– గిరిజన విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వినతి
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజకవర్గంలోని గిరిజన, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేసేందుకు అశ్వారావుపేట లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ప్రత్యేక వినతిపత్రాన్ని సమర్పించారు.
అశ్వారావుపేట నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ, గిరిజన ప్రాంతం కావడంతో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించాలంటే విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని ఎమ్మెల్యే వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లలేక సాంకేతిక విద్యకు దూరమవుతున్నారని పేర్కొన్నారు.
అశ్వారావుపేటలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తే అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని తెలిపారు. ముఖ్యంగా గిరిజన, ఎస్సీ, బీసీ, పేద కుటుంబాల విద్యార్థులకు తక్కువ వ్యయంతో నాణ్యమైన డిప్లొమా విద్య అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతలో పెంపొందించడంలో పాలిటెక్నిక్ విద్య కీలకమని, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అశ్వారావుపేటలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు అత్యవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కళాశాల ఏర్పాటుతో స్థానిక యువతకు సాంకేతిక విద్యతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని తెలిపారు.
ఈ ప్రతిపాదనను ప్రభుత్వం అన్ని కోణాల్లో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు సమావేశం అనంతరం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. ప్రభుత్వం త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకుని కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



