సారంపల్లి మృతి
రైతాంగ ఉద్యమానికి
తీరని లోటు
సంతాప సభలో టి.సాగర్, జి.నాగయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సారంపల్లి మల్లారెడ్డి తన జీవితం మొత్తాన్ని రైతుల కోసం అంకితం చేశారనీ, ఆయన మరణం రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ పేర్కొన్నారు. మల్లారెడ్డి అంతిమయాత్ర మంగళవారం ఉదయం 12 గంటలకు ఎంబీ భవన్ వద్ద మొదలై గాంధీ ఆస్పత్రి వరకు కొనసాగుతుందనీ, అందులో ఏఐకేఎస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, కోశాధికారి కృష్ణప్రసాద్, ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు కర్నాటక రాష్ట్రాల రైతు సంఘం నాయకులు పాల్గొంటారని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య, సాగర్ మాట్లాడుతూ…రైతు ఉద్యమ చరిత్రలో నిలిచిపోయే విధంగా పోరాటాలు నిర్వహించారనీ, భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ, తన జీవితం మొత్తం పేదలు, రైతులు, కూలీలు, శ్రామికుల సమస్యల కోసం పోరాడటానికే అంకితం చేసిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు. పోలీస్ పటేల్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజంలోని అసమానతలను, పేద రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దగ్గరగా గమనించారనీ, పోలీసుల నిఘా నుంచి తప్పించుకుని రహస్య జీవితం గడుపుతున్న ఓంకార్ కి తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తూ మల్లారెడ్డి ఉద్యమానికి తన వంతు సహకారం అందించారని గుర్తుచేశారు.ఈ విషయం పోలీసులకు తెలియడంతో 1971లో పోలీస్ పటేల్ ఉద్యోగానికి రాజీనామా చేసి తన జీవితాన్ని పూర్తిగా ప్రజా ఉద్యమానికి అంకితం చేశారనీ, అదే ఆయన రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపుగా నిలిచిందని తెలిపారు. రైతులకు భూమి హక్కు, సాగునీరు, గిట్టుబాటు ధర, వ్యవసాయ రుణాలు, కూలీల సమస్యలు, గ్రామీణ పేదల హక్కులు వంటి అనేక అంశాలపై ఆయన నిరంతరం పోరాడారని గుర్తుచేశారు. రైతుల జీవన పరిస్థితులు, వ్యవసాయ సమస్యలు, గ్రామీణ సమాజంలోని మార్పులు, రైతాంగ ఉద్యమాల అవసరం వంటి అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా తన రచనల ద్వారా వివరించారనీ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే మరో పోరాట ఆయుధంగా కలాన్ని ఆయన వాడుకున్నారని కొనియాడారు. ఆయన మరణం రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు ఆయన చూపిన ప్రజా ఉద్యమ మార్గంలో నడవడం, ఆయన ఆదర్శాలను కొనసాగించడం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి, కోశాధికారి మూడ్ శోభన్, సహాయ కార్యదర్శి వెంకట్ మావో, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, బొప్పని పద్మ, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి అనగంటి వెంకటేష్, ఐత విజయ్, ఆంజనేయులు, శివ, విజయ్ పాల్గొన్నారు.
జీవితాన్ని రైతులకు అంకితం చేసిన గొప్పవ్యక్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



