ప్ర‌తి యువ‌తికీ ఓ మార్గ‌ద‌ర్మ‌కం

Every young woman has a pathకండరాల సమస్యతో చక్రాల కుర్చీకే పరిమితమయింది. కానీ ఆమె ఆలోచనలు మాత్రం అపరిమితంగా ప్రయాణించాయి. భారతదేశం మొత్తం ఆ ఆలోచనలు వ్యాప్తి చెందాయి. ఆమే అసోం రచయిత్రి సర్మిష్ట ప్రీతమ్‌. గ్రామీణ భారతీయురాలైన ఈ అమ్మాయి రచించిన రంగ్‌(రంగు) అనే పుస్తకానికి కమింగ్‌-ఆఫ్‌-ఏజ్‌ స్టోరీ అవార్డు సైతం అందుకుంది. ఆ పుస్తకం ఇటీవల ఆంగ్లంలో విడుదలైంది. పేదరికం, అసమానతలు, వివక్షల మధ్య మన దేశంలో పెరుగుతున్న ప్రతి యువతికి ఈ పుస్తకం ఓ మార్గదర్శకం అంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
పదమూడేండ్ల కిందట సర్మిష్ట అసోంలోని అత్యంత పేదరికంలో కొట్టుమిట్టాడుతూ కుల వివక్షను ఎదుర్కొంటూ మద్యపానానికి బానిసలైన ఓ గ్రామంలో తన గుర్తింపు కోసం జీవితకాల పోరాటం చేసిన పరిధి అనే యువతి గురించి రంగ్‌ పేరుతో ఓ పుస్తకం రాశారు. జనవరి 2024లో ఈ పుస్తకాన్ని రంజితా బిస్వాస్‌ ఆంగ్లంలోకి అనువదించగా, సైమన్‌, షుస్టర్‌ ప్రచురించారు. అసోం గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఆడపిల్ల జీవితాన్ని దేశ వ్యాప్త పాఠకులు అర్థం చేసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
లోతుగా ఆలోచించాలి
‘బినీత్‌ ది సిమోలు ట్రీ’ అనే పేరుతో విడుదలైన ఈ ఆంగ్ల పుస్తకం పేద ప్రజల సామాజిక నిర్ణయాధికారులు, సాంస్కృతిక అసమానతలు, పితృస్వామ్య వ్యవస్థ, ఎదుగుదల, ఎంపికల విషయంలో సర్మిష్ట తన సొంత విలువలపై జీవితాన్ని నిర్మించుకున్న ప్రధాన పాత్రతో ప్రయాణిస్తుంది. మహిళల జీవితాలు తరతరాలుగా ఎంతటి దుర్బలత్వంలో మగ్గిపోతున్నాయో ఆ పాత్ర మనకు తెలియజేస్తుంది. ‘పరిధి అనేది గ్రామంలోని స్త్రీలందరి సమ్మేళనం. సంఘాలు, వయసు, వర్గాలు, సామాజిక స్థితిగతులు అన్నీ ఇందులో మిళితమై ఉంటాయి. ఎందుకంటే ఎన్నో ఏండ్లుగా వారి పోరాటాలన్నిటికీ సారథ్యం వహిస్తున్నది పితృస్వామ్య వ్యవస్థ. నేను ఈ పాత్రకు తన జీవితంలోని ప్రతి విషయంలో పోరాడే శక్తిని, ప్రతిస్పందించగలిగే భావోద్వేగ ఆలోచనలను ఇచ్చాను. ఎందుకంటే గ్రామీణ సమాజంలోని ప్రతి యువతి లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను’ అని 38 ఏండ్ల సర్మిష్ట చెప్పారు.
జ్ఞాపకాలే ప్రాణం పోశాయి
సర్మిష్ట డిసెంబర్‌ 18, 1987లో అస్సాంలోని నాగావ్‌లోని ఫులగురిలో పుట్టారు. ఐదేండ్ల వయసులో ఆమెకు కండరాల సమస్య వచ్చింది. ఎనిమిదేండ్లు వచ్చే సరికి శారీరకంగా బలహీనమైపోయింది. దాంతో వీల్‌ చైర్‌కే పరిమితమయింది. తల్లి,దండ్రులు అందించిన ప్రోత్సాహంతో ఫులగురిలోని ఎల్‌పీ పాఠశాలలో తన ప్రాధమిక విద్యను పూర్తి చేసింది. తర్వాత అక్కడే ఉన్నత పాఠశాలలో చేరింది. తర్వాత కళాశాల విద్యను రాహా కాలేజీలో పూర్తి చేసింది. ఆ తర్వాత ఎకనామిక్స్‌లో డిగ్రి పూర్తి చేసింది. స్టోరీ చదువుతున్నపుడు అస్సాంలో సర్మిష్ట తన గ్రామంలో పెరుగుతున్న రోజులు మనకు గుర్తుకు వస్తాయి. ‘బినీత్‌ ద సిమోలు ట్రీ’ పాత్రలకు తన చిన్ననాటి జ్ఞాపకాలే ప్రాణం పోశాయని ఆమె చెప్పారు.
