Thursday, July 2, 2026
E-PAPER
Homeఖమ్మంఏరియా ఆస్పత్రి.. సేవలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్థాయిలోనే

ఏరియా ఆస్పత్రి.. సేవలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్థాయిలోనే

- Advertisement -

– 27 ఖాళీలతో కుంటుపడుతున్న వైద్యసేవలు
– నిర్మాణంలో కొత్త భవనం, ప్రజలకు మాత్రం ఇబ్బందులే
నవతెలంగాణ – అశ్వారావుపేట 

అశ్వారావుపేట నియోజకవర్గానికి కేంద్రంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీ.హెచ్.సీ) నుంచి 100 పడకల ఏరియా ఆసుపత్రి గా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. కొత్త భవనం, ఆధునిక పరికరాల కోసం నిధులు కూడా మంజూరయ్యాయి. అయితే కాగితాలపై ఏరియా ఆసుపత్రిగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత, పూర్తి స్థాయి వైద్య సేవల లేమితో ప్రజలు ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నారు.

సిబ్బంది కొరత తీవ్రం:
ఆసుపత్రి క్యాడర్ స్ట్రెంగ్త్ ప్రకారం మొత్తం 48 పోస్టులు మంజూరయ్యాయి. కానీ ప్రస్తుతం 21 మంది మాత్రమే విధుల్లో ఉండగా, 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 56 శాతానికి పైగా ఖాళీలు ఉన్నాయి.

ప్రధానంగా:
డిప్యూటీ సివిల్ సర్జన్ – 4 పోస్టులో 1 మాత్రమే ఉన్నారు, 3 ఖాళీలు ఉన్నవి.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ – 11 పోస్ట్ లకు 6 మాత్రమే ఉన్నారు, 5 పోస్ట్ లు ఖాళీలు.
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ లేరు.
హెడ్ నర్స్ పోస్ట్ లు 2 మొత్తం ఖాళీ.

స్టాఫ్ నర్స్ పోస్ట్ లకు 10 పోస్ట్ లు ఖాలీ లే.కానీ సిబ్బంది సర్దుబాటు లో భాగంగా జీజీహెచ్ కొత్తగూడెం నుండి 5,సీ.హెచ్.సీ పాల్వంచ నుండి 1, బూర్గంపాడు నుంచి 1 చొప్పున మొత్తం 7 మంది డిప్యుటేషన్ పై అ‌శ్వారావుపేట లో పనిచేస్తున్నారు.

ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 2 కి 1 మాత్రమే ఉన్నారు.

మిడ్‌వైఫ్ మొత్తం ఖాళీలే.

డార్క్‌రూమ్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.ఈ ఆసుపత్రిలో సాధారణ రుగ్మతలు నుంచి పిల్లలకు సోకే రోగాలకు, కాన్పులు,కుక్క కాటు,పాము కాటు,కాలిన గాయాలకు, రోడ్డు ప్రమాదాలకు నిత్యం వైద్యసేవలు అందించాలి.

వైద్యసేవలపై ప్రభావం:
ఇంత పెద్ద ఎత్తున ఖాళీలు ఉండటంతో రోగుల నిరీక్షణ సమయం పెరుగుతోంది. నిపుణుల వైద్య సేవలు పరిమితమవుతున్నాయి. అత్యవసర సేవలపై ఒత్తిడి పెరుగుతోంది. నర్సింగ్ సిబ్బంది కొరతతో ఇన్‌పేషెంట్ సేవలు ప్రభావితమవుతున్నాయి. చిన్న సమస్యలకే రోగులు కొత్తగూడెం, ఖమ్మం లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

కొత్త భవనం.. పాత సమస్యలే
ప్రభుత్వం ఆధునిక భవనం నిర్మాణం చేపట్టడం స్వాగతించదగ్గ అంశమే. కానీ భవనం మాత్రమే సరిపోదు. అవసరమైన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పరికరాలు, మందులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నప్పుడే ఏరియా ఆసుపత్రి లక్ష్యం నెరవేరుతుంది. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న అశ్వారావుపేట ఆసుపత్రిలోనే సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉంటే, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం ఎలా అందుతుంది?  కోట్ల రూపాయలతో భవనం నిర్మించినా, అందులో సేవలు అందించే సిబ్బంది లేకపోతే ప్రజలకు ప్రయోజనం ఏమిటి?  అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం చేయాల్సింది
ఖాళీగా ఉన్న 27 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. స్టాఫ్ నర్సులు, వైద్య నిపుణుల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. డయాగ్నస్టిక్ సేవలు, మందుల లభ్యతను మెరుగుపరచాలి. 100 పడకల ఏరియా ఆసుపత్రికి తగిన పూర్తి స్థాయి మౌలిక వసతులు, సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావాలి. ఏరియా ఆసుపత్రి హోదా కేవలం బోర్డు పైనే కాకుండా, ప్రజలకు అందే వైద్యసేవల్లోనూ కనిపించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -