయంగా రాముడే భరతుడికి ఈ విషయం గుర్తు చేసాడు. (అరణ్యకాండ 107వ అధ్యాయం) దశరథుడు చేతకాని వాడు, శక్తిహీనుడు అయినప్పుడు – మనిషి ఆకారంలో ఒక మాంసం ముద్దగా భావించబడ్డప్పుడు… అతనికి నలుగురు కుమారులు ఎలా పుడతారు? పైగా, వారు దృఢకాయులు, సకల గుణ సంపన్నులు ఎలా అవుతారూ?
భరతుడికే పట్టాభిషేకం చేస్తానని – దశరథుడు వాగ్దానం చేసిన విషయం తెలిసి కూడా వశిష్టుడు అక్రమంగా ‘రామపట్టాభిషేకం’ ఎలా జరిపించాడూ? కైకేయి చాలా ధైర్యవంతురాలు. రెండుసార్లు భర్త దశరథుడి ప్రాణాలు కాపాడుతుంది. అందుకు కృతజ్ఞతాపూర్వకంగానైనా దశరథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సింది. కానీ, మాటతప్పి, కుట్ర పూరితంగా వ్యవహరించడమే కనిపిస్తోంది. ఆ రకంగా ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోయింది. వాల్మికి రామాయణంలోని ఇలాంటి విషయాల్నే పెరియార్‌ తన కీమాయణంలో ఎత్తి చూపాడు. గాంధీజీ కూడా ‘నా రాముడు రామాయణంలో ఉన్న రాముడు కాదు’ అని స్పష్టంగా ప్రకటించాడు. వాల్మికి కూడా తన రచనలో రాముడికి దైవత్వాన్ని అంటగట్టలేదు. పెరియార్‌ మాత్రమే కాదు, ఎంతో మంది పరిశోధకులు, పండితులు, తత్త్వవేత్తలు రాముణ్ణి దేవుడి అవతారంగా భావించలేదు.
ఇకపోతే రావణుడు వేదశాస్త్ర పురాణాలను మధించిన గొప్ప పండితుడనీ మూల రచయిత వాల్మికే స్వయంగా పొగడిన విషయం పెరియార్‌ ఎత్తి చూపారు. ఒక బెంగాలి రామాయణంలో రావణుడు బౌద్ధుడు అని కూడా ఉంది. ఏమైనా బ్రాహ్మణులు యాగాలు చేస్తూ, సోమరసం తాగుతూ లెక్కలేనన్ని మూగజీవాల్ని బలి ఇస్తూ ఉండడాన్ని రావణుడు సహించలేకపోయాడు. ఎందుకంటే, రాజుగా ఆయన చేసిన చట్టాల్ని బ్రాహ్మణులు ఉల్లంఘించారు. యజ్ఞయాగాల పేరిట జంతు బలులు చేస్తూ వచ్చారు. వాటిని ఆపటానికి వచ్చిన తాటకిని రాముడు చంపాడు. శూద్రుడయి ఉండి, శంభుకుడు వేదాలు చదివాడని రాముడు అతణ్ణి చంపాడు. (వాల్మికి రామాయణం: ఉత్తరాకాండ 75వ అధ్యాయం) మరి ఇవన్నీ దుర్మార్గాలే కదా?
రావణుడు సీతను ఎత్తుకు పోయాడూ అంటే… దానికి ఒక నేపథ్యం ఉంది. రావణుడికి ప్రీతిపాత్రమైన సోదరి శూర్పణఖ. ఆ శూర్పణఖ ముక్కు, చెవులు, స్తనాలు, జుట్టూ లక్ష్మణుడు కోసేస్తే… రావణుడు ఊరికే ఉండలేడు కదా? సీతను ఎత్తుకు పోయి, తన అశోక వనంలో అన్ని సౌకర్యాలు కల్పించి ఉంచాడు. సీతనే కాదు, రావణుడు అంతకు ముందు ఏ స్త్రీని ఎత్తుకుపోయి అనుభవించిన దాఖలాలు లేవు – అనే విషయం వాల్మికి రామాయణం: సుందరకాండ 95వ అధ్యాయంలో ఉంది. వాస్తవ దృక్కోణంలోంచి ఆలోచించే వారిని దుర్మార్గులుగా – దుర్మార్గంగా ఆలోచించే వారిని సన్మార్గులుగా తర్వాత కాలాలలో వైదిక మతస్థులు చిత్రీకరించి, అబద్దాలు ప్రచారం చేయడాన్ని పెరియార్‌ తీవ్రంగా నిరసించారు. అర్థరాత్రి లంకా నగరాన్ని దహించి, అమాయక పౌరుల్ని చంపిరావడం హనుమంతుడి సాహసకృత్యమా? వీరి గొడవలతో లంకలోని సామాన్య ప్రజలకు ఏమిటీ సంబంధం? యుద్ధంలో సుగ్రీవుణ్ణి చంపనని వాలి తన భార్యకు వాగ్దానం చేసి, తమ్ముడికి బుద్ది చెపుదామని వస్తాడు. మరి సుగ్రీవుడేం చేశాడూ? రాముడి శరణుకోరి స్వంత అన్నను చంపడంలో సహకరించమని వేడుకున్నాడు. అంటే కుట్ర పన్నాడు. కుట్రలో భాగమైన ధీరోధాత్తుడైన రాముడేం చేశాడూ? చెట్టు చాటున నిలబడి వాలిపైకి బాణం వదిలాడు. అది రాముడి సాహస కార్యమా? దొంగదెబ్బ తీయడం వీరుడి లక్షణమా? సరే, ఇది అలా ఉంచి విభీషణుడి సంగతి చూద్దాం! సోదరుడైన రావణున్ని చంపించి, లంకకు రాజు కావాలనుకుని రాముడికి ఆత్మార్పణ చేసుకున్న విభీషణుడిది సాహసకార్యమా? ఏముంది రామాయణంలో నీతి, ధర్మం, న్యాయం? కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు లేనేలేవు. అలాంటప్పుడు ఇది గొప్ప ఉదాత్తమైన రచన ఎలా అవుతుందని పెరియార్‌ ప్రశ్నించడంలో, నిరసించ డంలో న్యాయం ఉంది. వాస్తవాల్ని పక్కనపెట్టి, అభూత కల్పనల్ని నమ్మి భజనలు చేస్తామనే వారిని ఎవ్వరూ కాపాడలేరు.