చూస్తూ పెరిగింది
పరిధి తండ్రి మత్తులో ఇంటికి వచ్చి తల్లితో పాటు ఆమెను కూడా చిత్ర హింసలు పెట్టేవాడు. తన ఇంట్లో మద్యపాన వ్యసనం వల్ల జరుగుతున్న దాడులను చూస్తూ పెరిగింది. ఆమె ఇంటి పక్కనే ఉండే జోరుదేవ్‌ ఆ వ్యసనానికి బానిసై ఇంట్లోని సామాన్లు మొత్తం అమ్మెస్తుంటాడు. అతని నుండి రక్షించుకోడానికి ఆమె తల్లికి ఇంట్లో ఇక ఏమీ మిగిలి వుండవు. అయితే సర్మిష్ట తన వ్యక్తిగత జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు. ఇంట్లో ఎప్పుడూ పుస్తకాలపై చర్చ జరుగుతూ జ్ఞానాన్ని పంచుకునేవారు. ‘కానీ మా గ్రామంలోని అనేక గిరిజన కుటుంబాల జీవితాలను నాశనం చేసిన మద్యపానం, దాని వల్ల జరుగుతున్న హింసను నా యువ మనసు నుండి తీసివేయలేకపోయాను. ఆ కుటుంబాల్లోని స్త్రీలు భర్తల నుండి విడిపోయి సొంతంగా బతికే అవకాశం కూడా లేదు’ అని ఆమె చెప్పారు.
కాదనలేని సంబంధం…
జోరుదేవ్‌ తన గ్రామంలోని ఒక యువకుడి స్నేహంతో ఇలా తయారవుతాడు. అతను తన మద్యం కోరికను తీర్చుకునేందుకు అన్ని వస్తువులను అమ్మేస్తాడు. ‘అతని తల్లి అతని నుండి వస్తువులను దాచడానికి మట్టి తవ్వి ఆ గుంటల్లో వాటిని దాచి పెట్టేది. ‘నా వయసు పెరిగే కొద్దీ పేదరికం, వివక్ష, మానసిక ఆరోగ్యం, వ్యసనాల మధ్య కాదనలేని సంబంధం ఉందని గ్రహించాను. ఈ విషయాలనే నా పుస్తకంలో చూపించాలను కున్నాను’ అని ఆమె చెప్పారు. పేదరికం, మద్యపానంతో పాటు సర్మిష్ట పాత్రలలో కుల ఆధిపత్యం చెలాయించే వ్యక్తులు, తరతరాలుగా అణచివేయబడిన వారు కూడా ఉన్నారు.
కుల వివక్ష ఎదుర్కొంటున్నారు
సర్మిష్ట ఎకనామిక్స్‌లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నప్పుడు తనకు పరిచయమైన ప్రచురణకర్తను వివాహం చేసుకుంది. అతను బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. దాంతో తన జీవిత అనుభవం నుండి కూడా కొన్ని విషయాలను చిత్రీకరించింది. ఆమె తన 17 ఏండ్ల సంసార జీవితంలో విభిన్న కులాల కారణంగా ఎదుర్కొన్న సమస్యలు, కుటుంబాల నుండి ఎదురైనా సమస్యలను కూడా ఈ పుస్తకంలో చూపించారు. ‘ప్రస్తుతం గిరిజన సంఘాలు పాఠశాల విద్య వల్ల అభివృద్ధి చెందాయి. డ్రాపౌట్‌ రేట్లు తగ్గాయి. కానీ వారు నేటికీ కులం పేరిట వివక్షను ఎదుర్కొంటున్నారు. కులాంతర జంటలను వారి కుటుంబాలు విడిచిపెట్టాయి. వారి పట్ల హింస, విభజన, అవమానం ఇప్పటికీ ఉన్నాయి’ ఆమె చెప్పారు.
బలమైన మహిళగా…
పరిధి తన పుస్తకాలు, కళతో అనుభూతి చెందుతూ తన జీవితాన్ని తానే మలుచుకుంటుంది. వ్యవస్థతో పోరాడి మనుగడ సాగించిన బలమైన మహిళగా ఎదుగుతుంది. ‘రంగ్‌’ 2012లో విడుదల ఓ ఆత్మకథ. 2015లో రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య పురస్కారాన్ని, 2019లో మునిన్‌ బోర్కటాకి అవార్డును, హోమన్‌ బార్గోహానీ బాటా సాహిత్య అవార్డును, 2017లో డెవ్‌సన్స్‌ ప్రత్యేక సాహిత్య పురస్కా రాన్ని గెలుచుకుంది. 2021లో చిత్ర నిర్మాత బాబీ సర్మిష్ట జీవితం ఆధారంగా అస్సామీ చిత్రం డియోకా (వాకింగ్‌ ఇన్‌ ది ఎయిర్‌)ను శర్మ బారువా ప్రకటించారు. అదే ఏడాది వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి చికిత్స ఖర్చుల కోసం ప్రభుత్వం సహాయం చేయాలని సర్మిష్ట ఓ న్యాయవాదిగా వాదించారు.

Spread the love