బంగారులేడి ఉండదని తెలిసి కూడా రాముడు దానికోసం ఎందుకు పరుగెత్తాడూ? అని ప్రశ్నించాడు కదా మన వేమన. వాల్మికి రామాయణంలోని అయోధ్యకాండ 45వ అధ్యాయంలో సీత, లక్ష్మణున్ని నిందిస్తుంది. ”ప్రమాదంలో ఉండి సహాయం కోసం పిలుస్తున్న నీ అన్న రాముడి పిలుపు వినిపించుకోకుండా నువ్వు ఇక్కడే నా దగ్గరే ఎందుకు తిరుగుతున్నావూ? నన్ను అనుభవించాలన్న కోరికతోనేనా?” అని నిందారోపణ చేస్తుంది! సీత అగ్ని ప్రవేశం చేసి వచ్చినా, రాముడికి ఆమెపై అనుమానం పోదు. సీత పవిత్రురాలని వాల్మికి చెప్పినా రాముడు నమ్మడు. పైగా గర్భిణిగా ఉన్న సీతను అడవిలో వదిలిరమ్మని లక్ష్మణున్ని ఆజ్ఞాపిస్తాడు. చివరికి ఆమె భూమిలో కూరుకుపోయి ప్రాణాలు వదులుతుంది. ఇలాంటి పనులు దయార్ద్ర హృదయుడు, కరుణామయుడు చేయవల్సిన పనులేనా? అని పెరియార్‌ తన వ్యాఖ్యానంలో ప్రశ్నించాడు. ఇవేకాదు ఇంకా చాలా చాలా అంశాలు లేవనెత్తారు. అయితే చెప్పుకోవాల్సిన ముఖ్య విషయమేమంటే… ‘కీమాయణం’ హిందీలో ‘సచ్చీరామాయణ్‌’ పేరుతో ప్రసిద్ధి పొందింది. (యూట్యుబ్‌లో వీడియోలున్నాయి) 1967లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ‘సచ్చీ రామాయణ్‌’ను నిషేధించింది. ఆ నిషేధం చెల్లదని నాలుగేళ్ళ తర్వాత 1971లో అలహాబాదు హైకోర్టు కొట్టేసింది. జరిగిన అవమానం చాలని అప్పటి ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఊరుకుంటే పోయేది. దాన్ని ఇంకా పొడిగించి, తాము ఆ పుస్తకాన్ని నిషేధించడం సబబేనని సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకుంది. ఐదేండ్ల తర్వాత 1976లో సుప్రీంకోర్టు తుది తీర్పు చెప్పింది. పెరియార్‌ కీమాయణం – సచ్చీరామాయణ్‌ – వాల్మికి రామాయణంపై ఆధారపడి రాసిందేననీ, అందువల్ల దాన్ని నిషేధించాల్సిన అవసరం కనబడటం లేదని జస్టిస్‌ కృష్ణయ్యర్‌ తీర్పిచ్చారు. ఆరకంగా పెరియార్‌ వ్యాఖ్యానం విజయం సాధించింది. పెరియార్‌ వ్యాఖ్యానం సరైనదేనని, అది అందరూ చదవాల్సిన గ్రంథమని సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పినట్టయింది! ఇంకా చెప్పాలంటే వాస్తవాల్ని సుప్రీంకోర్టు బలపర్చినట్టయ్యింది. అబద్దాలే అధికారం చేజిక్కించుకుంటున్న ఈ కాలంలో… ఒక విచిత్రం జరిగింది! ఈ దేశానికి అబద్దాల ‘కేరళ సినిమా’ చూపించాలనుకున్న వారికి, ప్రజలు పిడిగుద్దులు గుద్ది ‘కర్నాటక సినిమా’ చూపించారు కదా? సామాన్య ప్రజలు మేల్కొం టున్నారు. నిజాలు గ్రహిస్తూ, చైతన్యవంతులవుతున్నారు!
– డాక్టర్‌ దేవరాజు మహారాజు
 వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ
అవార్డు విజేత, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌

Spread the love